కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌ల్లో భిన్న దృశ్యాలు

Revanth reddy, KCR, BRS, Congress, Telangana Politics
Revanth reddy, KCR, BRS, Congress, Telangana Politics

ఎవరికైనా సరే ఒక గెలుపు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. దాంతో మరిన్ని విజయాలకు శక్తినిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి ఇది. ఒక ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. ఎదురేలేదని ఎగిరిపడ్డ వారిని కిందకు దించుతుంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కనిపిస్తున్న సీన్‌ ఇది. రాష్ట్ర రాజకీయాల్లో తమను నిలువరించేవారే లేరని, ఎల్లకాలం తమ పాలనే సాగుతుందని భావించిన టీఆర్‌ఎస్‌.. జాతీయస్థాయిలోనూ  రాజకీయ చక్రం తిప్పాలనే తహతహతో ఏకంగా పార్టీ పేరును కూడా తెలంగాణ రాష్ట సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చుకుంది. ఊహించని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు తప్పి అధికారం దూరం కావడంతో ఆపార్టీనేతలు.. ముఖ్యంగా కృష్ణార్జునులుగా చెప్పుకుంటున్న బావాబామ్మర్థులు కొంచెం ఆందోళ‌న‌లో ఉన్నారు.

అభివృద్ధి కంటే ప్రచారం చేస్తే గెలిచేవారమని  ఒకరంటే.. కార్యకర్తలకు  ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే  బస్సు వేసుకొని వస్తామని ఇంకొకరంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినవో, వ్యాపారులను బెదిరించి రాబట్టినవో  కానీ ఆయాచితంగా వచ్చినపడిన విరాళాలతో  ఏకంగా విమానాలు కొనుగోలు చేసి గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన వారు  నేలకు దిగి బస్సెక్కుతామనడంతో ఓటమి నేర్పిన పాఠమేమిటో అర్థం చేసుకోవచ్చు. అలాగే మరొకరు ఇకపై కార్యకర్తలకు అండగా ఉంటామని, అన్ని స్థాయిల్లోనూ కమిటీలు నియమించి రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. కేసీఆర్‌ సైతం  తెలంగాణ భవన్‌కు వస్తారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయ ముఖమే చూడని గొప్పనేత  సైతం కార్యకర్తలను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి రానుండటం ఓటమి కంటే గొప్ప పాఠం చెప్పేవారు మరెవరూ ఉండరనడానికి నిదర్శనం. ఇంతకీ ఆపార్టీకి ఇన్ని పాట్లు ఎందుకంటే.. ఉన్న క్యాడర్‌ వెళ్లిపోకుండా ఉండేందుకేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఇక సాధారణ ప్రజలెవరూ ఊహించని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్‌ పార్టీ  అదే ఊపుతో లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం మూడు లోక్‌సభ స్థానాల్లో  మాత్రం గెలిచిన కాంగ్రెస్‌.. ఈసారి 15 స్థానాల్లో గెలిచేలా పనిచేయాలని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ  రాష్ట్రనాయకులను ఆదేశించారు.అసెంబ్లీ ఎన్నికల్లో  ప్రజలు కనబరచిన సానుకూలతను లోక్‌సభకూ వినియోగించుకోవాలని నిర్దేశించారు. ఒక విజయం ఎవరికైనా ఎంతటి విశ్వాసాన్ని కలిగిస్తుందో చెప్పేందుకిదో మచ్చుతునక. తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా సోనియాగాంధీని కోరిన రాష్ట్ర నాయకులు ఆమె నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఈ అంశంలో నిన్ననే స్పష్టత రాగలదని భావించినప్పటికీ, అందుకు ఇంకొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ రాష్ట్రంలో ఎక్కడినుంచి పోటీ చేసినా భారీ విజయంతో గెలిపించాలన్నది ఆపార్టీ లక్ష్యంగా ఉంది. గెలుపు వల్ల వచ్చిన  ఉత్సాహ బలమది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nine =