వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం రావొద్దు, హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం జగన్ ఆదేశాలు

AP CM YS Jagan Held Review on Health, Medical Department

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, వైఎస్ఆర్ హెల్త్‌ క్లినిక్స్, కంటివెలుగుతో పాటు ఇతర ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైఎస్ఆర్ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8585 చోట్ల పనులు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే పీహెచ్‌సీల్లో, సీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో కూడా నాడు–నేడు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 16 కొత్త మెడికల్‌కాలేజీల్లో పనుల ప్రగతిని, ఇవికాకుండా 9 చోట్ల జరుగుతున్న సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణ పనుల ప్రగతి కూడా సీఎం సమీక్షించారు.

వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం రావొద్దు:

రాష్ట్రంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలుపగా, కాన్సర్‌ రోగులకూ పూర్తిస్థాయిలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలన్న నిర్ణయం అమల్లోకి తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సీఎం సూచించారు. రాష్ట్రంలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే అత్యాధునిక వైద్యం అందుబాటులో తేవాలన్నారు. జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో మొత్తం 16 చోట్ల హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే 13 చోట్ల స్థలాలు గుర్తింపు జరిగిందని, జిల్లాలో స్పెషాల్టీ సేవల అవసరం మేరకు హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ కంటి వెలుగుపై సమీక్ష జరిపి, ఇంతకుముందు ఎవరైనా పరీక్షలు చేయించుకోనివారికి పరీక్షలు చేయించాలని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం కోసం ఒక వారంరోజులపాటు డ్రైవ్‌ నిర్వహించాలని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు, 104 కు అనుసంధానం చేసి, నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =