అన్నదాతకు అండగా ఉండేందుకే “జై కిసాన్” కార్యక్రమం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Says Janasena Party Will Launch Jai Kisan Program Soon,Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Pawan Kalyan,Actor Pawan Kalyan,Hero Pawan Kalyan,Janasena Party,Janasena,Jai Kisan,Jai Kisan Program,Mango News,Mango News Telugu,Jana Sena Chief Pawan Kalyan To Launch Jai Kisan Program,Janasena Party Will Launch Jai Kisan Program Soon,Jana Sena Chief Pawan Kalyan,Pawan Kalyan Jana Sena All Set To Launch Jai Kisan,Jana Sena Chief Pawan Kalyan To Launch Jai Kisan Program,Pawan Kalyan To Launch Jai Kisan Program Soon,Jai Kisan Program Launch

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలన్నదే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకోసం పార్టీ తరపున “జై కిసాన్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. రకరకాల వ్యవసాయ సంఘాలు, శాస్త్రవేత్తలతో చర్చించి, సంప్రదింపులు జరిపి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నేపథ్యంలో గురువారం సాయంత్రం తిరుపతిలో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “తిరుపతికి వచ్చే ముందే రెండు తుపాన్లు రాబోతున్నాయని సమాచారం ఉన్నా నష్టపోయిన రైతుకు భరోసా కల్పించేందుకు పర్యటన చేయాలని నిర్ణయించుకున్నాం. క్షేత్ర స్థాయిలో పర్యటించిన అనంతరం, మా జిల్లా స్థాయి నాయకులతో కూడా పర్యటనలు జరిపి పంట నష్టంపై నివేదిక తయారు చేస్తాం. ఆ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించడంతో పాటు ప్రజలకు తెలియజేస్తాం” అని పేర్కొన్నారు.

“ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం అందుతుంది. కానీ కౌలు రైతులకు మాత్రం అలాంటి సాయం అందడం లేదు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓడిపోవడానికి ఒక కారణం కూడా కౌలు రైతులను విస్మరించడమే. క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు చాలా మంది కౌలు రైతులు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన పార్టీ ఎంత అండగా నిలిచిందో అదే విధంగా చివరి కౌలు రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వాలు మంచి చేస్తే అండగా నిలబడాలి, చెడు చేస్తే నిలదీయాలి. ఇవాళ లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోతే రూ.5 వేలు, రూ.10 వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. అది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం దగ్గర చాలా నిధులు ఉన్నాయి. మద్యం, ఇసుక వ్యాపారం ప్రభుత్వమే చేసి ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తోంది. మరి అన్నం పెట్టే రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తోంది?” పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

“పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 35 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ఈ డిమాండ్ రాజకీయ లబ్ధి కోసం చేసింది కాదు. క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు ఎకరా పంట వేయడానికి రూ.40 నుంచి రూ.50 వేలు పెట్టుబడి అవుతుందని రైతులు చెప్పారు. అందుకే నష్టపరిహారం రూ. 35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. 48 గంటల్లో కనీసం రూ.10 వేలు ముందస్తు సాయం అందించాలని కోరాం. రూ.10 వేలు ఇవ్వాలని అడగడం వెనక కూడా కారణం ఉంది. ప్రభుత్వం డిసెంబర్ 25 తర్వాత నష్టపరిహారం అందిస్తామని చెబుతోంది. ఇప్పటికే నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ముందస్తుగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 10 వేలు అందించాలని కోరాం. హైదరాబాద్ నగరంలో ఇటీవల వరదలు వస్తే అక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 650 కోట్లు విడుదల చేసి ప్రతి ఇంటికి రూ. 10 వేల సాయం అందించారు. వైసీపీ ప్రభుత్వం కూడా తక్షణ నష్టపరిహారంగా రూ. 10 వేలు అందించాలి. నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. స్పందన రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + three =