ఫిబ్రవరి 1 నుంచి తరగతులు, తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి పత్రం తప్పనిసరి

Education Minister Sabitha Indra Reddy, Mango News, Minister Sabitha Indra Reddy, Reopening of Educational Institutions, Reopening of Educational Institutions In Telangana, Telangana Ministers, Telangana Ministers Over Reopening of Educational Institutions, Telangana Reopening of Educational Institutions, Telangana Schools Reopening, Telangana Schools Reopening News, Telangana Schools Reopening Updates

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలు, కళాశాలలను సమర్ధవంతంగా నిర్వహించి విద్యార్థుల భవితకు భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ తరగతులను నిర్వహించనున్నారు. అయితే, పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుండి తప్పనిసరిగా రాతపూర్వక అనుమతి పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ తరగతులు ప్రారంభమవుతున్న సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం నాడు మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ డెవలప్ మెంట్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ వెల్ఫేర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

ఆన్‌లైన్ తరగతులు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి:

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాదు. వారి ఆరోగ్యం కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ తరగతులను నిర్వహించేందుకు తరగతి వారిగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని మంత్రులు వెల్లడించారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించడంతో పాటు పాఠశాలలను, కళాశాలలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పని సరిగా అమలు చేయాలని మంత్రులు కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే ప్రత్యక్ష బోధనతో పాటు ప్రభుత్వం ఇప్పటికే నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని, విద్యా శాఖ చేపట్టిన సర్వే ప్రకారం దాదాపు 88 శాతం మందికి ఆన్‌లైన్ తరగతులు అందుతున్నట్లు తేలిందని మంత్రులు తెలిపారు. విద్యార్థులు తమ ఇంటి నుంచి వచ్చే సమయంలోనే మాస్కులు ధరించి రావాలని విజ్ఞప్తి చేశారు.

గురుకులాలు, వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి:

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు, వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రులు అధికారులను కోరారు. చాలా కాలం తర్వాత గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ప్రారంభిస్తుండటంతో ఎక్కడైనా మరమ్మతులు అవసరమనుకుంటే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, ఇందుకు సంబంధించి నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రులు వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకానికి, గురుకుల విద్యా సంస్థలు, వసతి గృహాలకు అవసరమైన నిత్యావసర సరకులను ఈ నెల 25 తేదీ నాటికే చేరవేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రులు తెలిపారు. గురుకులాలు, వసతి గృహాల్లో నిద్రించే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

25వ తేదీలోగా ప్రతీ విద్యా సంస్థ తనిఖీ:

జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను వేయడం జరిగిందని, పాఠశాలల వారిగా ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తుందని మంత్రులు తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా ప్రతీ విద్యా సంస్థను తనిఖీ చేసి, వాటిని సన్నద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల యాజమాన్యాలు, సంబంధిత అధికారులు ప్రభుత్వ సంకల్పానికి చేయుతనిచ్చి తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రులు కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, నవీన్ మిట్టల్, బుర్రా వెంకటేశం, రాహుల్ బోజా, నదీమ్, ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + eighteen =