తెలంగాణకు నీటిపారుదల శాఖ లైఫ్ లైన్ గా మారింది: సీఎం కేసీఆర్

CM held a review meeting on irrigation projects, CM KCR Review on Irrigation Department, Enhance O&M system for irrigation, Irrigation Department, Irrigation Department In Telangana, KCR On Irrigation Department, Mango News, Operating and maintenance wing for strengthening irrigation, Review on Operation and Maintenance in Irrigation Department, Telanagna, Telangana CM KCR, Telangana CM KCR Review Meeting

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ పంట పొలాలకు నిరంతరం సాగునీరు ప్రవహిస్తున్నందున, సాగునీటి వ్యవస్థలను పటిష్టపరుచుకోవాలని, ఇందుకు ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ – అమలు మరియు నిర్వహణ) వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత పెరిగిందన్నారు. బ్యారేజీల నుంచి మొదలుకుని చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ దాకా, నదుల నుంచి చివరి ఆయకట్టు దాకా నీటిని తీసుకెళ్లే అన్ని వ్యవస్థలను పటిష్ట పరుచుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన కాల్వలు, పంపులు, బ్యారేజీల గేట్లు, రిజర్వాయర్లు తదితర అన్నిరకాల నిర్మాణాలను, వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తూండాలన్నారు. ఉత్పన్నమయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటూ నీటిపారుదలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మరమత్తుల కోసం రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ఇరిగేషన్ శాఖను నీటిపారుదలతో పాటు, నీటిపారుదల రంగ నిర్వహణ శాఖగా పటిష్టంగా తీర్చిదిద్దుకోవాలని సీఎం వివరించారు. పాలమూరు, కల్వకుర్తి, జూరాల అనుసంధానం, నిర్మాణాలు విస్తరణ మీద మూడో రోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని బుధవారం నాడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ నిర్వహించారు.

తెలంగాణకు నీటిపారుదల శాఖ లైఫ్ లైన్ గా మారింది:

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘సాగునీరు తాగునీరు నీరేదైనా కానీ ఇరిగేషన్ శాఖ నీటి పారుదలకు మారుపేరుగా మారింది. నేడు తెలంగాణకు నీటిపారుదల శాఖ లైఫ్ లైన్ గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కాల్వల వ్యవహారం అంతా ఆంధ్రా రాష్ట్ర వ్యవహారం అన్నట్టుగా సాగింది. కానీ నేడు తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ యాసంగిలోనే తెలంగాణ 52 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తూ, వరిపంటలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. మనకు పంటలే పండవు అని మనలను తక్కువ చేసి చూసిన పక్క రాష్ట్రం ఇవ్వాల మూడోస్థానంలో వున్నది. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ సాగునీటి రంగం ఎంత వైబ్రంట్ గా వున్నదో. ఇంత విస్త్రృతమైన నెట్వర్క్ గతంలో లేకుండె. ఉమ్మడి రాష్ట్రంలో మన ఇంజనీర్లకు అంతగా అవగాహన కల్పించలేదు, కానీ ఇప్పుడు ఆ అవసరం పెరిగింది. ప్రతి కింది స్థాయి ఇంజనీరుకు కూడా ఇరిగేషన్ వ్యవస్థమీద మరింతగా కమాండింగ్ రావాల్సిన అవసరమున్నది’’ అని సీఎం అన్నారు.

ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ పని విభజన మరింతగా చేసుకోవాల్సిన అవసరమున్నది. తరచుగా మీటింగులు జరుపుకోవాలె. వర్కుషాపులు ఏర్పాటు చేసుకోవాలి. మన ఓరియెంటేషన్ పెంచుకోవాలె. ఓ అండ్ ఎం అంటే ఏమిటి? దాని విస్త్రృతి ఏమిటి దాని విధి విధానాలేమిటో ఉన్నతాధికారులు కిందిస్థాయి ఇంజనీర్లకు కల్పించాలని సీఎం అన్నారు. ఓ అండ్ ఎం కు ప్రత్యేక అధికారులను నియమించుకుందాం, దాని కోసం ప్రత్యేక నిధులను కేటాయించుకుందాం అన్నారు. ప్రతి సాగునీటి కాల్వ సర్కారు తుమ్మలు చెత్తా చెదారం లేకుండా అద్దంలా మెరువాలె అని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణకు వ్యవసాయమే మొదటి ప్రాధాన్యతారంగం కావడం వల్ల, మెయింటెనెన్స్ కు ఒక దారి పడాలని తాను ఇంజనీర్ల వద్ద అందుబాటులో నిధులను ఏర్పాటు చేశానన్నారు. తద్వారా పదికాలాల పాటు తెలంగాణ సాగునీటి రంగం అత్యంత పటిష్టంగా తయారవుతుందన్నారు. తెలంగాణ రైతన్నకు సాగునీటి కష్టాలు ఏ కోణంలోంచి, భవిష్యత్తులో కూడా రాకుండా చేయడమే తన ఉద్దేశ్యం అన్నారు. ఇందులో భాగంగా బ్యారేజీలన్ని, గేట్లెన్ని, పంపులెన్ని, కాలువలెన్ని వాటి పొడవెంత తదితర విషయాలను కూలంకషంగా ఒక చార్టులాగా రూపొందించుకోవాలన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టుకుంటున్నప్పుడు వాటిని పటిష్టంగా నిరంతరం అప్రమత్తతో లైవ్ లో వుంచుకోవడం అనే విషయం మీద స్పృహ తెచ్చుకోవాలె అన్నారు. గతంలో ఎస్సారెస్పీకీ నేటి ఎస్సారెస్పీకి గుణాత్మక అభివృద్ది వున్నదని సీఎం తెలిపారు. మొత్తం 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా నీరందిస్తున్నదన్నారు. నేడు కాళేశ్వరం పూర్తిస్థాయిలో నీరందిస్తున్నదనీ, త్వరలో పాలమూరు, కల్వకుర్తి, జూరాల పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నవన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రిజర్వాయర్లు సాగునీటి కాల్వలతో విస్తరించనున్నది. దాంతొ పాటే సాగునీటి రంగానికి బాధ్యతలు కూడా పెరగనున్నవని సీఎం వివరించారు.

