ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితి బట్టి లాక్‌డౌన్ లో మార్పులు – సీఎం కేసీఆర్

CM KCR, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, COVID-19, India COVID 19 Cases, kcr meeting, telangana, Telangana CM KCR, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Telangana Lockdown, telangana lockdown rules, TS Govt Ready to Test on Any Number of People

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్‌డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై ఏప్రిల్ 15, బుధవారం నాడు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.

ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ అమలు, నిరుపేదలకు సాయం అందించే విషయంలో ప్రజాప్రతినిథులు చూపిస్తున్న చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు. ముందుగా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్ అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఎనిమిది మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని వివరించారు.

అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి నివారణ కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్ బాగా అమలవుతున్నదని చెప్పారు. ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, రానున్న రోజుల్లో కూడా ఇలాగే సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిథిగా లాక్‌డౌన్ అమలవుతుంది, తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని, ప్రజలు ఇప్పటిలాగానే సహకరించాలన్నారు.

‘‘కరోనా వైరస్ సోకిన వారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతమందికైనా సరే, వైరస్ నిర్థారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో పిపిఇ కిట్లకు ఏమాత్రం కొరతలేదు. ఇప్పటికే 2.25 లక్షల పిపిఇ కిట్లు ఉన్నాయి. ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షల పిపిఇ కిట్లకు ఆర్డర్ ఇచ్చాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం 10 లక్షల పిపిఇ కిట్లను కలిగి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్-95 మాస్కులున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకంటుంది. మరో 5 లక్షలకు ఆర్డర్ ఇచ్చాం. దీంతో తెలంగాణలో 10 లక్షల ఎన్ 95 మాస్కులు అందుబాటులో ఉంటాయి. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 20 వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. లక్ష మంది పేషెంట్లు అయినా సరే, చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసి పెట్టింది. కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని” సీఎం కేసీఆర్ ప్రకటించారు.

‘‘లాక్‌డౌన్ అమలును, పేదలకు అందుతున్న సాయాన్ని, పంటల కొనుగోలు విధానాన్ని ప్రజాప్రతినిధులు ఎంతో చొరవ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు బాగా పనిచేస్తున్నారు. ఈ పని ఇంకా కొనసాగాలి. ప్రజలను చైతన్య పరచాలి. ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలి. ఆరోగ్య, మున్సిపల్ మంత్రులు తప్ప మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలి’’ అని సీఎం కేసీఆర్ కోరారు.

‘‘లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. బాగా కష్ట పడుతున్న వారికి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అవన్నీ అందాల్సిన వారికి అందుతున్నాయి. ప్రతీ పేద కుటుంబానికి 1500 చొప్పున నగదు అందించాలనే నిర్ణయం మేరకు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేశాం. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందే కార్యక్రమం దాదాపు పూర్తయింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రత్యేక నగదు ప్రోత్సాహం, వైద్య సిబ్బందికి ప్రకటించిన 10 శాతం అదనపు వేతనం కూడా వారికి అందింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం కార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాల్సి ఉన్నందున రాష్ట్రంలోని గ్రామ పంచాయతీకు ఏప్రిల్ నెల కోసం రూ.308 కోట్లు , అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కలిపి రూ. 148 కోట్లు విడుదల చేశామని” సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 4 =