పోటీ చేయాలా.. వ‌ద్దా?.. ఊగిస‌లాట‌లో నాగ‌బాబు!

Nagababu, Janasena, AP Elections, Lok sabha elections, Lok sabha elections 2024, Kurnool, Anantapur, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Assembly, Pawan kalyan, Mango News Telugu, Mango News
Nagababu, Janasena, AP Elections, Lok sabha elections

ఆంధ్ర‌ప్రదేశ్ లో టీడీపీ – జ‌న‌సేన కూట‌మి మంచి ఊపుమీదుంది. రాష్ట్రంలో ఎన్నిక‌ల గాలి.. కూట‌మి వైపు వీస్తుంద‌న్న ప్ర‌చారం, కూట‌మికే ఎక్కువ సీట్ల‌న్న స‌ర్వేల ఫ‌లితాలు ఆయా పార్టీల నేత‌ల‌కు ఉత్సాహం నింపుతున్నాయి. ఈక్ర‌మంలో సీట్ల కోస‌మూ పోటీ పెరుగుతోంది. ఆ సంగ‌తి అలా ఉంచితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప‌వ‌న్ సోద‌రుడు నాగేంద్ర‌బాబు పోటీ చేసే స్థానాల‌పై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే మ‌నోహ‌ర్ పోటీ చేయాల‌ని  అనుకుంటున్న తెనాలి సీటుపై పొత్తుల నేప‌థ్యంలో డైల‌మా ఏర్ప‌డింది. వాస్త‌వానికి ప‌వ‌న్ జ‌న‌సేన నుంచి ప్ర‌క‌టించిన తొలి సీటు తెనాలే. అయితే.. అప్ప‌టికి పొత్తులు కొలిక్కి రాలేదు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌తంలో పోటీ చేసిన గాజువాక‌తో పాటు, కాకినాడ నుంచి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరి సంగ‌తి అలా ఉంచితే.. ఎన్నిక‌ల్లో పోటీపై నాగ‌బాబు డైల‌మాలో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. తాజాగా నాగేంద్ర బాబు మాట్లాడుతూ.. 10 రోజుల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించనున్న‌ట్లు వెల్ల‌డించారు. అలాగే.. త‌న పోటీ గురించి కూడా మాట్లాడారు. తాను ఎక్క‌డి నుంచి పోటీ చేసేది, జ‌న‌సేన ఎన్ని స్థాన‌ల్లో నుంచి పోటీ ఉండేది.. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టిస్తార‌ని చెప్పారు. అలాగే.. జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మితో బీజేపీ క‌లిసి వ‌స్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు. త‌ను పోటీ చేయ‌బోతున్న‌ట్లు స్ప‌ష్టంగా  చెప్ప‌లేదు. ఇదిలాఉండ‌గా.. తాను అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని గ‌తంలో నాగ‌బాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ సేవలకే పరిమితమవుతానని తేల్చి చెప్పారు. సుమారు ఏడాదిన్న‌ర‌గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్నం అవుతూ.. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఎక్క‌డా తాను ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్ప‌లేదు. కానీ.. నిన్న మాత్రం తాను ఎక్క‌డి నుంచి పోటీ చేస్తానో ప‌వ‌న్ చెబుతార‌ని అన్నారు. అంటే.. నిర్ణ‌యం మారిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు చేతిలో ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి. వి. శివరామరాజు తర్వాత మూడో స్థానంలో నిలిచారు. నాగబాబుకు కేవ‌లం 21.31% ఓట్లు లభించాయి. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయంగా స్త‌బ్ద‌త పాటించారు. ప్ర‌స్తుతం రెండేళ్లుగా జ‌న‌సేన కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. పొత్తులో భాగంగా అనకాపల్లి లోక్‌సభ స్థానం తమకివ్వాలని టీడీపీ నాయకత్వాన్ని జనసేన కోరుతున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగేంద్రబాబును ఇక్కడి నుంచి పోటీచేయించాలని భావిస్తున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వాస్తవానికి ఈ స్థానం కోసం టీడీపీలో తీవ్రమైన పోటీ ఉంది. ఎంపీగా పోటీకి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ ఎప్పుడో రంగం సిద్ధం చేసుకున్నారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబును తాను కోరినట్లు ఇటీవల అయ్యన్న కూడా చెప్పారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్‌ మధ్య చర్చ జరిగినప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బైరా దిలీప్‌ చక్రవర్తి పేరు పరిశీలనకు వచ్చింది.

టీడీపీ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందడంతో దిలీప్‌ చక్రవర్తి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో నాయకులందరినీ కలుస్తూ సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబును దించాలని జనసేన పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అనకాపల్లి లోక్‌సభ స్థానంలో కాపు సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉండడం.. దీని పరిధిలోని యలమంచిలి, పెందుర్తి స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉండడం.. నాగబాబు విజయానికి కలిసొస్తాయని వారు భావిస్తున్నట్లు సమాచారం. నాగబాబు కూడా విశాఖ‌లో జ‌రుగుతున్న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావ‌డం కూడా ఆయ‌న పోటీని బ‌ల‌ప‌రుస్తున్నాయి.

మ‌రోవైపు.. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు నాగ‌బాబు అంత‌గా ఉత్సాహం చూప‌డం లేద‌న్న ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. గ‌తంలో ఓట‌మి చెంద‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని జ‌న‌సేన వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ఎమ్మెల్సీ లేదా.. కుదిరితే రాజ్య‌స‌భ కోరుతున్నార‌ని తెలుస్తోంది. కానీ.. ప్ర‌స్తుతం కూట‌మి వైపు ప‌వ‌నాలు వీస్తున్న క్ర‌మంలో ప్ర‌త్య‌క్షంగానే పోటీ చేస్తే బాగుంటుంద‌ని పార్టీ పెద్ద‌లు నాగ‌బాబు ఒప్పించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని, అందుకే పోటీ విష‌యంలో ఆలోచ‌న‌లో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 16 =