హైదరాబాద్ లో సీ.ఈలు, ఎస్.ఈ ల స్థాయిలో వర్క్ షాప్ నిర్వహించుకోవాలనీ, క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజనీర్లకు శిక్షణనిచ్చే విధంగా, మంచి స్పీకర్లను గుర్తించి శిక్షణనివ్వాలని సూచించారు. ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్నా కొద్దీ వూరుతుంటదని లక్షల కొద్దీ ఎకరాలకు నీరందించే మహోన్నత బాధ్యత మీదేనని అధికారులతో అన్నారు. ఈ క్రమంలో పంపులు మోటార్లు ఒక భాగంగా గేట్లు ప్రాజెక్టులు గేట్లు కాల్వలు మరో భాగంగా విభజించుకోని ఓ అండ్ ఎం (అమలు మరియు నిర్వహణ) కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ఒకరోజు తానుకూడా హాజరవుతానని సీఎం తెలిపారు. తెలంగాణ సముద్రమట్టానికి అత్యంత ఎత్తున వున్నందున సాగునీటి కోసం పంపులతో ఎత్తిపోసుకోవడం అనివార్యం అయిన నేపథ్యంలో దాని నిర్వహణ రానున్న రోజుల్లో మరింతగా పెరగనున్నదని సీఎం పేర్కొన్నారు.

పాలమూరు ఎత్తిపోతలను కల్వకుర్తి జూరాలకు అనుసంధానం చేసే కార్యాచరణకు సంబంధించి సీఎం చాలాసేపు కసరత్తు జరిపారు. డిజిటల్ స్క్రీన్ మీద పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన రిజర్వాయర్లను వాటినుంచి నీటిని తీసుకపోయే కాల్వలను వాటిని నిర్మించాల్సిన ఎత్తు, అందుకు సంబందించిన కాంటూర్ పాయింట్లను గుర్తించారు. తద్వారా అత్యధిక ఎకరాలకు గ్రావిటీద్వారా నీటిని తరలించే విధానాలను ఉన్నతాధికారులతో చర్చించారు. పీఎల్లై, కెఎల్లై ల అనుసంధానం ద్వారా మొత్తం పాలమూరు ఉమ్మడి జిల్లా దాన్ని ఆనుకుని వున్న రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలలోని నియోజకవర్గాలకు సాగునీరు తాగు నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రతి ఇంచును పరిశీలించిన సీఎం అందుకు తగ్గట్టుగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో కరివేన రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని తరలించే ప్రధాన మరియు డిస్ట్రిబ్యూటరీ కాల్వల రూట్లను గుర్తించారు. ఉద్దండాపూర్ నుంచి కొడంగల్, నారాయణపేట్, తాండూర్, పరిగి, వికారాబాద్ చేవెళ్ల నియోజక వర్గాలకు సాగునీటిని తరలించే కాల్వల రూట్లను అధికారులతో చర్చించారు. సాధ్యమైనంత ఎక్కువ ఎకరాలు పారే విధంగా కాల్వల ఎత్తును నిర్దారించుకోవాలన్నారు. టన్నెల్ నిర్మాణాలను తగ్గించి ఓపెన్ కెనాల్ లను తవ్వాలని, గ్రావిటీ ద్వారా నీటిని తరలించే విధంగా సాంకేతికతను మరింతలోతుగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియను తుది దశకు చేర్చే విధంగా సమీక్షా సమావేశం నిర్వహించుకుందామని సీఎం అన్నారు. అందుకు సంబంధించి రానున్న రెండు మూడు రోజుల్లో సమావేశం నిర్వహించుకుందామని, అందుకు తగు ఏర్పాట్లతో సమాయత్తం కావాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 88 వేల ఎకరాలకు సాగునీరందించే ఆర్డీఎస్ స్కీం పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బచావత్ ట్రిబ్యునల్ లో కేటాయించిన ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టిఎంసీల నీటిని సాధించుకుందామన్నారు. అందుకు కావాల్సి వస్తే తాను కర్నాటక ప్రభుత్వంతో స్వయంగా వెళ్లి చర్చించి వస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, అబ్రహం, మహేశ్వర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, కాలె యాదయ్య, రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు, సలహాదారు పెంటారెడ్డి, సీ.ఈ లు రమేశ్, హమీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + five =