గోవాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’ (Save Goa Campaign) ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన ప్రసంగం చేశారు. అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతినిధిగా తాను ఈ సభకు వచ్చానని తెలిపారు. గోవాలో ప్రస్తుత బీజేపీ పాలనలో రాష్ట్రం డ్రగ్స్, భూ మాఫియాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు.
గోవా సీఎం ప్రమోద్ సావంత్ను ప్రజలు ‘ప్రాపర్టీ సావంత్’ అని పిలుస్తున్నారని, ఆయన రాష్ట్రంలోని భూములను ఇతరులకు ధారాదత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘాన్ని (CEC) అడ్డుపెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరియు పేదల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ దిల్లీలో దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, తాను ఆయన తరఫున గోవా గడ్డపై గళం వినిపిస్తున్నానని చెప్పారు. రుతుపవనాలు కేరళ నుంచి గోవాకు సోకినట్లే, కాంగ్రెస్ విజయ పవనాలు కూడా కేరళ నుంచి గోవాకు, అక్కడి నుంచి దిల్లీకి మారుతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తీరుతుందని జోస్యం చెప్పారు.
గోవాలో బీజేపీ పాలనను ‘రావణుడి’ పాలనతో పోల్చిన ఆయన, రావణుడిని ఓడించడానికి రాముడి లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గోవా నుంచి హైదరాబాద్కు పదే పదే డ్రగ్స్ వస్తున్నాయని, అందుకే తాము తెలంగాణలో ‘ఈగల్ ఫోర్స్’ ఏర్పాటు చేసి డ్రగ్స్ మూలాలను ఏరివేస్తున్నామని తెలిపారు. దేశానికి మత్తు నుంచి విముక్తి కల్పిస్తామనే ప్రధాని మోదీ మాటలకు, గోవాలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదని, ఇక్కడి బీజేపీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. గోవా సభ ముగిసిన వెంటనే ఆయన దిల్లీకి బయలుదేరి వెళ్లారు.








































