యాదాద్రి పుణ్యక్షేత్రంలో పనులను గడువులోపల పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్

Andhra Pradesh, CM KCR, CM KCR Held Review over Yadadri Temple Development, CM KCR Held Review over Yadadri Temple Development Works, CM KCR Review, CM KCR Review over Yadadri Temple Development Works, CM KCR visits Sri Lakshmi Narasimha Swamy Temple, KCR Asks Officials To Complete Yadadri Temple Renovation, Mango News, Re-inauguration of Yadadri, Refurbished Yadadri temple, Reopening of refurbished Yadadri temple, yadadri temple, Yadadri Temple Development Works

యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున:ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రగతిభవన్ లో శుక్రవారం నాడు సీఎం సమీక్షించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది రూపుదాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం (ఆర్నమెంటల్ లుక్ ) కోసం కార్యాచరణ గురించి సీఎం కేసీఆర్ ఆలయ అధికారులతో చర్చించారు. ఇటీవల యాదాద్రిలో పర్యటించి క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని పరిసర ప్రాంతాలను కలియదిరిగి పలు సూచనలు చేసిన నేపథ్యంలో పనుల పురోగతి ఎంతవరకు వచ్చిందనే విషయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సీఎం ముందుంచారు. వీటిని పరిశీలించిన మీదట నాలుగింటిలో ఒకదాన్ని సీఎం ఖరారు చేశారు. ఉత్తర దిక్కున వున్న ప్రహరీ గోడను తొలగించి, అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15 కల్లా క్యూలైను నిర్మాణం పూర్తికావాలని సీఎం గడువు విధించారు. దీప స్థంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడస్టల్ కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని అన్నారు.

శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్న సీఎం, ఆలయ ప్రహరి గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలన్నారు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా (ఐకానిక్ ఎలిమెంట్ లాగా) కనిపించే విధంగా తుదిమెరుగులుదిద్దాలని సీఎం అన్నారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శనం చక్రం ఏర్పాటు చేసినట్టుగానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమీయాలని అన్నారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్ తో తీర్చిదిద్దాలన్నారు. విష్ణు పుష్కరిణీ కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడలమీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలన్నారు. 80 ఫీట్ల పొడవు వున్న దీప స్థంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలన్నారు. అద్దాల మండపం అత్యంత సుందరంగా నిర్మితమౌతున్నదని సీఎం కితాబిచ్చారు. చివరి అంకం చేరుకున్న ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాలను చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం తిలకించారు.

ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోంది:

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘పునర్నిర్మాణానంతరం ప్రపంచ దేవాలయాల్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం తన ప్రత్యేకతను చాటుకోబోతోంది. నూటికి నూరు శాతం రాతి కట్టడాలతో కృష్ణ శిలలతో నిర్మితమౌతున్న యాదాద్రి దేవాలయం అద్భుత రూపాన్ని సంతరించుకుంటున్నది. పున: ప్రారంభానంతరం లక్ష్మీనారసింహుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వుండే విధంగా గుట్ట పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దాలి” అని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటిడిఏ ప్రత్యేకాధికారి కిషన్ రావు, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఆర్కిటెక్ట్ మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =