పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రగతి పథంలో తెలంగాణ గ్రామాలు: సీఎం కేసీఆర్

CM KCR Held Review on Palle Pragathi Program and Development,CM KCR Review on Palle Pragathi Programme in Pragathi Bhavan,CM KCR,Telangana,CM KCR Review On Palle Pragathi Programme,Palle Pragathi,Pragathi Bhavan,Mango News,Mango News Telugu,Telangana CM KCR Review On Palle Pragathi Programme In Pragathi Bhavan,Telangana CM KCR Palle Pragathi Pragathi Bhavan Telangana Municipal Elections,TRS,CM KCR Holds Review Meeting With Officials On Palle Pragathi Programme,CM KCR Review Meet at Pragathi Bhavan,Palle Pragathi Program,Palle Pragathi Development,CM KCR Latest News,CM KCR On Palle Pragathi Program,Telangana News,Telangana

పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలు చాలావరకు పూర్తయ్యాయని, మిగిలిన కొద్దిపాటి గ్రామాల్లో కూడా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల పరిస్థితి పల్లె ప్రగతికి ముందు, పల్లె ప్రగతికి తర్వాత అన్నట్లుగా ఉందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పల్లె ప్రగతి పనులను సమీక్షించాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అద్భుతంగా అమలు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను, సర్పంచులు, గ్రామ కార్యదర్శులను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై మంగళవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి:

‘‘పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత వెల్లివిరియాలని ప్రభుత్వం ఆశించింది. ఈ లక్ష్యం వందకు వందశాతం నెరవేరుతున్నది. తెలంగాణ పల్లెలు పరిశుభ్ర, ఆరోగ్య ఆవాసాలుగా రూపాంతరం చెందాయి. పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో గుంతలను పూడ్చటం, పిచ్చిచెట్లను కొట్టేయడం, పాత బావులను, బొందలను పూడ్చడం వల్ల నీరు నిల్వ ఉండడం లేదు. దోమలు తగ్గాయి. ఈ ఏడాది డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలకపోవడానికి పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలే కారణం. అన్ని గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణం, ట్రాలీ ట్యాంకర్లతో కూడిన ట్రాక్టర్లు సమకూర్చడం, ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా, విలేజ్ కామన్ డంప్ యార్డుల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, వ్యవసాయ క్షేత్రాల్లో కల్లాల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లాంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకున్నది. అన్ని లక్ష్యాలను దాదాపు చేరుకుంటున్నది. ఇలా అన్ని గ్రామాల్లో ఇలాంటి వసతులు సమకూరడం దేశంలో మరెక్కడా లేదు. తెలంగాణ పల్లెలు ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం నిరంతరం కొనసాగాలి’’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ప్రగతి పథాన నడుస్తున్నాయి:

‘‘గతంలో గ్రామాల్లో పాలన, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా, అరాచకంగా ఉండేది. తెలంగాణ పల్లెలను గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. పరిపాలనలో సంస్కరణలు తెచ్చింది. తండాలు, గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చింది. ప్రతి గ్రామానికి గ్రామ కార్యదర్శిని నియమించింది. క్రమం తప్పకుండా పల్లె ప్రగతి కోసం నిధులను సమకూరుస్తున్నది. దేశంలో మరెక్కడా లేనివిధంగా కేంద్ర ఆర్ధిక సంఘం నిధులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను సమకూరుస్తున్నది. కరోనా కష్ట సమయంలో కూడా ఇతర ఖర్చులు తగ్గించుకొని మరీ గ్రామ పంచాయతీలకు నిధులను అందించింది. గ్రామ పంచాయతీలకు ఇపుడు నిధుల కొరత లేదు. విధులు నిర్వర్తించడానికి అవసరమైన అధికారాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చింది. గతంలో గ్రామ పంచాయతీల్లో మంచినీటి సరఫరా కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మిషన్ భగీరథ కారణంగా గ్రామ పంచాయతీలకు ఆ తలనొప్పులు పోయాయి. మంచినీళ్ల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. నిధుల కొరత లేకపోవడంతో విద్యుత్ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించగలుగుతున్నారు. 90శాతం వరకు గ్రామ పంచాయతీల్లో మంచి సర్పంచులు ఉన్నారు. వారిలో అత్యధికులు విద్యావంతులు, యువకులు కావడంతో చిత్తశుద్ధితో గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రామాలు ప్రగతి పథాన నడుస్తున్నాయి’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.

గ్రామాల్లో మొక్కలు నాటే సందర్భంలో ప్రతి ఇంటికీ మొక్కలు సరఫరా చేయాలి:

‘‘పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు రూ.5 లక్షల చొప్పున నిధులు, గ్రీన్ బడ్జెట్ కింద గ్రామ పంచాయతీ నిధుల్లో 10శాతం నిధులు, నరేగా నిధులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి మొక్కలు నాటి పెంచడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామాల్లో మొక్కలు నాటే సందర్భంలో ప్రతి ఇంటికీ మొక్కలు సరఫరా చేయాలి. ఇందుకోసం ముందుగానే ప్రతి ఇంటినుండి వారికి ఏ రకం మొక్కలు కావాలో అడిగి తెలుసుకొని ఇండెంట్ రూపొందించాలి. ఇండ్లకు పండ్లు, కరివేపాకు లాంటి మొక్కలను సరఫరా చేయాలి. ప్రతి ఇంటికీ ఏ మొక్కలు కావాలో ఎన్యూమరేట్ చేసి గ్రామంలో మొత్తం ఎలాంటి రకం మొక్కలు కావాలో నిర్ణయించాలి. వాటిని గ్రామ నర్సరీ నుండి కానీ, ఇతర నర్సరీల నుంచి కానీ తెప్పించి సరఫరా చేయాలి’’ అని సీఎం చెప్పారు.

రాష్ట్రంలోని 12,770 ఆవాస ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు:

‘‘గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సరీలు పెంచుతున్నాం. రాష్ట్రంలోని 12,770 ఆవాస ప్రాంతాల్లో నర్సరీలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 19,595 ఆవాస ప్రాంతాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్ణయించుకొని ఇప్పటికి 18,968 ఆవాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రకృతి వనాలను మరింత ఉపయోగకరంగా మార్చాలి. ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేయాలి. ఓపెన్ జిమ్ లు నెలకొల్పాలి. కూర్చోవడానికి సిమెంటు బెంచీలు ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీ ఈ బాధ్యతలు నిర్వర్తించాలి’’ అని సీఎం చెప్పారు.

అన్ని గ్రామాల్లో విలేజ్ కామన్ డంప్ యార్డులు ఏర్పాటు:

‘‘గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడానికి, చెట్లకు నీళ్లు పోయడానికి వీలుగా అన్ని గ్రామాల్లో ట్యాంకరు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాలకు ఇప్పుడవి సమకూరాయి. దీంతో గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పారిశుధ్యం నిర్వహించడం మరింత సమర్థవంతంగా జరుగుతున్నది. అన్ని గ్రామాల్లో విలేజ్ కామన్ డంప్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 12,734 గ్రామాల్లో ఇప్పటికే స్థలాలు గుర్తించి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మిగిలిన కొద్దిచోట్ల కూడా త్వరలోనే నిర్మాణం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. 12,738 చోట్ల వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతున్నది. రాబోయే మూడు నెలల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావాలి’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇంటి నిర్మాణ అనుమతులకు వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనే షరతు పెట్టాలి:

‘‘తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలి. ఇప్పటికే చాలా గ్రామాలు వందకు వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగిన గ్రామాలుగా మారాయి. మిగిలిన గ్రామాల్లో కూడా ప్రజలను చైతన్య పరిచి వందకు వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగిన గ్రామాలుగా మార్చాలి. ఇంటి నిర్మాణ అనుమతులకు వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనే షరతు పెట్టాలి. నరేగా నిధులను సంపూర్ణంగా, సమర్థవంతంగా, ప్రజోపయోగ పనుల కోసం వినియోగించే రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. ఉపాధి హామీ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అటు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు, ప్రజలకు ఉపయోగపడే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ ఏడాది 11 కోట్ల పనిదినాలు కల్పించాలని నిర్ణయించుకుంటే, ఇప్పటికే రాష్ట్రంలో 14 కోట్ల పనిదినాలు కల్పించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 20 కోట్ల పనిదినాలు కల్పించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి వచ్చిన అధికార బృందాలు కూడా తెలంగాణలో జరుగుతున్న పనులను చూసి ప్రశంసించడం మనకు గర్వకారణం” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మాజీ మంత్రులు డీఎస్ రెడ్యానాయక్, సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, జీవన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, సోయం బాపూరావు, అబ్రహం, చిరుమర్తి లింగయ్య, కృష్ణ మోహన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + seven =