తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై పండుగల తర్వాతే నిర్ణయం

Ministers Sub-Committee held Meeting on Education, Telangana Education, Telangana Ministers Sub-Committee held Meeting on Education, Telangana Ministers Sub-Committee Meeting, Telangana News, Telangana Schools, Telangana schools opening, Telangana Schools Reopen, Telangana Schools Reopening, Telangana Unlock 5

తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం సాధ్యం కాదని, బతుకమ్మ, దసరా పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, సత్యవతిరాథోడ్‌తో కూడిన సబ్‌కమిటీ నిర్ణయించింది. పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి సీఎం కేసీఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలలు, గురుకులాలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు ప్రారంభంపై తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. మరోవైపు యూజీసీ, ఏఐసీటీఈ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉన్నతవిద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు నవంబర్‌ 1 వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

కోవిడ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, ఇతర విద్యా సంబంధ అంశాలపై బుధవారం నాడు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ సభ్యులుగా ఉన్న మంత్రుల సబ్ కమిటీ సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, “కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంవత్సరం ఆగిపోకుండా విద్యార్థులు నష్ట పోకుండా ఉండాలని సీఎం కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం ఆగి పోకుండా ఉండాలని ఆన్ లైన్ విద్య అందిస్తున్నాము. రాష్ట్రంలో 96 శాతం మందికి టీవీ లున్నాయి. 40 శాతం మందికి నెట్ సదుపాయం ఉంది. 86 శాతం మందికి ఆన్ లైన్ విద్య అందుతుంది అనేది సర్వే ద్వారా తెలిసింది. పరిస్థితిని బేరీజు వేసుకుని పాఠశాలల పునః ప్రారంభంపై ముఖ్యమంత్రి కేసిఆర్ గారి మార్గదర్శనంలో నిర్ణయం తీసుకుంటాము. ముందు ఉన్నత విద్య కాలేజీలు, తర్వాత పాఠశాలల ప్రారంభం గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ విద్య రెండింటిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 50 శాతం విద్యార్థులు మాత్రమే ఒకరోజు హాజరైతే మిగిలిన వారికి ఆన్ లైన్ ద్వారా బోధించాల్సి వస్తుంది. రానున్న కాలంలో విద్యార్థులకు డిజిటల్ బోధన తప్పనిసరి అవుతుంది. పాఠశాలలను స్థానిక సంస్థలకు అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ “కోవిడ్ వలన పాఠశాలల ప్రారంభంలో జాప్యం జరిగినందున విద్యార్థులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినపుడు ఆన్ లైన్ ద్వారా డిజిటల్ తరగతులు అందించడం మంచి పరిణామం. దసరా పండగ ఉత్సవాలు ప్రారంభం అవుతున్న సందర్భంలో ప్రస్తుతం ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి మనమంతా విద్యార్థులకు ఉపయోగపడే సమిష్టి నిర్ణయం తీసుకుందాం. మనం తీసుకున్న నిర్ణయమే ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుంది కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటాము. విద్యార్థులకు విద్య అందించడమే కాకుండా వారి ఆరోగ్యం కూడా కాపాడడం ప్రభుత్వ బాధ్యత” అని అన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ విద్యార్థుల భవిష్యత్ పట్ల ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంటి దగ్గర కంటే కూడా గురుకులాల్లో పిల్లలని బాగా చూసుకుంటారనే నమ్మకం కలగడం వల్లే నేడు గురుకులాలకు అత్యంత డిమాండ్ పెరిగింది. పాఠశాలల పున:ప్రారంభంలో తల్లిదండ్రుల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలోని విద్యాలయాలలో కామన్ రూల్ పెట్టుకొని విద్యావ్యవస్థ నడిచే విధంగా నిబంధనలు రూపొందించుకోవాలి. ఈరోజు ఫోన్ లు ఉన్నా సరైన సిగ్నల్స్ లేని పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఉంది. వీరికి విద్య అందడం చాలా ముఖ్యం. ఇందుకు ప్రత్యామ్నాయ విధానాలు ఆచరించాలి. ప్రైవేట్ విద్యాలయాల్లో పిల్లలను ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా బిజీ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా విద్య అందించేలా చర్యలు చేపట్టాలి” అని అన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ” పండగల తర్వాత పరిస్థితులను సమీక్షించి విద్యాలయాలు ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకుందాం. తెలంగాణ ప్రభుత్వంలో విద్య అందరికి సమానమే. వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాల్లో ఎలాంటి బేధాలు లేకుండా విద్యా వ్యవస్థ నడిపించాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల విషయంలో ఈ నిబంధనలు ఒకే విధంగా ఉండాలి” అని చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =