దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీపీ సజ్జనార్ వివరణ

#DishaCase, #hyderabadpolice, #JusticeForDisha, #telanganapolice, All 4 Accused Killed In Encounter, Cyberabad CP VC Sajjanar, Cyberabad Metropolitan Police, Disha Murder And Rape Case, Encounter killings by police, Hyderabad rape case, Mango News Telugu, Telangana Breaking News, Telangana Latest News, VC Sajjanar Explains Encounter Details, VC Sajjanar Press Meet

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. ఘటనాస్థలంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు, అందుకు దారి తీసిన కారణాలను సజ్జనార్ తెలియజేశారు. ‘డిసెంబర్ 27 అర్ధరాత్రి జరిగిన దిశ హత్య ఉదంతంపై ముందుగా ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణ ప్రారంభించి క్రమంగా సైంటిఫిక్‌ ఆధారాలను సేకరించాం. జరిగిన ఘటనపై అన్ని కోణాల్లో విస్తృతంగా దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశాం. అరెస్ట్‌ చేసిన నలుగురు నిందితులను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచాం. డిసెంబర్ 2న నిందితులను పదిరోజుల పాటు పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో డిసెంబర్ 4న చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలో తీసుకోని, అనేక విషయాలపై విచారించాం. ఈ విచారణలో చటాన్‌పల్లిలో బాధితురాలి సెల్‌ఫోన్‌, ఇతర వస్తువులు దాచిపెట్టామని నిందితులు వెల్లడించారు. ఆ వస్తువులను చూపిస్తామంటే నిందితులను ఈ రోజు తెల్లవారుజామున చటాన్‌పల్లికి తీసుకొచ్చాం. వారిచ్చిన సమాచారం మేరకు దిశ సెల్‌ఫోన్‌, వాచ్‌, పవర్‌బ్యాంక్‌లను సేకరించాం. ఈ క్రమంలో నిందితులు పోలీసులపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. మహమ్మద్ ఆరిఫ్‌, చెన్నకేశవులు పోలీసులకు చెందిన రెండు తుపాకులను లాక్కుని కాల్పులు జరిపారు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినా నిందితులు వినకపోవడంతోనే, పోలీసులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు చనిపోయారు. నిందితులు ఆరిఫ్‌, చెన్నకేశవుల దగ్గర తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు చేసిన రాళ్ల దాడిలో నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌కు కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాం. అనంతరం వైద్యుల సూచనమేరకు కేర్ ఆసుపత్రికి తరలించామని’ సజ్జనార్ మీడియాకు వివరించారు.

ఈ రోజు ఉదయం 5.45 నుంచి 6.15 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయని సీపీ చెప్పారు. అయితే పోలీసులెవరికి బుల్లెట్‌ గాయాలు కాలేదని అన్నారు. నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. ఈ నిందితులు తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకల్లోనూ గతంలో ఇటువంటి ఘటనలకు పాల్పడినట్లుగా అనుమానాలున్నాయని అన్నారు. ఈ కేసులో ఆధారాలను బట్టి లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోయిందని సజ్జనార్‌ వ్యాఖ్యానించారు. అలాగే ఎన్‌కౌంటర్‌ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తమ నివేదికను అందజేస్తామని చెప్పారు. ఈ ఘటనలో బాధితురాలితో పాటుగా నిందితుల కుటుంబసభ్యుల వివరాలును కూడా గోప్యంగా ఉంచాలని మీడియాకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 11 =