2019-20 లో 3.10 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో తెలంగాణకు దేశంలో 8 వ స్థానం

Minister Talasani Srinivas Inaugurated the MPEDA Sub-Regional Office of Hyderabad

రానున్న రోజులలో రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలు, దేశాలకు చేపలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను చేపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని ఎంపీఈడీఏ చైర్మన్ శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర లతో కలిసి ప్రారంభించారు. అనంతంరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మత్స్య కార్మికుల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రంకు దేశంలో 8 వ స్థానం:

మత్స్య రంగ అభివృద్దికి రాష్ట్రంలో అపారమైన వనరులు, అవకాశాలు ఉన్నాయని మంత్రి అన్నారు. 5.72 లక్షల హెక్టార్ల నీటి విస్తీర్ణంతో కర్నాటక, తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉందని చెప్పారు. 2019-20 సంవత్సరంలో 3.10 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి తో తెలంగాణ రాష్ట్రం దేశంలో 8 వ స్థానంలో నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బొచ్చె, రాహు, మ్రిగాల, బంగారుతీగ, గడ్డి చేప వంటి 5 రకాలు మాత్రమే పెంపకం జరుగుతుందని అన్నారు. మత్స్యకారులు అధిక ఆదాయం పొందేందుకు ఎగుమతులకు ఎంతో డిమాండ్ ఉన్న తిలపియా, మంచి నీటి రొయ్యల పెంపకం చేపట్టే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఆధునిక పద్దతులలో చేపల పెంపకం, మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణ, మత్స్యకారులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసం ఎంపీఈడీఏ తో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగిందని చెప్పారు.

జీహెఛ్ఎంసీ పరిధిలో డివిజన్ కు ఒకటి చొప్పున మొబైల్ చేపల విక్రయ కేంద్రం:

రానున్న రోజులలో రాష్ట్రంలో ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ప్రజలకు చేపలను అందుబాటులోకి తీసుకెళ్లేందుకు జీహెఛ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్ లలో డివిజన్ కు ఒకటి చొప్పున మొబైల్ చేపల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తామని అన్నారు. ఈ విక్రయ కేంద్రాలలో చేపలతో పాటు చేపల వంటకాలు కూడా విక్రయించేలా డిజైన్ చేసినట్లు వివరించారు. మత్స్యరంగ అభివృద్ధి, ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎంపీఈడీఏ కు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఎంపీఈడీఏ సంస్థ తమ కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ప్రారంభించడం ఎంతో సంతోషదాయకం అని పేర్కొన్నారు. బహుళజాతి చేపల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించి నీలకంట రొయ్య, తిలాపియ, పండుగొప్ప, వెన్నామి వంటి రకాలను ఉత్పత్తి చేసేందుకు తోడ్పాటును అందిస్తుందని అన్నారు. రాష్ట్రంలో మరిన్ని జలాశయాలు ఉన్నందున కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకం చేపట్టడానికి ఎంపీఈడీఏ సహకారం తీసుకుంటామని అన్నారు. ఎంపీఈడీఏ, మత్స్య శాఖ సమన్వయంతో మత్స్య రంగ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం కోసం చేపట్టవలసిన చర్యలపై సమగ్ర కార్యాచరణ తో ముందుకు వెళతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 15 =