కరోనా వ్యాప్తి, మెడికల్ కాలేజీలు ఏర్పాటు, అనాథలైన పిల్లలపై తెలంగాణ కేబినెట్ కీలక చర్చ

Highlights of Telangana Cabinet Meeting, Mango News, Telangana Cabinet, Telangana Cabinet Discusses About Covid-19 Situation, Telangana Cabinet Discusses About Medical Colleges Establishment, Telangana Cabinet Discusses About Orphan Child, Telangana Cabinet Discusses About Orphan Child Covid-19 Situation Medical Colleges Establishment, Telangana Cabinet Key Decisions, Telangana Cabinet Meet, Telangana Cabinet Meeting, Telangana Cabinet Meeting 2020, Telangana Cabinet Meeting Highlights, Telangana Cabinet Meeting In Pragathi Bhavan, Telangana Cabinet Meeting News, Telangana Cabinet Meeting updates

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో వైద్యశాఖ, కరోనా వ్యాప్తిపై కీలకంగా చర్చించారు. అలాగే కరోనా కాలంలో అనాథలైన పిల్లలను కాపాడుకోవడం, వైద్యరంగాన్ని పటిష్టం చేయడం, నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చించారు.

కరోనా కాలంలో అనాథలైన పిల్లలను కాపాడుకోవాలని నిర్ణయం:

రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన గురించిన చర్చతో కేబినెట్ సమావేశాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల పూర్తి వివరాలను తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎదిగే వయస్సులో వున్న పిల్లలు ఓంటరిగా మారి మానసిక వేదనతో పాటు సామాజిక వివక్షను ఎదుర్కుంటూ సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదమున్నది. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి ప్రయోజకులయ్యేంతవరకు వారికి ప్రభుత్వమే ఆశ్రయం కల్పించి అండగా నిలవాలి. గతంలో అనాథ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు వారి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. అనాథ పిల్లలకోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలి. మానవీయ కోణంలో ప్రభుత్వయంత్రాంగం స్పందించాలి. అనాథ పిల్లల అంశానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి’’ అని తెలిపారు.

ఖాళీగా వున్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ సభ్యులుగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ ఆహ్వానితులుగా కొనసాగనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల పరిస్థితుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

వైద్యశాఖపై చర్చ – కరోనా వ్యాప్తిపై ముందస్తు చర్యలు:

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై కేబినెట్ కు వైద్యశాఖ వివరాలు సమర్పించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితి గురించి ఆరా తీసింది. రాష్ట్రంలో కొనసాగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై కేబినెట్ చర్చించింది. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంపై, ఆయా జిల్లాల ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి సవివరంగా కేబినెట్ కు వైద్యాధికారులు సమాచారం అందించారు. సమస్యాత్మక జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆక్సీజన్, మందులు, బెడ్స్, తదితర ఔషదాల లభ్యతపై విస్తృతంగా కేబినెట్ చర్చించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, అన్ని రకాల మందులు, ఆక్సీజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులకు కేబినెట్ ఆదేశించింది. కేసులు ఎక్కువగా నమోదవున్న సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలను పర్యటించి రావాలని, తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించింది. కరోనాను కట్టడి చేయడంలో ప్రజలు స్వీయ నియంత్రణను పాటించాలని, అందులో భాగంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలను తీసుకోవాలని కేబినెట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాక్సిన్ తీసుకున్నవాళ్లు కూడా నిర్లక్ష్యం చేయకుండా స్వీయ నియంత్రణను పాటించాలని కోరింది.

వైద్యరంగాన్ని పటిష్టం చేయాలి – నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు:

నూతనంగా మంజూరు చేసిన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనపై కేబినెట్ చర్చించింది. మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావలసిన నిర్మాణాలను చేపట్టాలని, వసతుల కల్పన కోసం తగు ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. హైదరాబాద్ నిమ్స్ ను మరింతగా అభివృద్ధి పరిచి వైద్య సేవలను విస్తృత పరిచేందుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసి వచ్చే కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది. ఇప్పటికే మంజూరైన మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం చేయడానికి సమకూర్చుకోవాల్సిన బెడ్లు తదితర మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించింది. భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కొరకు స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటినుంచే ప్రారంభించాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది.

అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై చర్చించిన కేబినెట్, వాటి సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై వైద్యాధికారుల నుంచి ఆరాతీసింది. త్వరలోనే వీటి నిర్మాణానికై శంఖుస్థాపన చేయాలని ఆదేశించింది.

గచ్చిబౌలిలో ఉన్న టిమ్స్ దవాఖానతో పాటు, హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు ‘‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’’ (టిమ్స్) గా నామకరణం చేయాలని కేబినెట్ తీర్మానించింది. టిమ్స్ గచ్చిబౌలి, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ ఎల్ బీ నగర్, టిమ్స్ అల్వాల్ దవాఖానాలుగా అభివృద్ధి చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్కచోటనే అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కేబినెట్ ఆదేశించింది. వరంగల్ లో ఇప్పటికే మంజూరు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పురోగతిపై చర్చించిన కేబినెట్, త్వరలో నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక పటాన్ చెరువులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను కేబినెట్ మంజూరు చేసింది. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ స్థాపన లక్ష్యంగా, రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో ఇప్పటికీ మెడికల్ కాలేజీ లేని జిల్లాలను గుర్తించి, దశలవారీగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − seven =