రేవంత్ ఫోక‌స్ వాటిపైనే..!

Water Funds Appointments Revanth Focus On Them, Water Funds Appointments, Revanth Focus Water Funds Appointments, CM Revanth Reddy, Congress, Telangana Government, CMO Telangana, Revanth Reddy, Latest News On Water Funds Appointments, Latest Telangana Water Funds Appointments News, CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
CM Revanth reddy, Congress, Telangana government, CMO Telangana, revanth reddy

మాట ఇచ్చాక మ‌డ‌మ తిప్ప‌డం ఉండ‌ద‌ని నిరూపించుకునేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌హ‌త‌హ‌లాడుతున్నారు.  ఏవేం హామీల‌తో ప్ర‌జ‌ల‌ను, నిరుద్యోగుల‌ను ఆక‌ట్టుకుని అధికారంలోకి వ‌చ్చారో వాటిని నెర‌వేర్చి చిత్త‌శుద్ధి చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నీళ్లు.. నిధులు.. నియామ‌కాల పేరుతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ‌లో గ‌త ప్ర‌భుత్వం వాటి కోసం అంత‌గా కృషి చేయ‌లేద‌ని పేర్కొన్న రేవంత్‌.. తాను చేసి చూస్తాన‌ని ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచే హామీలు నెర‌వేర్చేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌మాణ స్వీకారం రోజునే ఓ యువ‌తికి ఉద్యోగం ఇస్తూ సంత‌కం చేసిన రేవంత్‌… రెండు ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉద్యోగ క‌ల్ప‌నే ధ్యేయం అని తాజాగా కూడా ఓ చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఓ వైపు నీళ్ల‌ను తెచ్చే ప్రాజెక్టులు.. మ‌రోవైపు ప్రాజెక్టు ప‌నుల కోసం వెచ్చించేందుకు నిధులు, ఇంకోవైపు.. తాను చెప్పిన నియామ‌కాలు చేప‌ట్టేందుకు.. ముఖ్య‌మంత్రి రేవంత కృషి చేస్తుండ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. ‘‘తెలంగాణలోని కరువు, ఫ్లోరైడ్‌ పీడిత జిల్లాలకు సాగు, తాగు నీరు అందిచేందుకు చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత కీలకమైనది. దీని ద్వారా హైదరాబాద్‌ నగరానికీ తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది.  ఇప్పటికే పలు అనుమతులు లభించాయి. సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లోని హైడ్రాలజీ, ఇరిగేషన్‌ ప్లానింగ్‌, కాస్ట్‌ ఎస్టిమేట్‌ అండ్‌ బీసీ రేషియో, అంతరాష్ట్ర డైరెక్టరేట్‌ అనుమతులు కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉన్నాయి. వాటికి వెంటనే ఆమోదం వచ్చేలా చూడండి’’ అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఇటీవ‌ల రేవంత్ రెడ్డి కోరారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55086 కోట్లు అని, అటవీ, వన్యప్రాణి, పర్యావరణ, కేంద్ర విద్యుత్‌ అథారిటీ (సీఈఏ), సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జల మండలి అనుమతులు లభించాయని పేర్కొన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు, 1,226 గ్రామాలతో పాటు హైదరాబాద్‌కు తాగు నీరు సరఫరా చేయాల్సి ఉందని.. ఈ ప్రాధాన్యతల దృష్ట్యా కేంద్ర జల సంఘంలోని ఆయా డైరెక్టరేట్లతో పాటు టీఏసీ అనుమతి వచ్చేలా చూసి ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విన్నవించారు. పాలమూరు ఎత్తిపోతలకు అదనపు నిధుల కేటాయింపుపై షెకావత్‌ సానుకూలంగా స్పందించిన‌ట్లు మంత్రి ఉత్తమ్ వెల్ల‌డించారు. తెలిపారు. అలాగే, రాష్ట్రానికి రావాల్సిన న‌దీ జ‌లాల వాటా, విభ‌జ‌న హామీల‌కు అనుగుణంగా పొరుగు రాష్ట్రం నుంచి పంప‌కాలు ఇలాగ ప్ర‌తీ అంశంపైనే రేవంత్ రెడ్డి దృష్టి సారించిన‌ట్లు క‌నిపిస్తోంది.

నిధుల కోసం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలిస్తున్నాయి.  ఖాళీ  ఖజానాతో కష్టాల్లో ఉన్న సమయంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ల‌భించిన అప్పు కొంత ఊరట. జనవరి, ఫిబ్రవరి, మార్చిలతో కూడిన చివరి త్రైమాసికంలో రూ.9,000 కోట్ల అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో తొలుత రూ.2,000 కోట్లను ఈ నెల 16వ తేదీన తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా, రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పులో వెయ్యి కోట్లు మినహా మిగతా అప్పును గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే తీసుకోవటంతో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నిధుల కటకట ఏర్పడింది. చివరి త్రైమాసికంలో అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రూ.13,000 కోట్ల అదనపు అప్పు కావాలని, ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసింది. స‌ర్కారు విజ్ఞ‌ప్తికి కేంద్రం స్పందిస్తూ తొలుత రూ.9,000 కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్లే..

నియామ‌కాల‌పై కూడా రేవంత్ సీరియ‌స్ గానే దృష్టి పెట్టారు. ఫిబ్రవరిలోపు 22 వేలు, డిసెంబరు లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. మెగా డీఎస్సీకి సిద్ధం చేయాల‌ని ఇప్ప‌టికే అధికారుల‌ను ఆదేశించారు. అలాగే, న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో యూపీఎస్సీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ మ‌నోజ్ సోని, కార్య‌ద‌ర్శి శ‌శిరంజ‌న్ కుమార్‌ల‌తో కూడా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల స‌మావేశం అయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్ర‌క్షాళ‌న‌, యూపీఎస్సీ ప‌ని తీరుపై సుమారు గంట‌న్న‌ర పాటు వారు చ‌ర్చించారు.  యూపీఎస్సీ పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తోంద‌ని, అవినీతి మ‌ర‌క అంట‌లేద‌ని, ఇంత సుదీర్ఘ‌కాలంగా అంత స‌మ‌ర్థంగా యూపీఎస్సీ ప‌నిచేస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ‌లో నియామ‌క ప్ర‌క్రియ‌లో నూత‌న విధానాలు, ప‌ద్ధ‌తులు పాటించాల‌నుకుంటున్న‌ట్లు ముఖ్యమంత్రి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌, స‌భ్యుల రాజీనామాల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన నేప‌థ్యంలో నూత‌న చైర్మ‌న్ ఎంపిక‌కు ప్ర‌భుత్వం దృష్టి సారించింది. క‌మిష‌న్ ఏర్పాటు అవ్వ‌గానే ఉద్యోగాల ప్రక్రియ కొలిక్కి రానుంది. తాము 2024 డిసెంబ‌ర్ నాటికి రెండు ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్నామ‌ని  యూపీఎస్సీ కి రేవంత్ తెలిపారు. ఇలా నీళ్లు – నిధులు – నియామ‌కాల‌పై తెలంగాణ సీఎం సీరియ‌స్ గానే దృష్టి సారించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − nine =