భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా గురువారం (నవంబర్ 26) ఘనంగా రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్లతో పాటు రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులందరినీ స్మరించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం ద్వారా దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు.
వైవిధ్యభరితమైన భారత్లో రాజ్యాంగం కేవలం పార్లమెంట్, న్యాయస్థానాల పరిధిలోనే కాకుండా సామాన్య ప్రజల జీవనంలో, ముఖ్యంగా యువత ఆలోచనల్లో ప్రతిధ్వనించాలని ఆయన పేర్కొన్నారు. తన బాల్యాన్ని, నిరాడంబర పరిస్థితులను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ, సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి సేవ చేసే అవకాశం కల్పించడం మన రాజ్యాంగ గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.
పుట్టిన పరిస్థితులు ఎవరి భవిష్యత్తుకు హద్దులు కాదని రాజ్యాంగం భరోసా ఇస్తుందని పేర్కొంటూ, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ముద్ర, పీఎం-స్వనిధి, యూపీఐ వంటి పథకాలతో సామాజిక, ఆర్థిక న్యాయం, సమ్మిళితత్వం సాకారమవుతున్నాయని వివరించారు.
రాజ్యాంగ చరిత్ర, సవరణల గురించి ప్రస్తావిస్తూ, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవారే గతంలో దాన్ని బలహీనపరిచిన సందర్భాలను ప్రధాని విమర్శించారు. 1951 మొదటి సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 38వ, 39వ సవరణలు, 356వ అధికరణ దుర్వినియోగం, 370, 35ఏ అధికరణల వంటి అంశాలను యువత అధ్యయనం చేయాలని సూచించారు.
ఈ ఏడాది నక్సలిజాన్ని నిర్మూలించగలిగామని, ఇప్పుడు మిగిలి ఉన్న ‘మేధో నక్సల్స్’ (అర్బన్ నక్సల్స్) అభివృద్ధి రథాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అదేవిధంగా ప్రతిపక్షాల వైఖరిపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆలోచనలో ‘ఇండియా ఫస్ట్’, ఆచరణలో ‘కర్తవ్య పాలన’ అనే రెండు సూత్రాలు మార్గదర్శకంగా నిలుస్తాయని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, 786 జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మైగవ్ పోర్టల్ ద్వారా 23 భాషల్లో రాజ్యాంగ పీఠిక పఠనానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేసింది.








































