తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించం : సీఎం కేసీఆర్

CM KCR has Clarified that Lockdown would not be Imposed in the Telangana State,Mango News,Mango News Telugu,Telangana Lockdown News,No Lockdown In Telangana,Covid-19 Updates In Telangana,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Telangana,Telangana Coronavirus Updates,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,COVID-19 In Telangana,CM KCR,CM KCR Latest News,CM KCRLive,CM KCRLive News,CM KCR Live Updates,CM KCRPressmeet,CM KCR Pressmeet Live,CM KCR Clarifies Lockdown Not Be Imposed in the Telangana,Telangana,Telangana News,Telangana Lockdown,Lockdown In Telangana,KCR rules out lockdown in Telangana,KCR denies lockdown in Telangana,No Lockdown in Telangana State

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా పరిస్థితులపై గురువారం నాడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సమీక్షించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సీజన్ అందుతున్నది, ఇంకా ఎంత కావాలి?, వ్యాక్సిన్ లు ఎంత మేరకు అందుబాటులో వున్నవి, రోజుకు ఎంత అవసరం? రెమిడెసివిర్ మందు ఏ మేరకు సప్లై జరుగుతున్నది, రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని అవసరం అనే విషయాలను, ఆక్సీజన్ బెడ్ల లభ్యత వంటి విషయాల మీద పూర్తిస్థాయిలో చర్చించారు. రెమిడెసివిర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన సీఎం వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు.

12 క్రయోజనిక్ ట్యాంకర్లను చైనా నుంచి అత్యవసరంగా దిగుమతి చేయాలి:

రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 9500 ఆక్సీజన్ బెడ్లు వున్నాయని, వాటిని హైదరాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరో వారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000 కు పెంచాలన్నారు. మెరుగైన ఆక్సీజన్ సరఫరాకోసం ఓక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యాంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి చర్యలను అత్యంత వేగంగా పూర్తిచేయాలని సీఎస్ ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ ల్లో మొత్తం 5980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటుచేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

ప్రతిరోజూ వైద్య అధికారులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలి:

సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో కలిపి లక్షా యాభై ఆరు వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో లక్షా ముప్పైవేలు (85 శాతం) కోలుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. రోజువారిగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని సీఎం తెలిపారు. దీనికి డైరక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబంధించి పాజిటివ్ కేసుల వివరాలు కోలుకున్నవారి వివరాలు హోం క్వారెంటైన్ లో ఎంతమంది వున్నారు, ప్రభుత్వ దవాఖానాల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు, ప్రయివేట్ దవాఖానాల్లో ఎంతమంది అనే వివరాలను పబ్లిక్ డోమైన్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.

500 ఆక్సీజన్ ఎన్రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా వైద్యాధికారులకు ఆదేశాలు:

మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నవాల్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం ఆదేశించారు. ఆక్సీజన్ సరఫరా గురించి సమీక్షించిన సీఎం రాష్ట్రంలో ఆక్సీజన్ లభ్యతను పెంచేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఐఐసిటి డైరక్టర్ చంద్రశేఖర్ తో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆక్సీజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆరాతీసారు. వారి సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సీజన్ ఎన్రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తక్కువ సమయంలో ఆక్సీజన్ ఉత్పత్తిని జరిపే వ్యవస్థలను నెలకొల్పేందుక చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు.

ప్రజలకు ఇంటికే కోవిడ్ మెడికల్ కిట్లు:

కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.

లాక్‌డౌన్‌ విధించలేం:

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎందుకు విధంచగూడదనే విషయం గురించి సీఎం లోతైన విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘లాక్‌డౌన్‌ వల్ల ఉపయోగం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో మోస్ట్ హాపెనింగ్ స్టేట్ కావడం వల్ల ఇక్కడ 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాలనుంచి కార్మికులు పనిచేస్తున్నారు. మొదటి వేవ్ కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధించడం ద్వారా వీరందరి జీవితాలు చల్లా చెదురైన పరిస్థితిని మనం చూసాం. వీరంతా డిస్ లొకేట్ అయితే తిరిగి రావడం కష్టం. అదే సమయంలో రాష్ట్రంలో ధాన్యం పుష్కలంగా పండింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామల్లో 6144 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిండివున్నది. ప్రస్థుతం అక్కడ వడ్ల కాంటా నడుస్తున్నది. వరి కొనుగోలు అంటే ఆశామాశీ వ్యవహారం కాదు. దీనిలో కింది నుంచి మీది దాక చైన్ సిస్టం ఇమిడి వుంటది. ఐకెపి కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవాళ్ళు, మిల్లులకు తరలించే కూలీలు, లారీలు ట్రాన్స్పోర్టు వెహికిల్స్ మిల్లులకు చేరవేయడం, అక్కడ తిరిగి దించడం మల్లా అక్కడినుంచి ఎఫ్.సి.ఐ గోడౌన్లకు తరలించడం, మళ్ళీ అక్కడ దించడం స్టాక్ చేయడం తిరిగి వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం… ఇంత వ్యవహారం వుంటది. ఈ మొత్తం వ్యవహారంలో లక్షలాది మంది భాగస్వాములౌతారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రైసు మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమౌతారు? లాక్‌డౌన్‌ విధిస్తే ఇంతమంది ఎక్కడపోతారు? కార్మికులు చల్లాచెదురైపోతే తిరిగి వారిని రప్పించడం ఎట్లా? కోనుగోలు చేయకపోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు ఎక్కడ పెట్టుకుంటాడు? మొత్తం ధాన్యం కొనుగోల్ల వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించి పోయే ప్రమాదమున్నది. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా వుండే ప్రమాదం వుంది. అదే సమయంలో నిత్యావసర సరుకులు, పాలు కూరగాయలు పండ్లు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు, ప్రసవాలు, పారిశుధ్య కార్యక్రమాలు వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేం. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాక్సీన్లు, మెడిసిన్, ఆక్సీజన్లను ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నం, ఒకవేళ లాక్‌డౌన్‌ విధిస్తే వీటన్నిటికి ఆటంకం ఏర్పడుతది. ఇన్ని కారణాల వల్ల ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుంది. అందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు, కాబట్టి లాక్‌డౌన్‌ విధించలేం. అదే సమయంలో కేసులు ఎక్కువగా వున్న ప్రాంతాలను గుర్తించి వాటిని, మైక్రోలెవల్ కంటైన్మెంట్ జోన్లను ప్రకటించి కరోనా నిరోధక చర్యలను తక్షణమే చేపడుతాం” అని సీఎం వివరించారు.

సీఎం మాట్లాడుతూ ‘‘అదే సందర్భంలో పరిశ్రమలు ఉన్నఫలంగా మూతపడితే అంతా ఆగమాగం కాదా. క్యాబ్, ఆటోలు, డ్రైవర్ల పరిస్థితి ఏమిటి? కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధికోల్పోయే పరిస్థితి తలెత్తి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నది. కరోనా ఏమోగాని ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిస్కినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది. కాబట్టి గతంలో అనుభవాలను దృష్టిలో వుంచుకోని లాక్‌డౌన్‌ ను విధంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.’’ అని సీఎం స్పష్టం చేశారు.

ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలి:

కరోనా నియంత్రణ కోసం ప్రజలు కూడా పూనుకోవాలనీ, ప్రతి వ్యక్తీ స్వచ్ఛందంగా కరోనా మీది యుద్ధంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సమిష్టిగా అందరం కలిసి కొట్లాడితేనే కరోనా అంతమౌతుందని అన్నారు. మేధావులు, బుద్దిజీవులు ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. కరోనా నియంత్రణలో ప్రాణాలకు తెగించి పాటుపడుతున్న వైద్య ఆరోగ్యశాఖకు అభివందనలు తెలియచేశారు. వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది గొప్ప సేవ చేస్తున్నారని వారి కృషి త్యాగం గొప్పదని కొనియాడారు. రెండో వేవ్ మే 15 తర్వాత కరోనా తీవ్రత తగ్గిపోతుందని రిపోర్టులు సూచిస్తున్నాయన్నారు. వ్యాధి నిరోధానికి ఎవరికివారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దని పెండ్లిల్లలో వందకు మించి జమ కావద్దని తెలిపారు. పరిశుభ్రత పాటించాలని, సానిటైజర్లు వాడాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఇటువంటి జాగ్రత్తలే శ్రీరామ రక్షగా సీఎం పేర్కొన్నారు.

ఈ సమీక్షలో ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎంఓ కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, హైల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు, డిఎంఈ రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గంగాధర్ తదితరలు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =