టిఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులు విజయవంతంపై సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR, CM KCR Review Meeting, CM KCR review meeting on RTC, CM KCR Review Meeting with Officials on TSRTC, KCR On TSRTC Salary Hikes, Mango News, telangana, Telangana CM KCR, telangana cm kcr review meeting on TSRTC, Telangana Political News, Telangana RTC, Telangana State Road Transport Corporation, TSRTC, TSRTC Latest News, TSRTC News, TSRTC Salary Hikes

భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు నివేదించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం లాంటి చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గే అవకాశం లేదని వారు విన్నవించారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఫైనాన్స్ అడ్వయిజర్ రమేశ్, కార్గో స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్, ఇ.డి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ పరిస్థితిని సీఎంకు వివరించారు.

జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదు:

‘‘క్రితం సారి బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలు ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్ కు 15 రూపాయలు పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక భారం మోపింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలోనూ ఆర్టీసీ నష్టాలను చవిచూసింది. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల భారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాల్సి ఉంది. ఒకవేళ జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదు’’ అని అధికారులు సీఎంకు వివరించారు.

రోజుకు 9 కోట్ల ఆదాయం:

‘‘వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైంది. ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితం వచ్చింది. ఆక్యుపెన్సీ శాతం 58 శాతానికి చేరుకుంది. క్రమంగా ఇది పెరుగుతున్నది. దీనివల్ల రోజుకు 9 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. అయితే డీజిల్ రేట్లు పెరుగుతుండడం నష్టదాయకంగా మారుతున్నది. లాక్‌డౌన్ మిగిల్చిన నష్టాలు, పాత అప్పులు ఇంకా గుదిబండగానే ఉన్నాయి’’ అని వారు వివరించారు.

కార్గో సర్వీసులు విజయవంతం, సీఎం కేసీఆర్ అభినందనలు:

ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్శిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసికి 22.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సీఎం చెప్పారు. ప్రజలు కూడా ఆర్టీసీ కార్గో సేవల పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారని సీఎం అభినందించారు. ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్ ను ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని సీఎం అన్నారు. అటు మారుమూల ప్రాంతాలకు, ఇటు నగరంలోని ఇంటింటికి డోర్ డెలివరీ చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు, ప్రయాణీకులకు సేవలు అందించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 8 =