9,36,976 మంది ఉద్యోగులకు వేతనాల పెంపు, ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియ

CM KCR Decides to Increase The Salaries of All Types of Employees in the State,CM KCR Announces Salary Hike For Govt Employees,CM KCR,TS CM KCR,CM KCR Latest News,CM KCR News,Telangana CM KCR,Telangana,Telangana News,Chief Secretary Somesh Kumar,Employees,Salaries,Mango News,Mango News Telugu,Hyderabad,Hyderabad News,Telangana State Government,State Government Employees,Chief Minister K Chandrashekhar Rao,Salaries Hike For State Government Employees,Government Employees,Employees Salaries Increase,CM KCR Decides to Increase The Salaries of Government Employees,Telangana Government Employees Salaries News,TSRTC Employees

నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియ:

వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్నిరకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని సీఎం నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుండి అందిన నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం కేబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది.

అన్నిరకాల ఉద్యోగులకు ఖచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచుతాం:

‘‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని గొప్పగా నిలుపుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుందని అంచనా వేశాం. అప్పుడు ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు ఇవ్వవచ్చని భావించాం. అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది. రైతుల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42శాతం ఫిట్ మెంట్ తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులకు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికున్న ఆర్ధిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్నిరకాల ఉద్యోగులకు ఖచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మార్చి నుండి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి కావాలి:

‘‘ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పదవీ విరమణ వయస్సును ఎంతకు పెంచాలనే విషయంలో అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చిస్తుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అంశం చిక్కుముడిగానే ఉండేది. ఏది ముట్టుకున్నా పంచాయితీ, కోర్టు కేసులే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవి కొనసాగాయి. ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి, న్యాయ వివాదాలను పరిష్కరించుకొని ఇప్పుడిప్పుడే అన్ని విషయాల్లో స్పష్టతకు వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా విధులు నిర్వర్తించే సౌలభ్యం కల్పించడానికి మార్గం సుగమమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. మార్చి నుండి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి కావాలి’’ అని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

వెంటనే అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలి:

‘‘ఆంధ్రప్రదేశ్ తో వివాదం కారణంగా పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ గొడవలన్నీ పరిష్కారమయ్యాయి. కాబట్టి వెంటనే అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలి. అన్నిశాఖల్లో వెంటనే డీపీసీలు నియమించాలి. పదోన్నతులు ఇవ్వగా ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చిన తర్వాత ఎన్ని ఖాళీలుంటాయనే విషయంలో స్పష్టత వస్తుంది. శాఖలవారీగా ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి. ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్ రూపొందించాలి. పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి. ఆయా శాఖల్లో శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి’’ అని సీఎం సూచించారు.

ఉద్యోగులకు రిటైరైన రోజే రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అందించాలి:

‘‘ఉద్యోగులు దాదాపు 35 సంవత్సరాలపాటు ప్రభుత్వం కోసం, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తారు. అలాంటి ఉద్యోగులకు చాలా గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. నాలుగో తరగతి ఉద్యోగి నుండి శాఖాధిపతి వరకు ఎవరైనా సరే పదవీ విరమణ పొందితే వారికి ఆ కార్యాలయంలోనే ఘనంగా సన్మానం జరపాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా వీడ్కోలు పలకాలి. రిటైరైన రోజే రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అందించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం రిటైర్డు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరిగే దురవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండవద్దు. దీనికి అనుగుణంగా అన్ని శాఖల్లో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం అత్యంత విషాదకరం. దు:ఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం పడొద్దు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + ten =