మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయి

Agriculture in Telangana, CM KCR Meeting, CM KCR Meeting on Crops Cultivation and Marketing, Crops Cultivation and Marketing, Crops Cultivation and Marketing In Telangana, kcr meeting, Telangana Agriculture Department, Telangana Agriculture News, Telangana CM KCR

మొక్కజొన్నపంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనే కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం, దాంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెద్దఎత్తున తగ్గించడం, పేదరైతు పాలిట శాపంగా పరిణమించిందన్నారు. పంటల సాగు, మార్కెటింగ్ అంశాలపై మంత్రులు, వ్యవసాయశాఖ అధికారులతో శనివారం నాడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వ్యవసాయరంగ అంశాలపై కీలకంగా చర్చించారు. అంతర్జాతీయ విఫణిలో అవసరాలకుపోను 28 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు నిల్వలున్నాయని, దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు మాత్రమే సాలీనా అవసరం కాగా, 3 కోట్ల 53 లక్షల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని వారు తెలిపారు. అంటే 1 కోటి 11 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు అదనంగా ఉన్నాయని, దీనికితోడు వానాకాలంలో దేశవ్యాప్తంగా మరో 2.04 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న దాదాపు 4 కోట్ల 10 లక్షల మెట్రిక్ టన్నుల పంట త్వరలోనే మార్కెట్లోకి విడుదలవుతుందని, దీంతో ఈ సంవత్సరానికే కాకుండా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడా స్టాకు ఉందని అధికారులు వివరించారు.

ఈ పరిస్థితి ఇలావుంటే, కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవడానికి నిర్ణయించడం పరిస్థితులను మరింత దిగజార్చిందని అధికారులు సీఎంకు వివరించారు. మొక్కజొన్నల మీద విధించే 50 శాతం దిగుమతి పన్నును 35 శాతం తగ్గించి కేవలం 15 శాతం పన్నుతో విదేశాలనుంచి మొక్కజొన్నలను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. తద్వారా దేశంలోని రాష్ట్రంలోని మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించక మొక్కజొన్న రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందన్నారు.

తెలంగాణలో ఉన్న మొక్కజొన్న రైతులకు సరైన ధర ఇప్పించాలనే ఉద్దేశ్యంతో, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కోళ్ల పరిశ్రమ వ్యాపారులతో వ్యవసాయశాఖ చర్చలు జరిపిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎంకు వివరించారు. అయితే, బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్ల దాణా అతి తక్కువ రేటుకే దొరుకుతున్నందున, తెలంగాణలో పండిన మొక్కజొన్నలు కొనడానికి కోళ్ల వ్యాపారులు సుముఖంగా లేరని మంత్రి తెలిపారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగం యాసంగిలో మొక్కజొన్న సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మొక్కజొన్నకు కనీస మద్దతు ధర లభించడం అసాధ్యమేనని సమావేశం అభిప్రాయపడింది. తెలంగాణ మొక్కజొన్న రైతు కనీస మద్దతు ధరను ఆశించే పరిస్థితి లేనేలేదని, ధర ఎంత తక్కువ వచ్చినా ఫర్వాలేదనుకునే రైతులు మాత్రమే మొక్కజొన్న సాగుకు సిద్ధపడే పరిస్థితులు దాపురించాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖామంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =