రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వే, జూన్ 11 నుంచి 27 గ్రామాల్లో : సీఎం కేసీఆర్

CM Chandrashekhar Rao, CM KCR, CM KCR Held Review Meeting with Representatives of Land Digital Survey Agencies, CM KCR Review, CM KCR Review Meeting with Representatives of Land Digital Survey Agencies, Digital Land Survey, Digital survey of agricultural lands, Digital survey of agricultural lands in Telangana, Govt meets with 17 firms on digital land survey, Land Digital Survey, Land Digital Survey Agencies, Mango News, Representatives of Land Digital Survey Agencies, Steps initiated for conduct of digital survey of lands, telangana

రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా జూన్ 11 నుంచి పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని, అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేయాలని, మిగతా 24 గ్రామాలను రాష్ట్రంలోని ఇరవై నాలుగు జిల్లాలనుంచి ఎంపిక చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆధేశించారు. డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు, ప్రగతి భవన్ లో బుధవారం నాడు సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం:

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలోని పేదల భూమి హక్కుల రక్షణ కోసమే ధరణి పోర్టల్ ను అమలులోకి తెచ్చినం. భూ తగాదాలు లేని భవిష్య తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తున్నది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి, వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించి తెలంగాణ ప్రభుత్వ సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకొని, వ్యాపారం కోణంలోంచి మాత్రమే కాకుండా సర్వేను రైతులకు సేవ చేసే ఉద్దేశ్యంతో సామాజిక సేవగా భావించి సర్వే నిర్వహించండి’’ అని సర్వే ఏజెన్సీలకు సీఎం పిలుపునిచ్చారు.

అన్ని అవాంతరాలను అధిగమించి ధరణి పోర్టల్ అద్భుతంగా పనిచేస్తుంది:

పైలట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు, ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాల్లో, అంటే సమస్యలు లేని సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో అనుభవాన్ని గ్రహించాలన్నారు. తద్వారా పూర్తిస్తాయి సర్వేకు విధి విధానాలను ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన అనంతరం పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశమున్నదని సీఎం అన్నారు. ‘‘తెలంగాణను సాధించుకుని అన్ని రంగాలను తీర్చి దిద్దుకుంటున్నం. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి నీల్లందిస్తున్నం. తెలంగాణ ఇవ్వాల పంజాబ్ ను మించి ధాన్యాన్ని పండించే పరిస్థితికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో భూములకు ధరలు కూడా పెరుగుతున్నవి. ప్రజల భూములకు రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మధ్య దళారీలు లేకుండా సామాన్య రైతును పీడించే వ్యవస్థలను తొలగించి పూర్తి పారదర్శకంగా వుండే విధంగా ధరణి పోర్టల్ ను ప్రభుత్వం రూపొందించింది. అన్ని అవాంతరాలను అధిగమించి ధరణి పోర్టల్ అద్భుతంగా పనిచేస్తున్నది. తమకు పీడింపులు లేకుండా రిజిష్ట్రేషన్ తదితర భూ లావాదేవీలు జరుగుతున్నాయని, ప్రజల నుంచి ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటున్నది’’ అని సీఎం తెలిపారు.

భూముల సర్వే పూర్తి బాధ్యత ఏజెన్సీలదే:

గ్రామాల్లో తగాదాలు లేని విధంగా ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ వ్యవహారాలు చక్కబడిన నేపథ్యంలో డిజిటల్ సర్వే నూటికి నూరుశాతం విజయవంతం అవుతుందని సీఎం స్పష్టం చేశారు. డిజిటల్ సర్వే నిర్వహించే విధి విధానాల గురించి సీఎం సర్వే ఏజెన్సీ ప్రతినిధులతో చర్చించారు. వారి కార్యాచరణ గురించి కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల భూముల్లో ఇంచు కూడా తేడా రాకుండా కొలతలు వచ్చే విధంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సర్వే చేపట్టాలని వారికి సూచించారు. తేడాలు రాకుండా సర్వే చేయాల్సిన బాధ్యత సర్వే ఏజెన్సీలదేనని, ఏమాత్రం అలసత్వం వహించి నిర్లక్యం చేసి తప్పులకు తావిచ్చినా, చట్ట పరమైన చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదని సీఎం సర్వే ఏజెన్సీల ప్రతినిధులకు స్పష్టం చేశారు. గ్రామాల్లో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న భూ సర్వే విధానంలో అవలంబిస్తున్న టీపన్ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ ప్రజలతో గ్రామ సభలను నిర్వహించి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సర్వే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కావాల్సిన సహకారం ఏజెన్సీలకు అందిస్తుందని, సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు అందుబాటులో వుంటూ సర్వే ఏజెన్సీలకు సహకరిస్తారని సీఎం చెప్పారు. కాగా సర్వే పూర్తి బాధ్యత ఏజెన్సీలదేనన్నారు.

వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న భూపరిపాలనలో గుణాత్మక మార్పులు రోజు రోజుకూ చోటుచేసుకుంటున్నాయని ఈ సందర్భంగా సీఎం వివరించారు. ‘‘మనిషి ఆదిమానవుడుగా బతుకు ప్రారంభించినప్పుడు భూమిమీద హక్కులు లేవు. మనిషి వ్యవసాయం నేర్చుకున్న అనంతర పరిణామాల్లోనే భూమి మీద హక్కు ప్రారంభమైంది. అటు తర్వాత రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామిక దశ వరకు భూమి హక్కుల ప్రక్రియలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నయి. మారుతున్న కాలంలో ప్రభుత్వాలు కూడా ప్రజల భూములు ఆస్తుల రక్షణ విషయంలో అప్ డేట్ అవుతూ వుండాలి. అందివస్తున్న నూతన సాంకేతిక విధానాలను అనుసరిస్తూ ప్రజల భూములకు ఆస్తులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలి. అదే పని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యాన్ని లక్ష్యాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకుంటరనే నీను మీకు ఈ చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తున్నాను” అని సీఎం సర్వే ప్రతినిధులకు తెలిపారు.

భవిష్యత్తు తరాలకు భూతగాదాలు లేకుండా చేయడంలో భాగంగానే డిజిటల్ సర్వే:

భూ తగాదాలు నూటికి నూరు శాతం లేకుండా పరిష్కరించుకున్న దేశాల్లో ఆదాయం (జీడిపీ) మూడు నుంచి నాలుగు శాతం పెరిగిందని గణాంకాలు నిరూపిస్తున్నాయని సీఎం అన్నారు. తెలంగాణను సాధించుకున్న తర్వాత గత పాలకులు విస్మరించిన ప్రజా సమస్యలలో భూ సర్వే కూడా మిగిలిపోయిందన్నారు. చిన్న తప్పు జరిగినా భవిష్యత్తు తరాలు మూల్యం చెల్లించుకుంటాయన్నారు. ప్రభుత్వాలు చేసే తప్పులకు పేద ప్రజలు ఇబ్బందులు పడొద్దనే గత పాలకుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో తెలంగాణ ప్రభుత్వం భూ సర్వే కోసం చర్యలు చేపట్టిందన్నారు. రైతు బంధు వంటి పంటసాయాన్ని అందిస్తూ, సాగునీరు అందిస్తూ రైతును బాగు చేసుకుంటూ, వ్యవసాయాన్ని స్థిరీకరించుకున్నామన్నారు. విద్య వైద్యం తాగునీరు వంటి రంగాలను ఒక్కొక్కటిగా సక్కదిద్దుకుంటూ వస్తున్న ప్రభుత్వం రేపటి భవిష్యత్తు తరాలకు భూ తగాదాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంలో భాగంగానే డిజిటల్ సర్వేను చేపడుతున్నామని సీఎం తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు, వి.శేషాద్రి, భూపాల్ రెడ్డి, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, డీజీపీ మహేందర్ రెడ్డి, ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, సర్వే లాండ్ రికార్డ్స్ కమీషనర్ శశిధర్, టిఎస్ టిఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు, డిజిటల్ సర్వే సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =