గొర్రెల పంపిణీ, చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయి: సీఎం కేసీఆర్

CM KCR gives nod for second phase of sheep distribution, CM KCR Orders Minister Talasani to Start Second Phase Sheep Distribution Soon with Rs 6000 Cr, KCR gives nod for second phase of sheep distribution, KCR Orders Minister Talasani to Start Second Phase, KCR Orders Minister Talasani to Start Second Phase Sheep Distribution, Mango News, Rs 6k cr for sheep distribution, Second Phase Sheep Distribution, Telangana govt sanctions Rs 6000 crore for second phase, Telangana Second phase of sheep distribution

తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని, అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీఎం తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం అన్నారు. తెలంగాణలో వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి-ప్రభుత్వ కార్యాచరణ-రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాలపై ప్రగతి భవన్ లో మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5,000 కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని, ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో 6,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. దాంతో మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుంది. అంతే కాకుండా ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. దాంతోపాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారు. అనుబంధ కులవృత్తులను నిర్లక్ష్యం చేసి ధ్వసం చేశారు. నాడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జీవన ముఖచిత్రం కుప్పకూలిపోయిన పరిస్థితి. నాటి పాలకులకు తెలంగాణ సబ్బండ వర్గాల వృత్తి జీవనంలోని ప్రత్యేకత, వైవిధ్యం అర్థం కాలేదు, వారికి ఆ సోయి కూడా లేదు. అద్భుతమైన వృత్తి నైపుణ్యం కలిగిన బీసీ వర్గాలను అల్లుకొనే తెలంగాణలో కుల వృత్తుల జీవనం కొనసాగింది. ఉత్పత్తి, సేవా రంగాల్లో భాగస్వామ్యమైన సబ్బండ వర్గాలు కొనసాగించే కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముడిపడి వుంటది. అవన్నీ కూడా వ్యవసాయాన్ని అల్లుకొని కొనసాగుతాయి. ఉత్తర భారత దేశంలో మాదిరి కాకుండా వృత్తి కులాలన్నీ బీసీ వర్గాలే అధికశాతం నిర్వహించడం తెలంగాణకు ప్రత్యేకం. ఆ ప్రత్యేకతను గుర్తించిన నూతన తెలంగాణ ప్రభుత్వం వారి అందరికీ అండగా నిలిచింది. మిషన్ కాకతీయ పథకం ప్రారంభంతో మొదలైన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్థానం, సాగు నీరు వ్యవస్థలను మెరుగుపరిచింది. గ్రామానికి అదేరువుగా వున్న చెరువును నిత్య జలాలతో నింపి సజీవంగా వుంచి, ధ్వంసమైన కుల వృత్తుల పునరుజ్జీవనమే లక్ష్యంగా ఏడేండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. అద్భుతమైన ఫలితాలు రాబడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది” అని సీఎం వివరించారు.

గొర్రెల పంపిణీ, చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయి: 

తెలంగాణలో గొల్ల కురుమలు, యాదవుల కోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం, బెస్తలు ముదిరాజుల కులవృత్తి అభివృద్ధికోసం అమలు చేస్తున్న చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయని సీఎం తెలిపారు. “వ్యవసాయం తరువాత పెద్ద ఎత్తున ఆధారపడిన కుల వృత్తి చేనేత రంగం. ఒకనాడు బ్రాహ్మణులతో సమానంగా ప్రజల నుండి గౌరవాన్ని పొందిన పద్మశాలి వర్గం నాటి సమైక్య పాలనలో ఆకలి చావులకు ఆత్మహత్యలకు బలైపోయింది. వలస పాలకుల వరుస నిర్లక్ష్యంతో అవసాన దశకు చేరుకున్న చేనేత వృత్తి, ప్రభుత్వ చిత్తశుద్ధితో, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకున్నది. గాయాల పాలైన చేనేత వృత్తి గాడిన పడుతున్నది. అదే సందర్భంలో కల్లు గీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు సహా, నాయి బ్రాహ్మణ, రజక తదితర వృత్తి కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ వారిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథాన నడిపిస్తున్నది” అని సీఎం తెలిపారు.

గొర్రెల యూనిట్ పెంచిన ధరను రూ.1,75,000 గా సీఎం నిర్ణయించారు. ఇప్పటికే డీడీలు కట్టివున్న 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింప చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాజస్తాన్ ను అధిగమించి, షీప్ పాపులేషన్ లో తెలంగాణ దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని సీఎం తెలిపారు. చేపల పెంపకం వృత్తిని నిర్వహించే బెస్తలు, గంగపుత్రులు, ముదిరాజ్ ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది అని సీఎం అన్నారు. మత్స్య సంపద రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నదన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్ల నిర్మాణం తర్వాత తెలంగాణలోని రిజర్వాయర్ లు నిండి చెరువులు కుంటలు జలకలను సంతరించుకున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ఉచిత చేపల పంపిణీ అద్భుత ఫలితాలను సాధిస్తున్నదన్నారు. ప్రతీ గ్రామంలోని చెరువులో మత్స్య సంపద పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందని తెలిపారు. గతంలో ఇతర ప్రాంతాల్లో నుంచి తెలంగాణకు చేసుకునే చేపల దిగుమతి తగ్గిందన్నారు.

సముద్ర ప్రాంతాలకు దూరంగా వున్న దేశంలోని పలు పట్టణాలు నగరాల్లో చేపల ఎగుమతి కోసం చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో చెరువుల్లో చేపల ఉత్పత్తి ప్రక్రియను మత్స్య శాఖ పర్యవేక్షణలోనే వుంటుందన్నారు. చేపల పెంపకం సొసైటీలో 18 ఎండ్లు నిండిన అర్హులైన యువకులకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బీసీ వృత్తి కులాల అభివృద్ధిపైన నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seven =