ఎస్ఎన్డీపీతో నగరంలో వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది: మంత్రి తలసాని శ్రీనివాస్

Minister Talasani Srinivas Inaugurates Bridge at Picket Nala in Begumpet Division under SNDP Program,Minister Talasani Srinivas Yadav,Talasani Srinivas Inaugurates Bridge,Inaugurates Bridge at Picket Nala,Mango News,Mango News Telugu,Talasani Srinivas Yadav Inaugurates Bridge, Picket Nala in Begumpet Division,SNDP Program,Telangana Latest News And Updates,Talasani Srinivas Yadav,Picket Nala Begumpet,SNDP Program,TRS Party

ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిష్కారం అవుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో గల పికెట్ నాలాపై ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద 10 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులలో నిర్మాణం పూర్తయిన మొదటి నిర్మాణం ఈ బ్రిడ్జి అని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుండి వరదతో పికెట్ నాలా పరిసర కాలనీల ప్రజలు ముంపుకు గురై అనేక ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎస్ఎన్డీపీ క్రింద 10 కోట్ల రూపాయల వ్యయంతో నాలాపై గతంలో ఉన్న దానికన్నా ఎత్తులో, వెడల్పు తో నూతన బ్రిడ్జి నిర్మించడం జరిగిందని వివరించారు. ఈ పనులను అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయడం పట్ల మంత్రి అధికారులను అభినందించారు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ రహదారిలో నాలాపై బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా వాహనదారులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేసిన ట్రాపిక్ పోలీసులను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి కి నోచుకోని నాలాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎస్ఎన్డీపీ కార్యక్రమంకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రం క్రింద వందల కోట్ల రూపాయల వ్యయంతో నగరంలోని అనేక నాలాల అభివృద్ధి, పునరుద్దరణ పనులను చేపట్టినట్లు వివరించారు. పికెట్ నాలాపై బ్రిడ్జి నిర్మాణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్‌లోని దాదాపు 40 కాలనీల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా అన్నానగర్ బస్తీ, ఆసియాలోని అతిపెద్ద మురికివాడలలో ఒకటిగా ఉన్న రసూల్‌పురా బస్తీ, బీహెఛ్ఈఎల్ కాలనీ, ఇక్రిశాట్ కాలనీ, సౌజన్య కాలనీ మరియు బోయినపల్లిలోని మరికొన్ని ప్రాంతాలకు వరద ముంపు సమస్య నుండి శాశ్వత విముక్తి లభించిందని చెప్పారు.

అదేవిధంగా ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రిందనే బేగంపేట నాలా అభివృద్ధి పనులు కూడా 46 కోట్ల వ్యయంతో వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ నాలాకు కూడా ఎగువ నుండి వచ్చే వరద నీటితో నాల సమీపంలోని బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీ, ప్రకాష్ నగర్ తదితర కాలనీలు ముంపుకు గురయ్యేవని తెలిపారు. త్వరలో ఈ పనులు కూడా పూర్తవుతాయని, ఈ ప్రాంత ప్రజల ముంపు సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారం కానున్నదని తెలిపారు. ఇప్పటికే చేపట్టిన పలు అభివృద్ధి పనుల కారణంగా గతంలో కన్నా ముంపు ప్రభావ తీవ్రత కొంతమేర తగ్గిందన్నారు. నాలాల అభివృద్ధి పనులలో భాగంగా ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగిస్తున్నట్లు చెప్పారు. అక్రమ నిర్మాణాల తొలగింపుతో నిరాశ్రయులుగా మారుతున్న వారికి ప్రత్యామ్నాయ పునరావాస సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశ్వనగరంగా ఎంతో అభివృద్దిని సాధించిన నగరంలోని ప్రజలకు కోట్లాది రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ప్రభుత్వం అభివృద్ధి పనులను కొనసాగించిన విషయాన్ని గుర్తుచేశారు. నగరంలో అనేక రహదారులను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు వంటివి నిర్మించినట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, జీహెఛ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కార్పొరేటర్ లు మహేశ్వరి, కోలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఉప్పల తరుణి, ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈ భాస్కర్ రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ట్రాపిక్ ఏసీపీ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ లింగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + sixteen =