దేశంలో కూలీల‌కు 14 కోట్ల ప‌నిదినాలు క‌ల్పించిన ఘ‌‌నత తెలంగాణ రాష్ట్రానిదే…

Development In Telangana, Errabelli, Errabelli Dayakar Rao, Errabelli Dayakar Rao About Gram Panchayats Development, Gram Panchayats Development, Gram Panchayats Development In Telangana, Mango News Telugu, Minister Errabelli Dayakar, Minister Errabelli Dayakar Rao, Telangana Gram Panchayats Development

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చొర‌వ, తెగువ‌, ప్ర‌ణాళికా బ‌ద్ధ‌మైన ఆలోచ‌న‌ల‌తో రాష్ట్రంలోని ప‌ల్లెలు ప‌చ్చ‌గా, ఆహ్లాదంగా, అభివృద్ధి ప‌థంలో ఉన్నాయ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. గ‌తంలో కేవ‌లం అర‌కొర‌గా అందే కేంద్ర నిధుల‌పై మాత్ర‌మే ఆధార‌ప‌డే ప‌రిస్థితి ఉండేది. దేశంలో కాంగ్రెస్ హ‌యాంలో అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకుంటూ, మ‌న రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింద‌న్నారు. ఆర్థిక సంఘం ఇచ్చే నిధుల‌కు స‌రిస‌మానంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి నెలా క్ర‌మం త‌ప్ప‌కుండా టంచ‌న్ గా 308 కోట్లు ఇస్తున్న‌ద‌ని తెలిపారు. ఒక‌వేళ కేంద్ర ప్ర‌భుత్వ నిధులు అంద‌క‌పోయినా, రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం అందిస్తూనే ఉంద‌న్నారు. దీంతో క‌నీసం 500 జ‌నాభా క‌లిగిన‌, ఆదాయం అంత‌గా లేని చిన్న చిన్న గ్రామాల‌కు సైతం క‌నీసం 5 ల‌క్ష‌ల నిధులు అందుతున్నాయ‌ని మంత్రి తెలిపారు.

దేశంలోనే కూలీల‌కు 14 కోట్ల ప‌నిదినాలు క‌ల్పించిన ఘ‌‌నత తెలంగాణ రాష్ట్రానిదే:

ఉపాధి హామీ కింద గ‌తంలో కేవ‌లం చెరువుల పూడిక తీత‌, ఫార్మేష‌న్ రోడ్లు మాత్ర‌మే జ‌రిగేవి. కానీ, ఆ నిధులు కూడా దుర్వినియోగం అవుతుండేవి. లేబ‌ర్ కి ప‌ని త‌క్కువ‌గా దొరికేది. ఈ ప‌రిస్థితుల్లో పూర్తిగా మార్పులు తెస్తూ, ఉపాధి హామీ నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ, దేశంలోనే అత్య‌ధికంగా కూలీల‌కు 14 కోట్ల ప‌నిదినాల‌ను క‌ల్పించిన ఘ‌‌నత దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే ద‌క్కింద‌న్నారు. అలాగే ఈ మార్చి చివ‌రి నాటికి 18 కోట్ల ప‌నిదినాల‌ను క‌ల్పించి, దాని ద్వారా వ‌స్తున్న మెటీరియ‌ల్ కాంపొనెంట్ ని స‌ద్వినియోగ ప‌రుస్తూ, ప్ర‌తి గ్రామంలో న‌ర్స‌రీలు, డంపింగ్ యార్డులు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. అలాగే క్ల‌స్ట‌ర్లుగా ఏర్పాటు చేసిన గ్రామాల‌కు రైతుల‌ను సంఘ‌టిత ప‌రిచే విధంగా రైతు వేదిక‌లు, అర్హులైన ప్ర‌తి రైతుకి రైతు క‌ల్లాలు నిర్మిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

స‌ర్పంచ్ ల‌కే విశేషాధికారాలు:

మ‌రోవైపు గ్రామాల అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండ‌డానికే స‌ర్పంచ్ ల‌కు విశేషాధికారాలు ఇచ్చిన‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. ఉపాధి హామీ ప‌నుల‌ను కూడా గ్రామ స‌ర్పంచ్ ల ఆధ్వ‌ర్యంలోనే గ్రామ స‌భ నిర్వ‌హించి, అవ‌స‌ర‌మైన ప‌నులు చేప‌ట్టేట‌ట్లు అధికారాలు ఇవ్వ‌డం జ‌రిగింది. చ‌ట్టాల స‌వ‌రింపుల ద్వారా ఆయా నిధుల వినియోగంలో స‌ర్పంచ్ లు, ఉప స‌ర్పంచ్ ల‌కు జాయింట్ చెక్ ప‌వ‌ర్ ఇచ్చామ‌న్నారు. అలాగే స‌ర్పంచ్ లు త‌మ గ్రామాల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే విధంగా అన్ని అవ‌కాశాలు క‌ల్పించామ‌ని మంత్రి వివ‌రించారు.

గ్రామాల‌కు ట్రాక్ట‌ర్లు, ట్యాంక‌ర్లు:

గ్రామాల‌కు గ‌తంలో క‌నీసం చెత్త ఎత్తిపోయ‌డానికి కూడా ఎలాంటి వాహ‌నాలుండేవి కావ‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు చెప్పారు. ఇప్పుడు ప్ర‌తి గ్రామానికి ట్రాక్ట‌ర్లు, ట్యాంక‌ర్లు ఇచ్చిన‌ట్లు తెలిపారు. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం బాగుంద‌ని, అలాగే మంచినీటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతున్నాయ‌ని, ఇందుకు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం కూడా తోడ‌యింద‌ని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌శంస‌లు:

రాష్ట్రంలో ఉపాధి హామీ అనుసంధానంగా జ‌రుగుతున్న అన్ని ర‌కాల అభివృద్ధి ప‌నులను కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు మ‌న రాష్ట్రంలో ప‌ర్య‌టించి, ప‌రిశీలించి, సంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతోపాటు, అభినందించార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. రాష్ట్రానికి స‌మాచారం లేకుండానే నేరుగా, వారికి న‌చ్చిన గ్రామాల్లో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించార‌ని అన్నారు. ఆత‌ర్వాత త‌న‌ను క‌లిసి, ప్ర‌త్యేకంగా అభినందించార‌ని ఆయ‌న అన్నారు.

ఇంకా రావాల్సిన ఉన్న నిధులు:

అయితే కేంద్ర ప్ర‌భుత్వం నుండి మెటీరియ‌ల్ కాంపొనెంట్ కింద ఇంకా దాదాపు రూ.800 కోట్ల రావాల్సి ఉంద‌ని మంత్రి చెప్పారు. ఆ నిధులు వ‌స్తే ప‌ల్లెలు మ‌రింత‌గా అభివృద్ధి జ‌రిగే అవ‌కాశాలుంటాయ‌ని మంత్రి తెలిపారు. ఆ నిధులు వెంట‌నే ఇవ్వాల్సిందిగా ఎప్ప‌టిక‌ప్పుడు అటు రాష్ట్ర అధికారులు, ఇటు సీఎం కేసీఆర్, తాను సంప్ర‌దిస్తూనే ఉన్నామ‌ని చెప్పారు. ఈ మ‌ధ్యే దాదాపు రూ.130 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు మంత్రి వివ‌రించారు.

గ్రామాల‌కు రాష్ట్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు:

కేంద్ర ప్ర‌భుత్వ నిధులు అంద‌న‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ల‌ను అందిస్తూనే ఉన్నామ‌న్నారు. అభివృద్ధి ప‌నులు ఆగిపోకూడ‌ద‌న్న సంక‌ల్పంతో సీఎం కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు నిధుల‌ను విడుద‌ల చేస్తూ, ప‌ల్లెల ప్ర‌గ‌తిని కొన‌సాగిస్తున్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. మ‌రోవైపు కేంద్ర నిధులు ఇంకా రావాల్సి ఉండ‌టం వ‌ల్ల, ప్ర‌గ‌తిలో ఉన్న ప‌నుల కోసం మిగ‌తా నిధుల‌ను స‌ర్దుబాటుచేసి, కేంద్ర నిధులు వ‌చ్చాక తిరిగి స‌ర్దే విధంగా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు. దీంతో, క‌రోనా నేప‌థ్యంలో ఉన్న నిధుల కొర‌త తీరుతుంద‌ని మంత్రి చెప్పారు. అభివృద్ధికి స‌హ‌క‌రించ‌ని వారిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ప‌ల్లెల ప్ర‌గ‌తిలో ఎలాంటి ఆటంకాలు రాకూడ‌ద‌నే ల‌క్ష్యంతో స‌ర్పంచ్ ల‌కు కొన్ని చోట్ల ఉప స‌ర్పంచ్ లు స‌హ‌క‌రించ‌డం లేద‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అలాంటి వారి చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు చేసి, ఆ త‌ర్వాత స్థానంలో ఉన్న వాళ్ళ‌కి ఇచ్చామ‌ని మంత్రి తెలిపారు.

ప‌ల్లెల ప్ర‌గ‌తి కోసం ప‌ల్లె ప్ర‌గ‌తి:

చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా రాష్ట్రంలో ప‌ల్లెలు ప్ర‌గ‌తి ప‌థంలో ఉన్నాయ‌ని, ఇది కేవ‌లం సీఎం కేసీఆర్ వ‌ల్లే సాధ్య‌ప‌డింద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఇక ప‌ల్లెల ప్ర‌గ‌తికి ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ఎంతో తోడ్పాటుగా నిలిచింద‌న్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన ఆ ప‌థ‌కం వ‌ల్ల అటు నిరంత‌రం పారిశుద్ధ్యం, ఇటు అభివృద్ధి కొన‌సాగుత‌న్నాయ‌ని మంత్రి అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల‌కు ఎప్ప‌డు లేనంత‌గా రూ.8,500 వ‌ర‌కు జీతాలు పెంచామ‌న్నారు. నిరంత‌ర పారిశుద్ధ్యం వ‌ల్ల, ఎప్పుడూ ప్ర‌తి సంవ‌త్స‌రం డెంగీ, మ‌లేరియా, స్వైన్ ఫ్లూ వంటి విష జ్వరాలు చాలా వ‌ర‌కు త‌గ్గి, ప్ర‌జ‌ల ఆరోగ్యం కూడా మెరుగుప‌డింద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ కూడా ప్ర‌శంసించింద‌ని పేర్కొన్నారు. క‌రోనాతోపాటు, సీజ‌న‌ల్, అంటు వ్యాధులు పూర్తిగా అదుపులోకి వ‌చ్చాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =