ఏపీలో పురుడుపోసుకుంటోన్న మరో కొత్త కూటమి

CPI, CPM, Congress, AP Elections, New Alliance, BJP,Indian National Congress, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Andhra pradesh, Mango News Telugu, Mango News
CPI, CPM, Congress, AP Elections, New Alliance

ఏపీలో ఎత్తులు.. పొత్తులు కాకరేపుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు జతకట్టి ఎన్నికలకు వెళ్తున్నాయి. అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. భారతీయ జనతా పార్టీని కూడా కూటమిలో చేర్చుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు జరిపిన చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది. కూటమితో జతకట్టేందుకు కాషాయపు పార్టీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఆ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఏపీలో మరో కొత్త కూటమి పురుడుపోసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాంమ్రేడ్స్ కాంగ్రెస్ పార్టీతో జత కట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్, సీపీఐ కలిసి ఎన్నికలకు వెళ్లాయి. సీపీఎం మాత్రం అక్కడ కాంగ్రెస్‌కు దూరంగా ఉంది. అయితే ఏపీలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం అనుకుంటోంది. ఈ మేరకు పొత్తు దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అటు సీపీఐ కూడా ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఇటీవల సీపీఎం పెద్దలు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాలు.. ఎన్నికలవేళ అనుసరించాల్సిన వ్యూహాలు.. పొత్తు వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఈ మేరకు ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 26 స్థానాల్లో.. 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా 3 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇదే విషయంలో పొత్తుల గురించి కూడా శ్రీనివాసరావు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వస్తే సీట్లు సర్దుబాటు చేసుకొని పొత్తులతో ముందుకు సాగుతామని వివరించారు. అటు కాంగ్రెస్ కూడా పొత్తుల కోసం ఎదురు చూస్తుండడంతో.. సీపీఎంతో పొత్తు ఖాయమనే వాదన వినిపిస్తోంది.

అటు సీపీఐ కూడా పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పోటీ చేయబోయే స్థానాలు.. పొత్తులపై సీపీఐ పెద్దలు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వారు కూడా కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. ఏపీలో కామ్రేడ్లతో కాంగ్రెస్ దోస్తీ కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =