తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూలై 6 నుండి 9వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మే 24, శనివారం నాడు తన కార్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాలేజ్ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వి.వెంకటరమణలతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి సమీక్ష నిర్వహించారు.
కోవిడ్-19 నిబంధనలకు లోబడి, యూజీసీ ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించినందున, కోవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఎంసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్సెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, పీజీఎల్ సెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది.
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:
- ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ – జూలై 6 నుంచి 9 వరకు
- ఈసెట్ – జూలై 4
- ఐసెట్ – జూలై 13
- పీజీ ఈసెట్ – జూలై 1 నుంచి 3 వరకు
- ఎడ్సెట్ – జూలై 15
- లాసెట్ మరియు పీజీ లాసెట్ – జూలై 10
- పీఈసెట్ – త్వరలో ప్రకటన
- పాలీ సెట్ – జూలై 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu