తెలంగాణ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం, ఒకేరోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం గర్వకారణం: సీఎం కేసీఆర్

CM KCR Launches Commencement of Classes for MBBS First Year Students in 8 Medical Colleges,TRS Govt To Inaugurate Medical Colleges,Telangana TRS Govt, TRS Govt 8 Medical Colleges Opening,Mango News,Mango News Telugu,TRS Govt, Telangana Politics Latest News And Updates,Telangana CM KCR, KTR, Kalavakuntla Kavitha, Telanagana TRS,K Chandra Shekar Rao,Kalavakuntla Taraka Rama Rao,TRS Latest News And Updates

తెలంగాణలోని ప్రగతి భవన్ లో ఈరోజు దేశ వైద్య విద్యా రంగంలో చారిత్రక సందర్భం చోటుచేసుకుంది. ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం దేశ వైద్య రంగంలోనే నూతన అధ్యాయాన్నిలిఖించింది. 8 మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను ప్రగతి భవన్ లో ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు నాందిపలికారు. ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ వైద్య విద్యార్థులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును, ఉన్నతాధికారులను సీఎం అభినందించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. మరిచిపోలేని రోజు. ఒకనాడు అనేక సమస్యలతో త్రాగునీటికి, సాగునీటికి, కరెంటుకు, మెడికల్ సీటుకి, ఇంజనీరింగ్ సీటుకు ఎన్నో అవస్థలు పడ్డాం. ఈ రోజు స్వరాష్ట్రాన్ని సాధించుకొని, అద్భుతంగా ఆత్మగౌరవంతో బత్రుకుతూ దేశానికి మార్గదర్శనం చేస్తూ అనేక వినూత్నకార్యక్రమాలు చేపడుతున్నాం. మనం ఈ రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం గర్వకారణం. గతంలో మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యపేటలో 4 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. వాటిని విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. మరీ ముఖ్యంగా మహబూబాబాద్ వంటి గిరిజన ప్రాంతంలో, వనపర్తి వంటి మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని చెప్పి కలలో కూడా ఎవరూ ఊహించలేదు. స్వరాష్ట్ర ఏర్పాటు, ఉద్యమకారులుగా పనిచేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలన సారథ్యాన్ని చేపట్టడం మన కలలను సాకారం చేసింది” అని అన్నారు.

“తెలంగాణ ఉద్యమకారుడు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కృషితోనే ఈ 8 కళాశాలల నిర్మాణం రూపుదాల్చింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారికి సహకరించిన ఉన్నతాధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కళాశాల రావాలని మనం సంకల్పించుకున్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల సంఖ్య 17 కు పెరిగింది. 16 జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. మరో 17 జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీటి నిర్మాణం చేపట్టేందుకు ఇన్ ప్రిన్స్ పుల్ కేబినెట్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన 17 కాలేజీల నిర్మాణం కూడా చేపట్టి, భగవంతుడి మన్సిస్తే వీటి ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తానని విన్నవిస్తున్నాను. గతంలో 850 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండేవి. ఈ రోజు ఆ సంఖ్య 2,790 కి పెరిగింది. ఈ సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగి మన పిల్లలందరికీ సీట్లు లభించడం నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. అదే విధంగా పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు మనం గణనీయంగా పెంచుకున్నాం. గతంలో 531 పీజీ సీట్లు ఉంటే, ప్రస్తుతం 1,180 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 మాత్రమే ఉంటే, ఈ రోజు 152 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రత్నాల్లాంటి, వజ్రల్లాంటి విద్యార్థులకు ఇది మంచి అవకాశం. దళిత, గిరిజన, బడుగు బలహీన, బిసి, మైనార్టీ విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం” అని సీఎం తెలిపారు.

“జనాభా నిష్పత్తికి అనుగుణంగా డాక్టర్లు అందుబాటులో ఉండడం ఎంత అవసరమో, పారా మెడికల్ సిబ్బంది సిబ్బంది ఉండడం అంతే అవసరం. అదే వైద్య రంగ పటిష్టతను సూచిస్తుంది. ఈ సంఖ్యను పెంపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ దిశగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అన్ని ప్రాంతాల్లో సమతూకంగా ఉండేట్లు వీటి ఏర్పాటు జరుగుతున్నది. ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఒకే నియోజకవర్గంలో ఉన్నా, వీటి సమగ్రాభివృద్ధి జరగాలనీ రెండు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేశాం. కరోనా వంటి పాండమిక్ భయోత్పాతాన్ని మనం చూశాం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యరంగాన్ని పటిష్టం చేస్తున్నాం. ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా గొప్ప రక్షణ కవచంగా ఉండాలని వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నది. అన్ని రంగాల్లో తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. వైద్యరంగంలో కూడా తెలంగాణను దేశం అనుకరించే విధంగా యువ రాష్ట్రమైన తెలంగాణ ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది. పేదల ప్రజల సంక్షేమమే ద్యేయంగా వైద్యరంగానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ముందుకు సాగాలి. పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత కాబట్టీ ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదు. రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు త్వరలోనే ప్రారంభించుకునేలా వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు చర్యలు చేపడతారు” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ ఎస్.మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్ రెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, వైద్యశాఖ అధికారులు గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =