రాముడికి దూరం.. కాంగ్రెస్‌కు శాప‌మేనా?

Distance From Ram Is It A Curse For Congress, Distance From Ram, Curse For Congress, Ayodya Ram mandir, Congress, Rahul Gandhi, Ram Mandir, Ayodya, PM Modi, Balaramudu, Ram Mandir Pran Pratishtha, Ram Mandir Inauguration, Latest Ayodya News, Mango News, Mango News Telugu
Ayodya Ram mandir, Ayodya, Congress, Rahul gandhi

రామ జ‌న్మ‌భూమిలో ఈరోజు బాల రామ విగ్ర‌హ ప్ర‌తిష్ఠాప‌న ఘ‌ట్టం అద్భుతంగా సాగింది. కొంద‌రు వ్య‌తిరేకించినా ఎంద‌రో జై కొట్టారు. దేశ మంతా ఉద్విగ్నంగా ఈ మ‌హ‌త్త‌ర ఘ‌ట్టాన్ని టీవీల ముందు వీక్షించింది. కొంద‌రు ప్ర‌ముఖులు అయోధ్య‌కు చేరుకుని స‌త్కార్యంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నుంచి సామాన్య ప్రజల వరకూ గత కొన్ని రోజులుగా భక్తిప్రపత్తులతో అత్యంత నిష్ఠ పాటించారు. ధర్మ పరిరక్షకుడు, ఆదర్శపురుషుడిగా కీర్తికెక్కిన రాముడి విగ్ర‌హ ప్ర‌తిష్ఠ ఆహ్వానాలంది అక్కడకు చేరుకున్న ప్రముఖులు ‘దొరకునా ఇటువంటి సేవ’అనుకుంటూ రాముని సన్నిధిలో పులకించిపోయారు. కోట్లాది మంది హిందువుల ఐదొందల ఏళ్లనాటి  కల అయిన అయోధ్య రామాలయంలో..  భవ్య దివ్య మందిరం (గర్భగుడి)లో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కన్నుల పండువగా  జరిగింది.

ఆధ్యాత్మికంగా పండగ వాతావ‌ర‌ణం నెల‌కొన్న ఈ వేడుక రాజ‌కీయంగా కూడా సంచ‌ల‌నంగా మారింది. విగ్ర‌హ ప్ర‌తిష్ఠాప‌న అనంత‌రం  ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. ఆల‌స్యం చేసినందుకు రాముడికి క్ష‌మాప‌ణ‌లు అంటూ హిందువుల మ‌న‌సు చుర‌గొన్నారు. మ‌రోవైపు ఈ కార్య‌క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకుని దేశ వ్యాప్తంగా బీజేపీ నేత‌లు ర్యాలీలు నిర్వ‌హించారు. ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు. ప్ర‌క‌ట‌న‌లు, ఆడియో మెసేజ్‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ సందేశాలు పంపారు. రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డేందుకు, త‌మ హిందూత్వ ఎజెండాను అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. ఇదిలాఉంచితే.. ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందినా.. కాంగ్రెస్ ప్ర‌ముఖులు హాజ‌రుకాలేదు. ఆచితూచి ఆలోచించిన తర్వాతే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని నిర్ణ‌యించిన‌ట్లు అగ్ర‌నేత‌లు గ‌తంలోనే ప్ర‌క‌టించారు. ఇది ముమ్మాటికీ బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమమేనని, ఆందుకే తాము రావ‌డంవ లేద‌ని చెప్పారు.

ఆలయ ప్రారంభాన్ని రాజకీయం చేసేందుకు స్వయంగా ప్రధాని మోదీనే ప్రయత్నించారని కాంగ్రెస్ వాద‌న‌. జనవరి 22న ఇంటింటా దీపాలు వెలిగించమని ప్రజలకు పిలుపునివ్వ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం అని కాంగ్రెస్ పేర్కొంటోంది. ‘‘మందిర ప్రారంభానికి వెళ్లడంపై మేధావులతో చర్చించాం. మందిరాన్ని బీజేపీ ఎలాగూ ప్రచారాస్త్రం చేస్తుంది. కాబట్టి ప్రారంభానికి దూరంగా ఉండడమే సముచితమని వారు చెప్పారు. వెళ్లినా, వెళ్లకున్నా మాకు వచ్చే ప్రయోజనం లేదని భావించే గైర్హాజరవుతున్నాం. మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు 2017లోనే తీర్పునిచ్చింది. బీజేపీ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మందిరాన్ని బీజేపీ ఎన్నికల అంశం చేస్తే.. ప్రజలు కోల్పోయిన సామాజిక, ఆర్థిక న్యాయం గురించి మేం ప్రస్తావిస్తాం’’ అనేది కాంగ్రెస్ నేత‌ల అభిప్రాయం.

రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అయోధ్య కూడా ప్ర‌చార అస్త్రంగా మారుతుంద‌ని అన‌డంలో సందేహం లేదు. ఈ క్ర‌మంలో రామ విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌కు కాంగ్రెస్ హాజ‌రుకాక‌పోవ‌డంపై కూట‌మిలోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. పార్టీ పెద్ద‌లంద‌రూ ఎంతో స‌మీక్షించి, ప‌లువురు మేధావుల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ఆ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెబుతోంది. అయితే.. నేడు దేశంలోని ప‌రిస్థితిని చూస్తే మెజారిటీ ప్ర‌జ‌లు రామ జ‌న్మ‌భూమిలో రామ మందిర నిర్మాణంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. ఇళ్ల‌ల్లో పూజ‌లు, ఇంట ముందు జై శ్రీ‌రామ్ అంటూ ముగ్గులు, సాయంత్రం దీపాల వెలుగులు ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే ప్ర‌ధాని సూచ‌న‌ను చాలా మంది పాటిస్తున్న‌ట్లుగానే ఉంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఈ కార్య‌క్ర‌మాన్ని వ్య‌తిరేకించ‌డం ద్వారా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌తే వ‌స్తుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయోధ్య రామమందిరం ఆహ్వానాన్ని కాంగ్రెస్‌పార్టీ తిరస్కరించడం విచారకరమని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్ప అన్నారు. ఇది బీజేపీ కార్యక్రమం కాదని ఆయన అన్నారు.

అయితే.. రామ మందిరాన్ని బీజేపీ రాజ‌కీయంగా మార్చుకుంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. సమస్యల పరిష్కారం ముఖ్యమా? మతం పేరుతో మోసపోవడం ముఖ్యమా? అని ప్రజల్లో చర్చకు పెడతామని సీనియర్ నేత‌లు చెబుతున్నారు. మత ప్రాతిపదికన ఓటు వేసే పరిస్థితులు దేశంలో పూర్తిగా లేవని వారి అభిప్రాయం. హిందూత్వం బీజేపీ సొత్తు కాదని కూడా ప్రచారం చేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ చేప‌ట్టే ఈ ప్ర‌చారంలో స‌క్సెస్ కాక‌పోతే.. య‌డ్యూర‌ప్ప అన్న‌ట్లుగా అయోధ్య‌కు వెళ్ల‌క‌పోవ‌డం ఆ పార్టీకి శాప‌మే అవుతుంది. దీన్ని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఇప్ప‌టికే కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. త్వ‌ర‌లోనే అక్క‌డ‌కు వెళ్లి పూజ‌లు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =