తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

Fish Seed Distribution, Fish Seed Distribution Programme, Fish Seed Distribution Programme In Telangana, Fish Seed Stocking Program, Harish Rao, Mango News, Minister Talasani Srinivas, Ministers Talasani Harish Rao Launched State Level Fish Seed Stocking Program, State Level Fish Seed Stocking Program, Talasani Launched State Level Fish Seed Stocking Program, Telangana Fish Seed Distribution Programme

కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని రంగనాయక సాగర్, కోమటి చెరువులలో చేప పిల్లలు, రొయ్య పిల్లలను విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు లు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద తెలంగాణ విజయ డెయిరీ నూతన ఔట్ లెట్ ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతున్నదని పేర్కొన్నారు. వచ్చే ఒకటి రెండు సంవత్సరాలలో ఫెడరేషన్ ద్వారా మత్స్య సహకార సంఘాల నుండి చేపలను కొనుగోలు చేసి మార్కెట్ చేయాలనే ఉద్దేశ్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

అప్పటి వరకు మత్స్యకారులు మత్స్య సంపద ను స్థానికంగా తక్కువ ధరకు అమ్మకుండా ఎక్కువ డిమాండ్ ఉన్న హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లోని బహిరంగ విపణిలో విక్రయించి లాభాలు పొందాలన్నారు. మత్స్య సంపద ను మరింతగా పెంపొందించేందుకు పంపిణీ చేస్తున్న చేప పిల్లల నాణ్యత, సైజ్ విషయంలో రాజీపడకుండా, అవకతవకలకు అవకాశం లేకుండా చేప పిల్లల విడుదల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం జల వనరులలో 93 కోట్ల చేప పిల్లలు, 20 కోట్ల రొయ్య పిల్లలను వదిలే కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడ్డ మత్స్య రంగాన్ని తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారనీ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, చెరువుల్లో 365 రోజులు నీళ్ళు ఉండడం, ఉచిత చేప పిల్లల విడుదల వల్ల మత్స్య సంపద పెరిగేలా చూస్తున్నారని అన్నారు. మార్కెటింగ్ చేసుకునేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలను, ఆటోలను అందిస్తున్నట్లు చెప్పారు. మంత్రి హరీష్ రావు సూచన మేరకు మొబైల్ ఔట్ లేట్ లకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయ డైరీనీ తెలంగాణలో 750 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించే స్థాయి కి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. బహిరంగ విపణిలో ప్రైవేట్ సంస్థల తో పోటీ పడుతూ వాటన్నింటి కంటే ముందంజలో విజయ డైరీని నిలిపామన్నారు.

చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం: మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని, కానీ సీఎం ప్రత్యేక చొరవతో ఏడేండ్లలోనే చేపలను ఉత్తర భారతంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని చెప్పారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ కొత్త వెలుగులు తీసుకొచ్చారని, రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామని చెప్పారు. గుక్కెడు మంచి నీళ్లకోసం గోసపడ్డ ప్రాంతం ప్రస్తుతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నదని తెలిపారు.

తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతున్నదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యపు సిరులు, మత్స్య సంపద కళ్లముందు కనబడుతున్నదని చెప్పారు. మత్స్య సంపద పెరగడంతో మత్స్యకారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతున్నదన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. సాంప్రదాయ వృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌ అని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ కమిషనర్ మంజుల రాజనర్సు, రాష్ట్ర పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ భూక్యా లచ్చిరాం నాయక్, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

షామీర్ పేట చెరువులో చేప పిల్లలను విడుదల:

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం మేడ్చల్ నియోజక వర్గం లోని షామీర్ పేట చెరువులో మంత్రి తలసాని యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న చొరవతో తెలంగాణలో ఊహించనంత మత్స్య సంపద వస్తుందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది సీఎం కేసీఆర్ ఆశయం అన్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం 105 కోట్ల రూపాయల వ్యయంతో 93 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను రాష్ట్రంలోని 30 వేల నీటి వనరులలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇదే కాకుండా 11 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెలను లబ్దిదారులకు అందజేసినట్లు చెప్పారు. రెండో విడతలో 6 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెల పంపిణీని ప్రారంభించినట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు.

చెరువులు అన్నింటిని అన్ని విధాలుగా లాభదాయకంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో దాదాపు 414 చెరువులున్నాయని వాటిలో ఒక కోటి చేప పిల్లలు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. చెరువులను పటిష్ట పర్చడం ద్వారా వాటి చుట్టూ ఆర్ధిక కార్యకలాపాలను ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాల వలన, ఇవ్వాళ చెరువులపై ఆధార పడే వృత్తులు గాని కులాలు గాని అభివృద్హి చెందుతున్నారని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + one =