తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

2021 Ugadi Festival, CM KCR Extends Ugadi Festival Wishes to People In the State, CM KCR Extends Ugadi Greetings People, CM KCR extends Ugadi greetings to people of Telangana, CM KCR extends Ugadi greetings to Telugu, KCR Ugadi Festival Wishes, Mango News, ugadi festival, Ugadi Festival Celebrations, Ugadi Festival Wishes, Ugadi Festival Wishes 2021, Ugadi Festival Wishes to People, Ugadi Festival Wishes to People In the State

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమన్నారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఉగాది ఆహ్వానం పలుకుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది నుంచే రైతు ప్రారంభిస్తారని, రైతును వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది రైతు జీవితంలో భాగమై పోయిందన్నారు.

ప్రతి ఏటా చైత్రమాసంతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ నాడు పచ్చడిని సేవించడం గొప్ప ఆచారమని సీఎం కేసీఆర్ అన్నారు. అప్పుడప్పుడే చిగురించే వేపపూతను, మామిడి కాతను, చేతికందే చింతపండులాంటి ప్రకృతి ఫలాలను తీపి, వగరు చేదు రుచుల పచ్చడి సేవించి పండుగను జరుపుకోవడం గొప్ప సందేశాన్నిస్తున్నదని సీఎం అన్నారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడుల వంటి జీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సజీవ సాంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడిని సేవిస్తారని సీఎం తెలిపారు.

ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవి చూసిన తెలంగాణ రైతు, స్వయంపాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని తెలిపారు. బ్యారేజీలు కట్టి, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి నదీజలాలను సాగరమట్టానికి ఎత్తుమీద వున్న సాగు బీల్లకు మళ్లించామని సీఎం గుర్తుచేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలను అందుకుంటున్నదన్నారు. మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తున్నదన్నారు. పాలమూరు ఎత్తిపోతలు, ఆన్ గోయింగ్ సాగునీటి ప్రాజెక్టులను మరి కొద్ది నెలల్లో పూర్తి చేసుకోబోతున్నామని సీఎం తెలిపారు. రైతు పండించిన పంటను ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసి రైతును కరోనా కష్ట కాలంలో ఆదుకుంటున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్నారు. విమర్శకుల అంచనాలను తారుమారు చేసి పంటల సాగు, ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నదన్నారు.

రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అందిస్తున్న భరోసాతో తెలంగాణ రైతు కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయన్నారు. విత్తనం నాటిన నుంచి పంట ఫలం చేతికొచ్చేదాకా రైతులకు అన్నిరకాల సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వారి కష్టాలను తన భుజాలమీదికి ఎత్తుకున్నదన్నారు. రైతును సంఘటిత పరిచేందుకు రైతు బంధు సమితులు ఏర్పాటు చేసి, ఊరూరా రైతుల కోసం వేదికలను నిర్మించామన్నారు. గత ఉమ్మడి రాష్ట్ర పాలనలో దండుగన్న తెలంగాణ వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండుగగా మార్చిందన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు తదితర రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి పథకాల అమలు కోసం ప్రతి ఏటా సుమారు 50 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని సీఎం తెలిపారు. రైతు కుటుంబాల జీవితాలలో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలలను నింపడమే తమ లక్ష్యం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 10 =