సిమెంట్ ధర తగ్గింపుపై కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి భేటీ

Cement Industries, Heads of Cement Industries, KTR High-level Meeting with Heads of Cement Industries, KTR Latest News, KTR Meeting With Heads of Cement Industries, Minister KTR, Minister Prashanth Reddy, Minister Prashanth Reddy Meeting, Prashanth Reddy, telangana, Telangana News, Telangana Political News

తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ బస్తా ధరలు తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈరోజు మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ -19, లాక్‌డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు సిమెంట్ బస్తా ధరను తగ్గించాలని మంత్రులు కోరారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం వలన అన్ని రంగాల మాదిరే రియల్ ఎస్టేట్ రంగం కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి రియాల్టీ రంగానికి చేయూతనిచ్చేందుకు ధరలను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియాల్టీ రంగం పైన అదనపు భారం పడితే అది అంతిమంగా సామాన్య ప్రజల పైన, వినియోగదారులపైనే పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణరంగం వృద్ధి ప్రధాన కొనసాగిందని, ఇప్పుడు కూడా కొనసాగించాల్సిన అవసరం అందరిపైనా ఉందని ఈ సందర్భంగా సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు మంత్రులు తెలియజేశారు. ప్రస్తుతం అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో నిర్మాణ రంగం ఒకటని ఈ రంగం ఒడిదుడుకులకు గురైతే అంతిమంగా ఈ ప్రభావం సిమెంట్ కంపెనీలపై కూడా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారికి గుర్తు చేశారు. మరింత సానుకూల భవిష్యత్తు కోసం వెంటనే సిమెంట్ బస్తా ధరను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. సిమెంట్ బస్తా ధరలు తగ్గించాలని ప్రభుత్వం చేసిన సూచనకు కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. అంతర్గతంగా మాట్లాడుకుని వచ్చే వారంలో ఏ మేరకు ధరను తగ్గించేది ప్రభుత్వానికి వారం రోజుల్లో తెలియజేస్తామని తెలిపారు. గతంలో 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి 230 రూపాయలకి ఒక బస్తా ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోను కూడా జారీ చేసింది. ఈరోజు జరిగిన సమావేశంలో మరో మూడు సంవత్సరాల పాటు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వ పథకాలకు 230 రూపాయల ధరకి యధావిధిగా సిమెంట్ సరఫరా చేసేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు.

దీంతోపాటు సిమెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున నెలకొని ఉన్న హుజూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో, అక్కడి యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణ కేంద్రాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు ఈ సమావేశంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అధికారులకు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఆర్.అండ్.బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సిమెంట్ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని ఈ శిక్షణ కేంద్రం నుంచి తీసుకుంటామని, ఈ శిక్షణా కేంద్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే సైదిరెడ్డి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి, శిక్షణ కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామన్న సిమెంట్ కంపెనీల ప్రతినిధులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − three =