ఆరు గ్యారెంటీల‌కు కోడ్ టెన్ష‌న్‌..!

Code Tension For Six Guarantees, Code Tension, Six Guarantees Code Tension, Six Guarantees, Elections Code, Telangana, Congress Government, Latest News On Six Guarantees, Six Guarantees News Update, Congress Six Guarantees, Election Code, Telangana Congress, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
six guarantees, Elections Code, Telangana, Congress Government

కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ ప్ర‌జాపాల‌న‌కు అపూర్వ స్పంద‌న వ‌స్తోంది. నాలుగు రోజుల్లోనే యాభై ల‌క్ష‌ల మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 6 వ‌ర‌కు ప్ర‌జాపాల‌న కొన‌సాగుతుంది. అర్హులంద‌రికీ ప‌థ‌కాలు అందుతాయ‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వం భ‌రోసా ఇస్తోంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల‌ను అందిస్తామ‌ని చెబుతుండ‌డంతో ప్ర‌జ‌లు ఉత్సాహంగా ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. వ‌రుస ఎన్నిక‌లు టెన్ష‌న్ పెడుతున్నాయి. కోడ్‌ వస్తే హామీల అమలు ఎలా? అని ఇప్ప‌టికే విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ప్ర‌జల్లోనూ ఎన్నో అనుమానాలున్నాయి

ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో ఎక్కువ రోజుల్లో ఎన్నిక‌ల కోడ్ ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వరుసగా రాజ్యసభ, లోక్‌సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. మార్చిలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌, లింగయ్యయాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర స్థానాలకు, మార్చి, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఉంటుంది. వీటితోపాటు ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానానికి ఉప ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఇలా మొత్తం 17 లోక్‌సభ స్థానాలు, 3 రాజ్యసభ స్థానాలు, 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయి. వీటితోపాటు స్థానిక సంస్థల పదవీకాలం ఈ ఏడాదే ముగియనున్నది.

అంతేకాకుండా, ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచ్‌లు 2019 ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించారు. వారి పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియనున్నది. ప్రస్తుత ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు 2019 జూన్‌ 7న ఎన్నికయ్యా రు. వారి పదవీకాలం జూన్‌ 6తో పూర్తవుతుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కారు ఆరు గ్యారెంటీలతోపాటు ఇతర హామీలను నెరవేర్చాల్సి ఉన్నది. రాజ్యసభ, లోక్‌స భ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం లో ఈ ఏడాదిలో అత్యధిక కాలం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. దీంతో కొత్త సర్కారు హామీలను అమలు చేసేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోగానే హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్‌.. ఆ దిశగా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున 50 రోజుల్లో ఆయా పథకాలను అమల్లోకి తెస్తారా? ఎగవేస్తారా? అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లోగా కాంగ్రెస్‌ గ్యారెంటీలకు మార్గదర్శకాలిచ్చి జీవోలు విడుదల చేయాలని, పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితేనే గ్యారంటీలు సరిగ్గా అమలవుతాయని.. లేకుంటే అన్నింటికీ కోతలు తప్పవన్నారు.

ఈ నేప‌థ్యంలో కోడ్‌ అమల్లోకి వచ్చేలోపు విధానపరమైన నిర్ణయాలు తీసుకొని 6 గ్యారెంటీల్లోని 12 పథకాల అమలుకు జీవోలు జారీ చేయాల్సిన అవసరం ఉందని ప్ర‌భుత్వానికి సూచించారు. ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చి కొంటామన్నారని, యాసంగి వడ్లనైనా బోన్‌సతో కొనాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే నిర్ణయం తీసుకొని బడ్జెట్‌ను ప్రకటించాలని, లేకుంటే యాసంగిలో రైతులు నష్టపోతారన్నారు. డిసెంబరు9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలుకాలేదని ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. గ్యారంటీలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందేనన్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ తీసుకునే నిర్ణ‌యాల‌పై ఆస‌క్తి ఏర్ప‌డింది. తాజాగా కూడా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. త‌ప్ప‌కుండా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తామ‌న్నారు. బీఆర్ ఎస్ అన‌వ‌స‌రంగా ప్ర‌జ‌ల్లో గంద‌ర‌గోళం సృష్టిస్తోంద‌ని, కిష‌న్ రెడ్డి.. కేసీఆర్ బినామీ అని ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌క‌ట‌న‌లు అయితే బాగానే ఉన్నాయి కానీ.. ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న నేప‌థ్యంలో కాంగ్రెస్ స‌ర్కారు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో అనే దానిపై ఆస‌క్తి ఏర్ప‌డింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =