పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముంది: సీఎం కేసీఆర్

CM KCR, CM KCR High Level Meeting, CM KCR High Level Meeting With Senior Police Officials, KCR Meeting Senior Police Officials, Senior Police Officials, telangana, Telangana CM KCR, Telangana News, Telangana Political News

అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు. ఈ రోజు ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ప్రసంగించారు. సామాజిక రంగాలలో నిత్యం శాంతిభధ్రతల పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేయాల్సిన అవసరాన్ని సీఎం పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తున్నదని, పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందన్నారు.

సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. కలప స్మగ్లింగును గత పాలకులు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల కొందరికి అలుసుగా మారిందని, ఐతే దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నదని తెలిపారు. ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడంలో కేవలం అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్ పోలీసు వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరముందన్నారు. సమాజంలో భాగస్వామ్యమై నేరాలను అరికట్టినట్టు, ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా పోలీసులు అడవుల పట్ల అవగాహన పెంచుకుని, స్మగ్లింగు వంటి అటవీ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. అటవీశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ దిశగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు ఇరు శాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగు నివారణ చర్యల రూపకల్పనకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తద్వారా మాత్రమే సమాజానికి మనం అనుకున్న విధంగా సేవ చేయగలుగుతామన్నారు.

తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా వుందన్నారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజు, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకుగాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలను ఏమార్చే గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. దళితుల మీద దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పోలీసులకు సీఎం వివరించారు. ఆ దిశగా ఎప్పటికప్పుడు అప్రమత్తతతో మెలగాలన్నారు. బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు వ్యవస్థకున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారుల దగ్గరనుంచి కిందిస్థాయి పోలీసు వరకు సమాజంలో ఒకరిగా భాగస్వాములు కావాలని, చిన్నా పెద్ద తేడా లేకుండా పౌరులందరికీ గౌరవాన్ని ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసు స్ఫూర్తిని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి పోలీసుకున్నదన్నారు. ఆ క్రమంలో తమ దగ్గరికి రక్షణకోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ కోణంలో మెలగాలని సీఎం హితవు పలికారు.

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలని సీఎం చెప్పారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడుదారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. పోలీసు శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి, సర్వీసు ఆఖరి రోజున గౌరవప్రదంగా ఇంటిదాకా సాగనంపాల్సిన అవసరాన్ని సీఎం మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. తన జీవితకాలం పాటు డిపార్టుమెంటుకు సేవలందించిన ఉద్యోగి రిటైరయితే, వారిని సత్కరించి కారులో ఇంటికాడ దించివచ్చే మంచి సంప్రదాయాన్ని కొనసాగించాలని అన్నారు.

పోలీసు శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదన్నారు. డ్యూటీలో వుంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకానికి అర్హత కలిగిన వారసులకు, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని, దీనిపై తక్షణ కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్ లిస్టులో వున్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం సూచించారు. పోలీసు శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం మరింతగా కృషి జరగాల్సిన అవసరమున్నదని సీఎం తెలిపారు. పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళల కోసం 33శాతం రిజర్వేషన్లను అమలు పరుస్తున్న నేపథ్యంలో,ఆ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నదన్నారు. అందులో భాగంగా మహిళలు పనిచేసే పోలీసు కార్యాలయాలు స్థలాల్లో ప్రత్యేకించి రెస్ట్ రూములు, వసతులు కల్పించాలన్నారు.

హైదరాబాద్ లో పది లక్షల సిసి కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డీజీపీ సీఎం సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలొ సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని తెలిపారు. వ్యవస్థీకృత నేరాలమీద ఉక్కుపాదం మోపాలన్నారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్ లో నిర్మితమౌతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, అనురాగ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, రేంజ్ డిఐజీలు, జోనల్ ఐజీలు, తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =