దసరా నాటికి 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ పనులు పూర్తి చేయాలి : మంత్రి కొప్పుల ఈశ్వర్

Minister Koppula Eshwar Inspected 125 Feet Dr BR Ambedkar Statue Works

హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన, సచివాలయానికి చేరువలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కొనసాగుతున్న పనుల తీరుతెన్నులు, పురోగతిని గురువారం నాడు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు సాయన్న, అబ్రహం, క్రాంతి కిరణ్, మెతుకు ఆనంద్, ఈఎన్సీ గణపతి రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ విగ్రహ రూపశిల్పి, అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సుమారు రెండు గంటల పాటు సమీక్ష జరిపి, అనంతరం 12 అడుగుల నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ, “భారతరత్న అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. రాష్ట్ర ఏర్పాటుకు మహత్తర ఉద్యమం నడిపి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన సీఎం కేసీఆర్, ఇందుకు రాజ్యాంగం ద్వారా దారి చూపిన అంబేద్కర్ ను గొప్పగా గౌరవించాలనే, భావితరాలకు స్పూర్తినివ్వాలనే మహదాశయంతో 125 అడుగుల విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చారిత్రాత్మక విగ్రహంతో పాటు స్మృతి కేంద్రాన్ని గొప్పగా నిర్మిస్తున్నాం. దేశంలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాలలో ఇదే అతి పెద్దది. 50 అడుగులలో పార్లమెంటును రెండస్తుల భవనంపై 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ రెండస్తులలో మ్యూజియం, గ్రంథాలయం, సమావేశ మందిరాలు, అతిథులకు వసతి కోసం గదులు, ధ్యాన మందిరం, ఫోటో గ్యాలరీ, క్యాంటిన్ ఏర్పాట్లు ఉంటాయి. ఇందుకు సంబంధించిన పనులు 6 నెలలుగా నిర్విఘ్నంగా, పకడ్బందీగా కొనసాగుతున్నాయి” అని చెప్పారు.

దసరా నాటికి 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ పనులు పూర్తి చేయాలి :

“ఇక్కడ ఉన్న ఈ 12 అడుగుల నమూనా విగ్రహంలో ఉన్న చిన్న చిన్న లోపాలను గుర్తించి, వాటిని సరిచేసి 25 అడుగుల నమూనా విగ్రహాన్ని నెల రోజులలో ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దీనిని సీఎం కేసీఆర్ సందర్శించి, అవసరమైన మార్పులు చేర్పులను సూచిస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయి విగ్రహ తయారీ మరింత ముమ్మరం చేస్తారు. దేశం అబ్బురపడే, అన్ని వర్గాల ప్రజలలో స్పూర్తిని నింపే, చైతన్యాన్ని పాదుగొల్పే ఈ విగ్రహ ప్రతిష్ఠ, స్మృతి కేంద్రం ఏర్పాటులో ప్రఖ్యాత రూపశిల్పి పద్మభూషణ్ రాంసుతారా నిమగ్నమయ్యారు. ఎత్తైన, భారీ విగ్రహాల రూపకల్పన, ప్రతిష్ఠలో 96ఏండ్ల రాంసుతారాకు విశేష అనుభవం ఉంది. ఛత్రపతి శివాజీ, వల్లభ్ భాయ్ పటేల్, మహాత్మాగాంధీ, శ్రీరాముడు తదితర మహనీయుల విగ్రహాలకు ఈయనే రూపకల్పన చేశారు” అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాంసూతారాను మంత్రి శాలువతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఈ మహత్తరమైన కార్యాన్ని వచ్చే దసరా పండుగ నాటికి పూర్తి చేయాల్సిందిగా అధికారులకు మంత్రి కొప్పులఈశ్వర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జెఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ఏజెన్సీ ప్రతినిధి కొండల్ రెడ్డి, విగ్రహం రూపకల్పనలో తన తండ్రి రాంసుతారాకు సహకరిస్తున్న అనిల్ సుతారా, క్రిస్టియన్ సమాజం ప్రముఖులు రాయిడిన్ రోచ్, ఎస్సీ కులాల అభివృద్ధి, రోడ్లు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =