పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

Minister KTR Open Letter to the Central Government over the Hike in Petrol Prices, Minister KTR Open Letter, Minister KTR Open Letter to the Central Government, Central Government, Hike in Petrol Prices, Hike in Diesel Prices, Hike in fuel Prices, fuel price hike, Petrol and Diesel Price, Petrol, Minister KTR open letter to the Union government on petrol prices, petrol prices, KTR slams Centre over the Hike in Petrol Prices, Minister KTR slams Central Government over the Hike in Petrol Prices, Telangana Minister KTR, KTR, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, Mango News, Mango News Telugu,

పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే ప్రధాని మోదీ పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయిందని విమర్శించారు. “ప్రతీ రోజూ ప్రజల రక్తం పీల్చేలా పెంచుతున్న పెట్రో ధరల పెంపుపైన కేంద్ర ప్రభుత్వానికి ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఒకవైపు నిరంతరం ధరలను పెంచుతూనే మరోవైపు ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ఒక కుటిల ప్రయత్నానికి కేంద్రంలోని బీజేపీ ఒడిగడుతుంది. నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా బలాదూర్ గా తిరిగొస్తుంది. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా పెట్రో రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు, అది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ లేఖ రాస్తున్నాను” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను పెంచుతున్నారు:

దేశంలో ధరలను అదుపు చేయడం చేతగాని మోదీ ప్రభుత్వం అందుకు కారణాలుగా చెపుతున్న అంశాలన్నీ శుద్ధ అబద్దాలే అని మంత్రి కేటీఆర్ అన్నారు. “అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులనీ కొన్నిరోజులు, ముడి చమురు ధరల పెరుగుదల అని ఇంకొసారి, రష్యా ఉక్రేయిన్ యుద్ధం అని ఇంకొన్ని రోజులు బీజేపీ నేతలు కహానీలు చెప్పారు. కాని ఇదంతా నిజం కాదు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లో కూడా ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు అక్కడ లీటర్ పెట్రోల్ రేటు మనకంటే తక్కువే అన్న సంగతిని కావాలనే దాస్తున్నారు. అంతెందుకు పకనున్న దాయాది దేశాలతోపాటు, ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోనూ ఇప్పటికి అత్యంత చవక ధరకే పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. 2014 లో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి అంతర్జాతీయంగా ఉన్న ముడిచమురు ధర సుమారు 105 డాలర్లు. ఆ తర్వాత వివిధ కారణాల వలన ఒకానొక దశలో సుమారు 40 డాలర్ల దిగువకు ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రో ధరలను బీజేపీ ప్రభుత్వం పెంచుతూనే ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కనికరం లేదనడానికి కరోనా సంక్షోభం కాలంలో పెంచిన ఎక్సైజ్ సుంకమే సాక్ష్యం. కరోనా సంక్షోభంలో బ్యారెల్ ముడిచమురు ధర 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఫలితంగా దేశంలో భారీగా పెట్రో రేట్లు తగ్గాల్సి ఉండే. కానీ కరోనా సంక్షోభంలో వలస కూలీలను వేల మైళ్లు నడిపించిన కనికరంలేని మోదీ ప్రభుత్వం మాత్రం తగ్గిన ధరల ప్రయోజం ప్రజలు పొందకుండా ఎక్సైజ్ సుంకాన్ని 20 రూపాయలు పెంచింది. దీంతో తక్కువ రేటుకు పెట్రో ఉత్పత్తులను మన దేశ ప్రజలు పొందలేకపోతున్నారు” అని అన్నారు.

దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాలపై 7.5 సంవత్సరాలుగా రూ.26.51 లక్షల కోట్ల పెట్రోపన్ను:

“2014లో సుమారు 70.51 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధరను, రూ.53.78 గా ఉన్న డీజిల్ ధరను క్రమంగా పెంచుతూ ఈరోజు పెట్రోల్ 118.19 కి, డీజిల్ ను 104.62 కు పెంచింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 106 డాలర్లుగా ఉన్నది. 2014 లో క్రూడ్ ఆయిల్ కు ఎంత ధర ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ 2014లో మనదేశంలో లీటర్ పెట్రోల్ ఎంత ధరకు దొరికేదో ఇప్పుడు మాత్రం అంతకు దొరకడం లేదు. రేటు రెట్టింపు అయింది. ఇది ఎలా అయింది? ఎందుకు అయింది? ఏ ప్రయోజనాల కోసం ఇలా ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడపలేక బీజేపీ అవలంబిస్తున్న అసమర్థ విధానాలే ప్రస్తుత ఈ దుస్థితికి కారణం. సంపదను సృష్టించే తెలివి లేక, చేతిలో ఉన్న అధికారంతో విపరీతంగా పన్నులు పెంచుతూ దాన్నే సుపరిపాలనగా భావిస్తున్న భావదారిద్య్రంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో ఉన్న 26 కోట్ల కుటుంబాలపై ఏడున్నర సంవత్సరాలుగా 26.51 లక్షల కోట్ల రూపాయల పెట్రో పన్నును వేసిన పనికిమాలిన ప్రభుత్వం బీజీపిదే. అంటే సగటున ఒక్క కుటుంబం నుంచి లక్ష రూపాయలను దౌర్జన్యంగా పెట్రో ధరల పెంపు పేరుతో లూఠీ చేసింది మోదీ ప్రభుత్వం. ప్రతిది దేశం కోసం ధర్మం కోసం అంటారు. ఈ దోపిడీ కూడా దేశం కోసం..ధర్మం కోసమేనా? దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి” అని మంత్రి కేటీఆర్ లేఖలో ప్రశ్నించారు.

రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానే:

“2014కు ముందుకు పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48గా ఉండేది. అధికారంలోకి వచ్చినంక మోడీ దాన్ని రూ.32.98కి పెంచారు. గతేడాది కాస్త తగ్గించి దాన్ని రూ.27.90 చేశారు. ఈ ఎక్సైజ్ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్రమంత్రులతో పాటు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్ మీడియాలో డప్పు కొడుతున్నది. కాని ఇది పచ్చి అబద్ధం. పెట్రోల్ ధరలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అన్ని రాష్ట్రాలతో పంచుకునేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే. ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి 40 పైసలు మాత్రమే. ఇందులో నుంచి 41 శాతాన్ని అంటే అక్షరాల 57 పైసల్ని కేంద్రం, అన్ని రాష్ట్రాలకు పంచుతుంది. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతం. అంటే లీటరుకు 0.01 పైసలు. కానీ 28 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మోదీ సర్కార్, అందులో నుంచి ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గప్పాలు కొట్టుకుంటుంది. రాష్ట్రాలను బలహీనపరిచే కుట్రలను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి అమలు చేస్తున్న నరేంద్ర మోదీ, పెరుగుతున్న పెట్రోధరలతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మాత్రమే నిండేలా చూసుకుంటున్నారు. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్సుల రూపంలో పెట్రో రేట్లు పెరుగుతున్నాయి. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 18 రూపాయలు, వ్యవసాయ, మౌలిక వసతులు అభివృద్ధి పేరిట రెండున్నర రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట పదకొండు రూపాయలను ఇలా ప్రతి దానికి ఒక్కో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత భారీగా 30 రూపాయలకు పైగా సెస్సులను పెట్రో ధరల పేరుతో మోడీ సర్కార్ వసూలు చేస్తోంది. ఇందులో నుంచి రాష్ట్రాలకు దక్కేది గుండు సున్నానే” అని అన్నారు.

వెంటనే పెట్రో, గ్యాస్ ధరల పెంపుని ఆపాలి.:

“ఒకవైపు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి దాదాపు పెట్రో ధరలను రెట్టింపు చేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2015 నుండి ఇప్పటిదాకా వ్యాట్ టాక్స్ ఒక్క నయాపైసా కూడా పెంచలేదన్న సంగతిని ప్రజలంతా గమనించాలని కోరుతున్నాను. పెట్రో ధరల పేరిట పట్టపగలు ప్రజల జేబులను దోచుకుంటున్న పార్టీ బీజేపీ అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే అచ్చేదిన్ కాదు అందర్నీ ముంచే దిన్ అనుకుంటున్నారు. పెట్రో రేట్ల పెరుగుదలతో ప్రతీ ఒక్కరి దైనందిత జీవితం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇంట్లో వాడే గ్యాస్, పప్పు, ఉప్పు, ఔషధాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుడి బతుకు దిన దిన గండంగా మారింది. బీజేపీ హయాంలో గ్యాస్ బండ, మోయలేని గుదిబండగా మారింది. దీంతో మోదీ చెప్పిన పకోడీలు అమ్ముకుని బతికే పరిస్థితి కూడా లేదు. పెట్రో ధరల పెంపుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలోకి వచ్చింది. ప్రజలు బైకులు, కారులు వదిలేసే పరిస్ధితి నెలకొంటున్నది. వంట గ్యాస్ వెయ్యి దాటడంతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కైంది. వ్యవసాయ పెట్టుబడివ్యయం పెరిగిపోతున్నది. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ సాధించిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి పెట్రో వాతలు.. ధరల మోతలే. అధికారంలోకి రావడానికి ముందు పెట్రో ధరల పెంపును రాజకీయాస్త్రంగా మార్చుకున్న నరేంద్ర మోదీ ఆనాటి తన మాటలు, చేతలను ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కరోనా సంక్షోభంతో ఉద్యోగాలు పోయి ఆదాయాలు తగ్గి, నిరుద్యోగిత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో రేట్ల పెంపుతో ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతున్న విషయాన్ని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలి. తన అసమర్థ ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలపై వివరణ ఇవ్వాలి. పెట్రో ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమయ్యామని దేశ ప్రజలను క్షమాపణ కోరాలి. పెట్రో ధరల పెంపు ధర్మసంకటం అన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ మాటల్ని ప్రజలు సీరియస్ గా పట్టించుకున్న రోజు, ధర్మ సంకటాన్ని వీడి కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తది. పెట్రో ధరల బాదుడు ఆపకపోతే, ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదు అన్న సంగతిని గుర్తుంచుకుని వెంటనే పెట్రో, గ్యాస్ ధరల పెంపుని ఆపాలి. ప్రజలకు ప్రయోజనం కలిగేలా పెట్రో రేట్లను తగ్గించేందుకు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేశ ప్రజల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని మంత్రి కేటీఆర్ కేంద్రానికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 6 =