కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా : మంత్రి నిరంజన్ రెడ్డి

Agriculture Minister, Agriculture Minister Press Meet, Agriculture Minister Singireddy Niranjan Reddy, Crops Procurement, Mango News, Niranjan Reddy Press Meet, Niranjan Reddy Press Meet over Crops Procurement, Singireddy Niranjan Reddy, Singireddy Niranjan Reddy Press Meet, Singireddy Niranjan Reddy Press Meet over Crops Procurement, Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy, Telangana CM KCR

రాష్ట్రంలో పంటలసాగులో మార్పులు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పంటల కొనుగోళ్లపై మంత్రుల నివాస సముదాయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. సాగు అనుకూల విధానాలతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరగడంతో పంటల దిగుబడులు కూడా పెరిగాయన్నారు. ఈ క్రమంలో రైతులు పంటల సాగులో మార్పులను ఆహ్వానించి, ఆచరించాలని చెప్పారు. కంది, పత్తి, వేరుశనగ పంటలు అధికంగా సాగుచేయండని రైతులకు సూచించారు. భవిష్యత్ లో కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.

తెలంగాణ పత్తి నాణ్యత దేశంలో మొదటి స్థానం, పత్తి దిగుబడిలో దేశంలో రెండో స్థానం:

“గతంలో పత్తి 54 లక్షల ఎకరాలలో సాగయితే, ఈసారి 61 లక్షల ఎకరాలలో సాగు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో రైతులు పత్తి సాగుకు మొగ్గుచూపారు. పత్తి సాగును పెంచాలని వ్యవసాయ శాఖ తరపున రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ పత్తి నాణ్యత దేశంలో మొదటి స్థానం, పత్తి దిగుబడిలో దేశంలో రెండో స్థానంలో ఉంది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కంది సాగును రైతులు పెంచారు. ప్రభుత్వ మద్దతుధర కన్నా అధికధర బహిరంగ మార్కెట్ లో లభించింది. అలాగే వేరుశనగ పంటకు కూడా మద్దతుధర కన్నా అధికధర మార్కెట్ లో లభించింది” అని మంత్రి పేర్కొన్నారు.

వానాకాలంలో సన్నరకాల వరి సాగును పెంచండి, దొడ్డురకం వరి సాగు తగ్గించండి:

“వానాకాలంలో సన్నరకాల వరి సాగును పెంచండి, దొడ్డురకం వరి సాగు తగ్గించండి. దొడ్డురకం వరి వినియోగం కన్నా ఉత్పత్తి అధికంగా ఉంది. దొడ్డురకాలు మరింత సాగు పెరిగితే రైతులు నష్టపోయే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి ఆంక్షలు లేనివిధంగా పంటలను సాగు చేయించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్ లో కేంద్రం కొన్ని బాధ్యతల నుండి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను ముందే అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రైతుల ఉత్పత్తులను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వాల లక్ష్యం కావాలి. పంటల సాగు విషయంలో శాస్త్రీయ అధ్యయనం చేసి ఎర్నెస్ట్-యంగ్ సంస్థ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. దాని ప్రకారం రైతులకు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించి చైతన్యం చేయడం జరుగుతుంది. తెలంగాణ రైతుల ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగా గోదాంలు ఉండగా, మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ద్యంగల గోదాంలను ప్రభుత్వం నిర్మిస్తుంది. రాష్ట్రంలో గోదాంల నిర్మాణానికి సెంట్రల్ వేర్ హౌసింగ్ ఆసక్తి చూపుతుంది” అని మంత్రి చెప్పారు.

52 లక్షల 79 వేల 682 ఎకరాలలో వరిసాగు, కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా:

“రాష్ట్రంలో యాసంగిలో 52 లక్షల 79 వేల 682 ఎకరాలలో వరిసాగు అయింది. కోటి 32 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఎఫ్సిఐ అంగీకారం తెలిపింది. 20 లక్షల మెట్రిక్ టన్నులు వ్యాపారులు, 10 లక్షల మెట్రిక్ టన్నులు విత్తనాలకు, మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార అవసరాలకు పోతాయని అంచనా వేస్తున్నాం. కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని రకాల ఏర్పాట్లు సిద్దం చేస్తున్నాం. రైతులు కోవిడ్ నిబంధనలు పాటించాలి. అలాగే తాలు లేకుండా, నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండేలా చూసుకుని మద్దతు ధర పొందాలి. కరోనా నేపథ్యంలోనే తిరిగి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 80-85 నియోజకవర్గాలలో పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతున్నారు” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌరసరఫరాల కమీషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 18 =