తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించిన విచారణలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సిట్) తాజాగా బీజేపీకి చెందిన మరొక కీలక నేతకు సమన్లు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో ఆయన నవంబర్ 21న ఉదయం 10.30 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరుకావాలని, లేదంటే అరెస్ట్ చేస్తామని తెలిపారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న పార్టీ కార్యాలయానికి పంపిన నోటీసులో దర్యాప్తు అధికారి బీ గంగాధర్, సంతోష్‌ను వచ్చేటప్పుడు నిందితుడు అతనిని సంప్రదించిన మొబైల్ ఫోన్ కూడా తన వెంట తీసుకురావాలని కోరారు. కాగా ఈ కేసు విచారణలో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీకి సన్నిహితులుగా ఉన్న తుషార్ వెల్లపల్లి, జగ్గు స్వామి, బీ శ్రీనివాస్ షా బీఎల్ సంతోష్‌లకు సమన్లు జారీ చేసింది.
కాగా ఈ కేసులోని ముగ్గురు నిందితులలో ఒకరైన రామచంద్ర భారతి మరియు టిఆర్ఎస్ ఎమ్మెల్యే పి రోహిత్ రెడ్డి మధ్య రికార్డ్ చేయబడిన సంభాషణలో సంతోష్ పేరు ఉచ్చరించబడింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లను సంతోష్‌కు చెబుతానని, వారందరూ సిద్ధమైతే తాను నగరానికి వస్తానని భారతి వాయిస్‌లో చెబుతున్నట్లుగా ఆడియో క్లిప్ లో ఉంది. దీంతో సిట్ అధికారులు సంతోష్‌ను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ అయిన విషయం బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సమర్పించిన మధ్యంతర పిటీషన్‌తో బయటపడింది. అయితే ఈ కేసులో ప్రేమేందర్ రెడ్డి శుక్రవారం హైకోర్టులో మధ్యంతర పిటీషన్ (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్-ఐఏ) దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీజనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్)కు సిట్ నోటీసు జారీ చేసిందని, అలాగే కరీంనగర్‌కు చెందిన అడ్వొకేట్ శ్రీనివాస్‌కు కూడా సిట్ నోటీస్ ఇచ్చిందని ప్రేమేందర్ రెడ్డి తన ఇంటరిమ్ పిటీషన్లో తెలిపారు. వారిద్దరికీ సిట్ ఇచ్చిన నోటీస్ ప్రతులను ఆయన తన పిటీషన్‌కు జత చేశారు. ఈ సిట్ నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ప్రేమేందర్ రెడ్డి కోర్టును కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE