గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులేవీ కొత్తవి కావు, ఉమ్మడి ఏపీలో ప్రారంభించినవే: సీఎం కేసీఆర్

AP And TS Over Water Allocation Issues, AP And TS Over Water Project Dispute, Apex Council Meeting Between AP And TS Over Water Project Dispute, CM KCR, CM KCR Wrote a Letter to Jal Shakti Minister Gajendra Singh, Jal Shakti Minister Gajendra Singh Shekhawat, KCR Over Water Allocation Issues, KCR Wrote a Letter to Jal Shakti Minister, Minister Gajendra Singh Shekhawat, Telangana CM KCR, Water Allocation Issues

కృష్ణా గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరు, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తెలియజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. అత్యున్నతస్థాయి పాలనా యంత్రాంగం, జల వనరులశాఖ నిపుణులు, అధికారులతో కూడిన బృందం 48 గంటలపాటుగా శ్రమించి సీఎం సూచనల మేరకు ఈ లేఖను రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు అన్ని అంశాలు వివరిస్తూ 14 పేజీల లేఖను సీఎం కేసీఆర్ పంపించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ, జాతీయ, అంతర్ రాష్ట్ర జలన్యాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సహజ న్యాయంతో కూడిన ధర్మసూత్రాలను అనుసరించి 60 ఏండ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పునః పరిశీలించి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎత్తిపడుతూ అన్ని అంశాలను కేంద్రానికి పంపిన లేఖలో సీఎం కేసీఆర్ ఎక్కుపెట్టారు.

అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేండ్లుగా ట్రిబ్యునల్ కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు, కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని సీఎం ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్-3 క్రింద నివేదించాలని ఈ లేఖ ద్వారా సీఎం కేంద్రాన్ని కోరారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) ఏం చేస్తున్నదని లేఖలో నిలదీశారు.

పోతిరెడ్డిపాడును 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడాన్ని, రోజుకు 3 టీఎంసీలు తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న చర్యలను కేఆర్ఎంబీ నిరోధించలేకపోవడాన్ని సీఎం ఈ లేఖలో ఎత్తిచూపారు. తక్షణమే పోతిరెడ్డిపాడు నుంచి అక్రమ నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితోపాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని సీఎం కోరారు.

తెలంగాణ రాష్ట్రం గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని ఈ లేఖలో సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రం గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలలోనుంచే ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నామని, ఇవేవీ కొత్తవి కావని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదు, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా వారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై దృష్టిని మరలించడానికి వేసిన ఎత్తుగడగానే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించినవేనని సీఎం కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో ఆధారాలతో సహా వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని, నదీజలాల పంపిణీలో తెలంగాణకు ఇంకా జరగని న్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో నిలదీశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + seventeen =