కోటి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తుంది – సీఎం కేసీఆర్

CM KCR, CM KCR Review Meeting, CM KCR Review Meeting over Regulatory Farming, Cultivating Crops, KCR Cultivating Crops, Regulatory Farming, Strategy for Cultivating Crops, Telangana Agricultural News, Telangana CM KCR, Telangana Regulatory Farming

తెలంగాణ రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు అమలు, రైతు బంధు పథకం, తదితర సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 15, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘నియంత్రిత సాగు కేవలం ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించిన విధానం కాదు. తెలంగాణలో వ్యవసాయ విప్లవం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ముందు చూపుతో ఆలోచించి రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, పరిష్కారాలను దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సే కేంద్రబిందువుగా సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానం రూపొందించాం. కరెంటు సమస్య తీరిపోయి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ సమృద్ధి కలిగిన రాష్ట్రంగా రూపుదాలుస్తుంది. ఈ యాసంగిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) దేశవ్యాప్తంగా లక్షా 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 64 లక్షల టన్నులు తెలంగాణ నుంచే సేకరించింది. అంటే దేశం మొత్తంలో 55శాతం ధాన్యం తెలంగాణ నుంచే సేకరించింది. ఈ సందర్భంగా తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఎఫ్.సి.ఐ చైర్మన్ స్వయంగా అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాళ్లకు వ్యవసాయం సరిగా చేయడం రాదని, పాలన చేతగాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అలుముకుంటుందని, రైతాంగం తీవ్ర కష్టాల పాలవుతుందని అప్పటి పాలకులు అవాకులు, చవాకులు పేలారు. కానీ, తెలంగాణ అద్భుతంగా పురోగమించి గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందనడానికి పెరిగిన వ్యవసాయ ఉత్పత్తి గొప్ప తార్కాణమని’’ పేర్కొన్నారు.

‘‘రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి కోటి 30 లక్షల ఎకరాలలో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తున్నది. ఇబ్బడిముబ్బడిగా ధాన్యం ఉత్పత్తి కాబోతున్న నేపథ్యంలో రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానం తెలంగాణ వ్యవసాయ రంగంలో చేయబోయే ఉజ్వల ప్రస్థానానికి నాంది పలుకుతుంది. గతంలో పంజాబ్ రాష్ట్రం వ్యవసాయరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి, దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. అయితే పంటల మార్పిడి విధానం అవలంబించకపోవడం వలన పంజాబ్ లో వ్యవసాయ వైపరీత్యం (పంజాబ్ డిజాస్టర్) సంభవించింది. పంజాబ్ అనుభవం ద్వారా వచ్చిన గుణపాఠాలను అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సమస్యలేవీ తెలంగాణలో ఉత్పన్నం కాకుండా ఉండేవిధంగా నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేసిందని’’ సీఎం కేసీఆర్ అన్నారు.

“నియంత్రిత పంటల సాగు విధానంతో పాటు, ఎరువుల వాడకంపై కూడా రైతులకు అవగాహన పెరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వేసిన ఎరువంతా వినియోగం కాకపోవడం వల్ల భూమిలోనే చాలా పాస్పేట్ (బాస్వరం) నిల్వలు పేరుకుపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పేరుకుపోయిన బాస్వరాన్ని తొలగించడానికి పాస్పేట్ సాలబుల్ బ్యాక్టీరియా (పిఎస్బి) ని వదలడం ద్వారా భూసారాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుంది. ఇలాంటి విధానాలను కూడా నియంత్రిత సాగు విధానం ద్వారా రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది. పంటల మార్పిడి, ఎరువుల వాడకంతో పటు, మార్కెట్లోకి క్రమపద్ధతిలో సరుకును తేవడం, భూసారాన్ని రక్షించడం, మార్కెట్ పరిస్థితులపై విశ్లేషణ, పరిశోదన కూడా నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఉంటాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన ఇతర వ్యవస్థలు కూడా వృద్ధి చెందాలి. మిల్లింగ్ వ్యవస్థ పెరగాలి. ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి. అందుకనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు ఏర్పాటు చేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని” సీఎం కేసీఆర్ అన్నారు.

నియంత్రిత సాగు ద్వారా కలిగే బహుళ ప్రయోజనాలను వివరించిన సీఎం కేసీఆర్:

  • మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే రైతులు పండిస్తారు. దీనివల్ల కొనుగోలు సమస్య, మద్దతు ధర సమస్య తలెత్తదు.
  • భూమి నుంచి పంటలను తీసుకోవడమే కాకుండా, ఆ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పంటల మార్పిడి వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుంది.
  • ఒకేరకం పంట వేయడం వల్ల, ఆ ధాన్యానికి అలవాటైన బ్యాక్టీరియా ఆ పొలాల్లోనే తిష్టవేస్తుంది. చీడ పీడలకు, తెగుళ్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. పంటల మార్పిడి వల్ల బ్యాక్టీరియా పంటలపై తిష్టవేసే ప్రమాదం ఉండదు.
  • నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండి, మురుగునీటి సమస్య తలెత్తే ప్రమాదం తప్పుతుంది.
  • భూమిలో లవణీయత పెరిగి చవుడు బారిపోయే ప్రమాదం ఉండదు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + fifteen =