తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయమై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన కొన్ని ప్రశ్నలను సంధించారు. ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎందుకు కలవలేకపోయారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులందరూ పరిష్కారం కావాలని కోరుతున్నారని, దీక్షలు చేయటం కాదని రేవంత్ పేర్కొన్నారు. ఢిల్లీ దాకా వెళ్లిన ముఖ్యమంత్రి, పక్కనే ఉన్న ప్రధానిని కలవకపోవడంపై తమకు సందేహాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. యేడాదంతా ఎన్నో వ్యయప్రయాసలు పడి రైతులు పంట పండిస్తే కనీసం దానిని కొనుగోలు చేయటం కూడా ఈ ప్రభుత్వాలకు చేతకావటం లేదని రేవంత్ విమర్శించారు.
నాడు చివరి వరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి రైతులకు హామీ ఇచ్చారని, నేడు మాట మారుస్తున్నారని, నెపాన్ని కేంద్రపై తోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయిస్తే వరి ధాన్యం సేకరణ బాధ్యత తీసుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. ఈ రెండు పార్టీలు సమస్యను పరిష్కరించకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నాయని ప్రశ్నించారు. అసలు మొదట తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ ఇచ్చింది నిజం కాదా? అని అన్నారు. ఇప్పుడు ఆ లేఖను అడ్డుపెట్టుకుని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విషయాన్నీ పక్కదారి పట్టించటం నిజం కాదా? అని ప్రశ్నించారు.
బీజేపీ, టీఆర్ఎస్లు చేసిన తప్పును ఒకరిపై మరొకరు నెట్టుకుంటున్నారని, దీని వలన రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతోందని మండిపడ్డారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రధాన బాధ్యత అన్నారు. ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కేంద్రం బాధ్యత కాదని రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచిందని, టీఆర్ఎస్ విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.12 వేల కోట్ల భారాన్ని మోపిందని ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