ఏపీ ఎన్నిక‌లు.. వ‌లంటీర్ల పైనే విప‌క్షాల చూపు

ap elections, CM Jagan, oppositions, volunteers, TDP, Chief Minister YS Jagan Mohan Reddy, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, Election Commission decision,YSRCP government,andhra pradesh, Mango News Telugu, Mango News
ap elections, CM Jagan, oppositions, volunteers

వ‌లంటీర్లే మా సైన్యం.. అని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు. వ‌లంటీర్ల‌లో 90 శాతం మంది  వైసీపీ వాళ్లే ఉన్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈనేప‌థ్యంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపీలోని అన్ని పార్టీల చూపూ వారిపైనే ప‌డింది. వారు వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నార‌ని విప‌క్షాలు మొద‌టి నుంచీ ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. దీంతో వ‌లంటీర్ల క‌ద‌లిక‌ల‌పై దృష్టి సారించారు. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో తాజాగా ఈసీ కూడా స్పందించింది. ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహించే విష‌యంలో ష‌ర‌తులు విధించింది.  వ‌లంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్ డ్యూటీ అప్పగించొద్దని సీఈవోకు సూచించింది. అభ్యర్థులకు పోలింగ్‌ ఏజెంట్లుగా సైతం వ‌లంటీర్లను అనుమతించొద్దని స్పష్టం చేసింది. సచివాలయ సిబ్బందికి మాత్రం ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు అప్పగించవచ్చునని తెలిపింది. మరే ఎన్నికల విధులను వారికి అప్పగించకూడదని ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ సూచించింది.

మ‌రోవైపు.. ప్ర‌భుత్వం వ‌లంటీర్ల‌కు స‌త్కారం చేస్తోంది. 2.65 ల‌క్ష‌ల  మంది వ‌లంటీర్ల‌ను 2019 అక్టోబ‌ర్ లో నియ‌మించింది. వీరికి నెల‌కు రూ. 5 వేల గౌర‌వ వేత‌నం చెల్లిస్తోంది. ఒక్కొక్క‌రికీ 50 ఇళ్లు అప్ప‌గించి.. సంక్షేమ ప‌థ‌కాలను పేద‌లంద‌రికీ అందించేలా కృషి చేయాల‌ని పేర్కొంది. ఉత్త‌మ వ‌లంటీర్ల‌కు సేవా వ‌జ్ర‌, సేవార‌త్న‌, సేవామిత్ర పేర్ల‌తో ఏటా ప్రోత్సాహ‌కంగా న‌గ‌దు అందిస్తోంది. కనీసం ఏడాదికాలంగా పనిచేస్తూ.. ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన వలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందిస్తోంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచారు.

గతంలో సేవావజ్రలకు ఇచ్చే నగదు పురస్కారం రూ.30 వేల నుండి రూ.45 వేలకు పెంచారు. సేవారత్న లకు రూ.20 వేల నుండి రూ.30వేలకు పెంపుదల చేశారు. సేవామిత్రలకు రూ.10వేల నుండి రూ.15వేలకు పెంచారు.ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 875 మందికి సేవావజ్ర, 4,150 మందికి సేవారత్న, 2,50,439 మందికి సేవామిత్ర అవార్డులు గుంటూరులో ప్ర‌దానం చేశారు. వారిని ఎప్ప‌టిక‌ప్పుడు ప్రోత్స‌హిస్తూ ప్ర‌భుత్వం వ‌లంటీర్ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తోంది. ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధిగా ఉన్న వాలంటీర్లు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట‌ర్ల‌కు వైసీపీకి మ‌ధ్య వార‌ధిగా ప‌నిచేసే అవ‌కాశం ఉంద‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌.

వ‌లంటీర్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం తమ పార్టీ కరపత్రంలా వాడుకుంటోందని మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. ఐప్యాక్ సర్వేలకు కూడా వాలంటీర్లను వాడుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇటీవల జగన్ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ఓట్లను వాలంటీర్ల ద్వారా తొలగిస్తోందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది.మరోవైపు వాలంటీర్లలోనూ కొందరు అక్రమార్కులు, దొంగలు, దోపిడీదారులు కూడా ఉన్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై దాడులు చేసిన వాలంటీర్లు కూడా ఉన్నారని అభియోగాలు వచ్చాయి. వస్తున్నాయి. వాలంటీర్ల కారణంగా ఒంటరి మహిళల భద్రతకు ముప్పు ఉందని పలు సందర్భాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో వ‌లంటీర్ల పాత్ర‌పై మ‌రింత చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =