మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్‌డౌన్‌ పొడిగింపుపై నిర్ణయం?

Telangana Cabinet to Meet Today, Lockdown, Covid Situation, Rythu Bandhu will be Discussed

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూన్ 8, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశమున్నట్టు తెలిపారు.

మరోవైపు కరోనా కట్టడికోసం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో, దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైందనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే జూన్ 9వ తేదీతో రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ గడువు ముగియనుండడంతో ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. లాక్‌డౌన్‌ పొడిగిస్తారా లేక సడలింపు సమయం పెంచుతారా లేదా నైట్ కర్ఫ్యూ కొనసాగిస్తారా అనే అంశంపై చర్చ జరుగుతుండడంతో ఈ కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందజేయడం, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా రెండవ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో, ఇంకా కూడా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో, థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత, తగు ఏర్పాట్ల మీద కూడా రాష్ట్ర కేబినెట్ చర్చించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 1 =