కూటమిలో తీసివేతలు..

INDIA Alliance,Anmol Gagan Maan,Indian National Developmental Inclusive Alliance, Opposition Parties,Modi Govt,2024 Elections, INDIA Alliance Parties

అధికారంలో ఉన్న ఎన్డీయేను రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా గద్దె దించాలన్న లక్ష్యంతో, పెద్ద టార్గెట్‌ను ముందు పెట్టుకుని మరీ ఏర్పాటయింది ఇండియా కూటమి.ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలకపోవడంతో కూటమిలో ఇప్పటికే అసంతృప్తి మొదలయింది. దీనికి తోడు వివిధ పార్టీల తీరుతో 26 ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఏర్పాటైన ఇండియా కూటమికి.. ఇప్పుడు ఆదిలోనే హంస పాదు అన్నట్లుగా కనిపిస్తున్నాయి పరిస్థితులు.

2024 ఎలక్షన్స్‌లో ఎలాగైనా కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న ఈ కూటమి నుంచి ఇప్పుడు ఒక్కో పార్టీ బయటకు వెళ్తోన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఆ వార్తలే నిజమని అనిపిస్తోందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. దీంతో ఈ కూటమి నుంచి బయటకు వెళ్లడానికి ఏయే పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరాలు తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీని పెట్టిన ఈ కూటమి నుంచి ప్రారంభంలోనే బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు చూస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.

2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మోడీ సర్కారుని ఎదుర్కొని పోరాడటానికి ఏకంగా 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమైమయ్యాయి. అంతేకాదు ఈ మధ్యనే ఒకే వేదికపైకి వచ్చిన 26 ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తమ కూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్‌ అంటే ఇండియా అనే పేరును కూడా ఖరారు చేసుకున్నాయి. దాని తర్వాత ఒకసారి ముంబైలో, రెండోసారి బెంగళూరు వేదికగా సమావేశాలు కూడా నిర్వహించాయి ఆ అలయన్స్.

ఒకవైపు పార్టీ పెద్దలంతా ఎవరికి వారు ప్రధాని పదవిపై ఆసక్తి లేదంటూ.. కేవలం మోడీ సర్కారును ఓడించడమే లక్ష్యమని చెబుతూ ప్రకటనలను కూడా ఇచ్చేశారు. దీని కోసం రాష్ట్రాల సమస్యల గురించి.. తమ మధ్య ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు వారంతా. ఓవైపు కూటమి మూడోసారి సమావేశం గురించి ఏర్పాట్లు కొనసాగుతుండగానే.. మరోవైపు ఈ అలయెన్స్ నుండి ఇప్పుడు ఒక్కో పార్టీ బయటకు వచ్చే ప్రయత్నాలు ప్రారంభించాయన్న వార్తలు మాత్రం జోరందుకున్నాయి.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో వామపక్షాలు.. ఇప్పటికే ఇండియా కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, కేరళలో కాంగ్రెస్ పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్థులని,అందుకే ప్రతిపక్షాల ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఇలా నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఢిల్లీలో ఈ మధ్య జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై ఇలా నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. అయితే సీపీఎం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. హస్తినలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. కానీ.. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. తాజాగా బీహార్‌లో కూడా పోటీకి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనిపై ఢిల్లీలో బీహార్ యూనిట్ సమావేశం నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ తమ పార్టీ నాయకులకు దిశానిర్దేశం కూడా చేసినట్లు తెలుస్తోంది. బీహార్‌లో జేడీయూ, బీజేపీ కూటమి పాలనతో పాటు..మరోవైపు ప్రతిపక్ష ఆర్జేడీ పాలనను కూడా చూసి విసుగు చెందిన బీహార్ ప్రజలకు ఇక తమ పార్టీనే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు.

అలాగే పంజాబ్‌లోనూ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పంజాబ్ రాష్ట్ర మంత్రి అన్మోల్ గగన్ మాన్ ప్రకటించారు. పంజాబ్‌లో పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చిన ఆమె.. మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో కూడా తామే పోటీ చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో పొత్తులపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నా.. పంజాబ్‌లో మాత్రం కూటమితో కలిసి పోటీ చేసే ఉద్దేశ్యం లేదని ఆమె ప్రకటించారు. అయితే..మరోవైపు పంజాబ్‌లో ఆప్‌తో పొత్తు ఉండదంటూ కొందరు కాంగ్రెస్ నేతలు కూడా అదే మాట చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వ్యాఖ్యల గురించి.. పార్టీ జాతీయ నాయకత్వానికి వివరిస్తామన్న పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా.. అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా దీనిపై కీలక సూచనలు కూడా ఇచ్చారని అమరీందర్ చెప్పుకొచ్చారు.

మొత్తంగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఎన్డీయేకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పిన ఇండియా కూటమి నుంచి.. ఇప్పుడు ఒక్కో పార్టీ బయటకు వచ్చే ప్రయత్నాలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీను ఫాలో అవుతూ.. మరికొన్ని పార్టీలు కూడా అలయెన్స్ నుంచి బయటకు వస్తే పరిస్థితి ఏంటి అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =