కరోనా యోధులకు జాతి రుణపడి ఉంది, 2020 లో కఠినమైన పాఠాలు నేర్చుకున్నాం: రాష్ట్రపతి

74th Independence Day, Independence Day, Independence Day 2020, Independence Day 2020 Speech Live, Independence Day eve speech, President Ram Nath Kovind, President Ram Nath Kovind addresses nation, Ram Nath Kovind Addressed the Nation

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల్లో నివసించే భారతీయ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటపు స్ఫూర్తే ఆధునిక భారతానికి పునాది అని రాష్ట్రపతి అన్నారు. “ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పరిమితుల మధ్య జరుగుతున్నాయి. యావత్ ప్రపంచం అన్ని కార్యకలాపాలను స్తంభింపచేసి, అనేక ప్రాణాలను బలికొన్న ప్రమాదకర కరోనా వైరస్ ను ఎదుర్కొంటోంది. ఈ మహమ్మారి రావడానికి ముందు మనం జీవించిన ప్రపంచాన్ని ఈ వైరస్ పూర్తిగా మార్చివేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రభావవంతంగా, సకాలంలో స్పందించింది. ఎక్కువ జనాభాతో కూడిన దేశం ఈ సవాలును ఎదుర్కోవాలంటే చాలా పెద్ద ప్రయత్నాలు అవసరం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ తమ స్థానిక పరిస్థితుల మేరకు చర్యలు తీసుకున్నాయి. ప్రజలు కూడా దీనిని మనస్ఫూర్తిగా సమర్థించారు. నిబద్ధతతో కూడిన మన ప్రయత్నాల వల్ల మనం మహమ్మారి తీవ్రతను నియంత్రించడంలోనూ, ప్రాణనష్టాన్ని తగ్గించడంలోనూ సఫలమయ్యాం. ఇది ప్రపంచానికే అనుసరణీయమని” రాష్ట్రపతి అన్నారు.

“కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో నిరంతరాయం ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు జాతి ఋణపడి ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఈ మహమ్మారితో పోరాడుతూ వీరిలో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. వారు మన జాతీయ కథానాయకులు. కరోనా పోరాట వీరులందరూ గొప్ప ప్రశంసలకు అర్హులు. వారంతా తమ ప్రాణాలను పణంగా పెట్టి మన జీవితాలను కాపాడేందుకు పని చేస్తున్నారని” రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు.

“ఈ సంక్షోభ సమయంలో నిరుపేదలు, దినసరి కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు. వారికి చేయూతనందించేందుకు వైరస్ నియంత్రణ ప్రయత్నాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన’ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం కోట్లాది మంది ప్రజలు జీవనోపాధి పొందగలిగేలా చేసింది. వలసదారులైనవారు దేశంలోని ఏ చోటనైనా రేషన్ ను పొందేందుకు వీలుగా రాష్ట్రాలన్నిటినీ “ఒక దేశం-ఒకే రేషన్ కార్డు” పథకం పరిధిలోకి తేవడం జరిగిందని” చెప్పారు.

“ప్రపంచంలోని ఏ మూలనైనా చిక్కుబడిపోయిన మన వారి సంక్షేమాన్ని కోరుతూ, పది లక్షల మందికి పైగా ప్రజలను ‘వందేభారత్ మిషన్’ కింద స్వదేశానికి తీసుకురావడం జరిగింది. భారతీయ రైల్వే ఈ క్లిష్ట సమయంలోనూ ప్రజలను చేరవేసేందుకు, సరకుల రవాణా చేసేందుకు సేవలను నిర్వహిస్తోంది. మన బలాలపై ఉన్న ఆత్మవిశ్వాసంతో కోవిడ్ 19 తో పోరాడుతున్న ఇతర దేశాలకు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాం. ఇతర దేశాల నుంచి ఔషధాల కోసం పిలుపు రాగానే మనం తక్షణమే స్పందించి కష్టకాలంలో ప్రపంచానికి భారత్ బాసటగా నిలుస్తుందని చూపించాం. మహమ్మారిని ప్రభావవంతంగా తట్టుకునే దిశగా ప్రాంతీయ, ప్రపంచస్థాయి వ్యూహాలను రూపొందించడం లో మనం ముందున్నాం. అంతర్జాతీయంగా మన పట్ల ఉన్న సౌహార్ద భావానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం విషయంలో మనం పొందిన అద్భుతమైన మద్దతే ఇందుకు తార్కాణమని” రాష్ట్రపతి పేర్కొన్నారు.

“2020 లో మనం కొన్ని కఠినమైన పాఠాలను నేర్చుకున్నాం. కంటికి కనిపించని ఒక వైరస్ మనిషి ప్రకృతికి అధిపతి అన్న భ్రమను పటాపంచలు చేసింది. ఇప్పటికైనా మనిషి సరిదిద్దుకుని, ప్రకృతితో సామరస్యంగా జీవించే విషయంలో ఇప్పటికీ సమయం ఉందని నా నమ్మకం. వాతావరణ మార్పు లాగానే ఈ మహమ్మారి మనందరి ఉమ్మడి భవిష్యత్తు విషయంలో ప్రపంచమంతటికి మేలుకొలుపు వంటిది. 21 వ శతాబ్దం మానవాళి తమ విభేదాలను విడనాడి, భూగోళాన్ని రక్షించేందుకు సహకరించుకున్న శతాబ్దంగా గుర్తుండిపోవాలని” అన్నారు.

“భారత ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వర్చువల్ ఇంటర్ ఫేస్ ను తమ విధుల నిర్వహణలో విస్తృతంగా ఉపయోగిస్తూ వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చెప్పడంలో ఆన్ లైన్ కోర్టు కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రాష్ట్రపతి భవన్ లోనూ మేము సాంకేతికతను ఉపయోగించి వర్చువల్ సదస్సులు, ఇతర కార్యక్రమాలను నిర్వహించాం. ఐటీ, ప్రసార సాంకేతికత సాధనాలు ఈ-విద్య, దూర విద్యలను కూడా ప్రోత్సహిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి నుంచే పని చేయడం) ఇప్పుడు పలు రంగాల్లో సర్వసాధారణమైపోయింది. ఆర్ధిక వ్యవస్థ చక్రాలు సజావుగా నడిచేందుకు ప్రభుత్వంలోని పలు రంగాలు, ప్రైవేటు రంగాలు నిరంతం పని చేయడంలో టెక్నాలజీ ఎంతో తోడ్పడింది. కాబట్టి మనం ప్రకృతి సమతౌల్యంతో శాస్త్ర సాంకేతికతలను ఉపయోగించుకుంటే మన మనుగడ, అభివృద్ధి కొనసాగుతాయని నేర్చుకున్నామని” అన్నారు.

“మన పిల్లలకు, యువతకు భవిష్యత్తును నిర్మించే విద్యను ఇచ్చేందుకు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే నాణ్యమైన కొత్త విద్యా వ్యవస్థ వికసితమవుతుందని నా విశ్వాసం. కేవలం పది రోజుల క్రితమే అయోధ్యలో శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణం మొదలైంది. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. దేశవాసులు సుదీర్ఘకాలం సంయమనాన్ని, ఓరిమిని ప్రదర్శించారు. మన న్యాయవ్యవస్థపట్ల అచంచలమైన నమ్మకాన్ని ప్రదర్శించారు. రామజన్మభూమి అంశాన్ని న్యాయ ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవడం జరిగింది. శాంతి, అహింస, ప్రేమ, సామరస్యాల వంటి భారతీయ విలువలను ప్రపంచానికి చూపించారు. ఇక కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మీరందరూ కనబరచిన ఓరిమిని, విజ్ఞతలను ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. మీరంతా జాగరూకతను పాటిస్తారని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారన్న నమ్మకం ఉందని” రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =