కాంగ్రెస్ చేతికి తెలంగాణ

Telangana hastagata,Congress, brs, bjp, Telangana assembly elections, congress win,Mango News,Mango News Telugu,Telangana Elections 2023,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Telangana Politics,Telangana Assembly polls,Congress Telangana Win,Revanth Reddy Wins,Assembly Election Results 2023,Telangana Latest News and Updates,Telangana hastagata News
Congress, brs, bjp, Telangana assembly elections, congress win

తెలంగాణలో కర్ణాటక ఫలితాలు పునరావృతమయ్యాయి. కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అంచనాలకు మించిన స్థానాల్లో హస్తం పార్టీ విజయకేతనం ఎగురువేసింది. కారు పార్టీకి బ్రేకులు వేసి హస్తం పార్టీ దూసుకెళ్లింది. కాంగ్రెస్ అగ్రనేతలందరూ ఘన విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో, బీజేపీ 8  స్థానాల్లో, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.

కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓడిపోయినప్పటికీ.. కొడంగల్‌లో మాత్రం భారీ మెజారిటీతో గెలుపొందారు. కొడంగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు మధిరలో సీఎల్పీ నేత మల్లు భట్ట విక్రమార్క ఘన విజయం సాధించారు. 33,365 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. అటు ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క మరోసారి విజయకేతనం ఎగురవేశారు. భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రత్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై 54 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అటు మునుగోడు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు  కూడా ఘన విజయం సాధించారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి విజయం సాధించారు. అటు హుస్నాబాద్ నుంచి పొన్న ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తరుపున రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్ మక్కన్ సింగ్, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్, అంధోల్ నుంచి దామోదర్ రాజనర్సింహ, ఇల్లెందులో కోరం కనకయ్య, వర్థన్నపేట నుంచి కేఆర్ నాగరాజు, నర్సంపేట నుంచి దొంతి మాధవ రెడ్డి, వరంగల్ తూర్పు నుంచి కొండాసురేఖ, వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి, తాండూర్ నుంచి మనోహర్ రెడ్డి, పినపాక నుంచి వెంకటేశం, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి, ఖానాపూర్ నుంచి బొజ్జ, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, మానుకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, నాగర్ కర్నూల్ నుంచి కూచుకుంట్ల రాజశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి మైనం పల్లి రోహిత్ రెడ్డి గెలుపొందారు.

ఈసారి రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలవ్వగా.. గజ్వేల్ నుంచి ఘన విజయం సాధించారు. సిద్ధిపేట నుంచి హరీష్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ విజయ ఢంకా మోగించారు. కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ మరోసారి గెలుపొందారు. ప్రత్యర్థి బండి సంజయ్‌పై 326 ఓట్ల మెజార్టీతో గంగుల విజయం సాధించారు. మల్కాజ్ గిరి, మేడ్చల్ నుంచి మామా అల్లుళ్లు గెలుపొందారు. మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు.

హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. సికింద్రాబాద్ నుంచి టి.పద్మారావు గౌడ్, కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత గెలుపొందారు. కుత్బుల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థులు కోరుట్ల నుంచి కే. సంజయ్ రావు, బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, నరసాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి నుంచి గూడెం మహిపాల్ రెడ్డి గెలుపొందారు.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. గోషామహల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘన విజయం సాధించారు. అటు కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం సాధించింది. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలను ఓడించి బీబేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గెలుపొందారు. అటు నిర్మల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అటు బీజేపీ అభ్యర్థిగా ఆర్మూర్ నుంచి పోటీ చేసిన పైడి రాకేష్ రెడ్డి  గెలుపొందారు. 29,302 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఎంఐఎం రాష్ట్రవ్యాప్తంగా 7 స్థానాల్లో గెలుపొందింది. చార్మినార్ నుంచి ఎంఐఎం తరుపున పోటీ చేసిన జుల్పీకర్ అహ్మద్ ఆలీ గెలుపొందారు. చాంద్రాయణ గుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. ఎంఐఎం తరుపున బహదూర్ పురా నుంచి పోటీ చేసిన మహ్మద్ ముబీన్, కార్వాన్ నుంచి పోటీ చేసిన కౌసర్ మోహినుద్దీన్, మలక్‌పేట నుంచి పోటీ చేసిన అహ్మద్ బిన్ అబ్దులా బలాల విజయం సాధించారు. అటు సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రత్యేక దూత ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =