రోహిత్, రాహుల్ శతకాలు, కుల్‌దీప్‌ హ్యాట్రిక్- భారత్ ఘనవిజయం

2019 Latest Sport News And Headlines, India Vs West Indies Match, India Wins against West Indies, India Wins One-day Match, India Wins Second One-day by 107 runs, Latest Sport News, latest sports news, latest sports news 2019, Mango News Telugu, sports news

భారత్-వెస్టిండీస్‌ మధ్య విశాఖలో డిసెంబర్ 18, బుధవారం నాడు జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ జట్టు 107 పరుగులతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో ఓపెనర్లు రోహిత్‌శర్మ (159: 17 ఫోర్లు, 5 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(102: 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో మరోసారి సత్తా చాటారు. విండీస్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ వీరిద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే తొలి వికెట్‌కు 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శతకం సాధించిన వెంటనే కేఎల్‌ రాహుల్‌ అవుట్ అవ్వగా, వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) పరుగులేమి చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. భారత్ జట్టు 232 పరుగుల వద్ద రెండో వికెట్‌కోల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌(53: 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అలాగే రోహిత్ అవుట్ అయిన అనంతరం వచ్చిన రిషభ్‌పంత్‌(39: 3ఫోర్లు, 4 సిక్స్‌లు) సిక్సర్లతో అలరించాడు. శ్రేయాస్ అయ్యర్‌, పంత్ నాలుగో వికెట్‌కు 73 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. నిర్ణిత 50ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి భారత్ జట్టు 387 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో షెల్డన్‌ కాట్రెల్‌ రెండు వికెట్లు, కీమో పాల్‌, అల్జారీ జోసెఫ్‌, పోలార్డ్ తలో ఒక వికెట్ పడగొట్టారు.

భారత్ జట్టు నిర్దేశించిన 388 భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు 43.3 ఓవర్లలో 280 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు లూయిస్(30), షై హోప్(78) పరుగులతో రాణించారు. తోలి వన్డేలో శతకం సాధించిన షిమ్రోన్‌ హెట్‌మైర్‌(4) ఈ మ్యాచ్ లో వెంటనే వెనుదిరిగాడు. షై హోప్ తో కలిసి నికోలస్‌ పూరన్‌(75) ధాటిగా ఆడుతూ భారత్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. వీరిద్దరి 106 పరుగుల భాగస్వామ్యాన్ని షమి బ్రేక్ చేశాడు. షమీ వేసిన 30వ ఓవర్లో వరుస బంతుల్లో పురాన్ వికెట్ తో పాటు పోలార్డ్‌(0) వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 33వ ఓవర్‌ వేసిన కుల్‌దీప్‌ యాదవ్‌ మ్యాజిక్ చేశాడు. షైహోప్‌, జేసన్‌ హోల్డర్‌(11), ఆల్జరీ జోసెఫ్‌(0) లను అవుట్ చేసి వన్డేల్లో రెండో హ్యాట్రిక్‌ సాధించాడు. వన్డేలలో రెండో హ్యాట్రిక్ సాధించిన తోలి భారత్ బౌలర్ గా కుల్‌దీప్‌ యాదవ్‌ రికార్డు సాధించాడు. చివర్లో పియర్‌(21), కీమో పాల్‌(46) కొంచెంసేపు పోరాడిన విండీస్ జట్టు 280 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్ 107 పరుగులతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. రెండో వన్డేలో గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఇక కీలకమైన మూడో వన్డే మ్యాచ్ డిసెంబర్‌ 22 ఆదివారం నాడు కటక్ లో జరుగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here