ఏజన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకే 100 శాతం టీచర్ల పోస్టులు దక్కేలా జీవో 3పై రివ్యూ పిటిషన్ దాఖలు

GO Number 3/2000, Review Petition in Supreme Court on GO Number 3/2000, teachers posts for sc, telangana, Telangana Latest News, Telangana News, Telangana to file review petition against Supreme Court

తెలంగాణ రాష్ట్రంలోని ఏజన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు మేలు జరిగేలా, ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో వందశాతం రిజర్వేషన్లు వారికే కల్పించాలనే జీవో 3ని కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో జూలై 6, సోమవారం నాడు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత సుప్రీం కోర్టు ప్రారంభం అయిన మొదటి రోజునే ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంపై గిరిజనుల హక్కులు, ప్రయోజనాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, అంకితభావానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయ పోస్టులను వంద శాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన జీవో 3ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కరోనా లాక్ డౌన్ సమయంలో కొట్టివేయడం తెలిసిందే. ఈ జీవోను కొట్టివేసిన వెంటనే లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ సుప్రీం కోర్టు నుంచి ఈ తీర్పు కాపీలు తెప్పించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర సీనియర్ న్యాయవాదులు, అధికారులు, నిపుణులను సంప్రదించి సమగ్ర సమాచారంతో సుప్రీం కోర్టులో తెలంగాణ అడ్వకేట్ ఆన్ రికార్డు సలహా మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేశామన్నారు.

ఈ జీవో 3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నిరంతరం సమన్వయం చేసుకుంటూ గిరిజనులకు కచ్చితంగా న్యాయం చేయాలనే లక్ష్యంతో సమగ్ర సమాచారంతోపాటుగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ రివ్యూ పిటిషన్ రూపొందించడం జరిగిందన్నారు. గత 20 ఏళ్లుగా ఈ జీవో అమలు వల్ల కూడా గిరిజనులలో అనుకున్న అభివృద్ధి జరగలేదని, అలాంటిది ఇక జీవోని కొట్టివేస్తే వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, వారికి న్యాయం జరిగేలా ఈ జీవోను పునరుద్ధరించాలంటూ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.

అయితే ఇవేవి తెలుసుకోకుండా బీజేపీ రాష్ట్ర నేతలు ఈ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ జీవో 3ని పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలు ఏమిటో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేయకపోతే ఇప్పటికైనా కేంద్రాన్ని ఈ జీవో 3ని పునరుద్దరించే విధంగా ఒప్పించాలన్నారు. ప్రతిపక్షం కదా అని విమర్శలు చేయడం మానుకుని, గిరిజనుల ప్రయోజనాల కోసం బీజేపీ రాష్ట్ర నేతలు కృషి చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.

రాష్ట్రంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీల జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు పెంచడం కోసం చెల్లప్ప కమిషన్ వేసి, గిరిజనుల జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా నాన్చుతోందన్నారు. ఫలితంగా ఎస్టీలు విద్య, ఉద్యోగ రంగాల్లో నష్టపోతున్నారన్నారు. బీజేపీ నేతలకు రాష్ట్ర గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆమోదింపచేసి, రిజర్వేషన్లను 10శాతానికి పెంచే విధంగా, జీవో 3 పునరుద్ధరించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి, గిరిజనుల హక్కులను, ప్రయోజనాలను కాపాడాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.

సంబంధిత వార్తలు:

ఏజన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకే టీచర్ల పోస్టులు, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం – సీఎం కేసీఆర్

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − five =