ఆ పోస్టులతో వైసీపీకి చిక్కులు..!

YCP, CM Jagan, AP Politics, AP Elections, YCP leaders, TDP, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, Two TDP Activists Arrested For Posting Against YCP Govt, Latest Jagan Updates, Ap political updates, AP CM YS Jagan Mohan Reddy, Mango News Telugu, Mango News
YCP, CM Jagan, AP Politics, AP Elections

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో  ప‌డ్డాయి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహన్ రెడ్డి ల‌క్ష్యంగా టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ వ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తీ అవ‌కాశాన్నీ వినియోగించుకునే ప‌నిలో ప‌డ్డాయి. అదిలాఉండ‌గా.. ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్ ఏపీ చీఫ్ ష‌ర్మిల‌, ఆమె సోద‌రి సునీత‌ల‌పై కొంద‌రు సోష‌ల్‌మీడియాలో చేస్తున్న పోస్టింగ్‌లు వైసీపీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వాటిలో వైసీపీ పాత్ర ఉందో, లేదో తెలియ‌క‌పోయినా.. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ఆ పార్టీ ప్ర‌మేయంపై చ‌ర్చ జ‌రుగుతోంది. షర్మిలపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులకు నిర‌స‌న‌గా ప‌లుచోట్ల ఆందోళ‌న‌లు కూడా కొన‌సాగుతున్నాయి. నిందితుల‌ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం, అనుచిత పోస్టులు పెడుతూ ఆమెను బలహీన పరచాలనే కుట్రలు చేస్తే సహించబోమంటూ వైసీపీకి వార్నింగ్ ఇస్తున్నారు.

సోష‌ల్‌మీడియా పోస్టుల‌పై సునీత ఇప్ప‌టికే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తనతో పాటు సోదరి వైఎస్‌ షర్మిల, చిన్నమ్మ వైఎస్‌ విజయమ్మపై అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.  తనకు భద్రత కరువైందని, తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని, సమాజంలో పరువుతీస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. బాబాయికి పట్టిన గతే షర్మిలకూ పడుతుందని బెదిరిస్తున్నారని తెలిపారు.

‘‘సమాజంలో గొప్ప పేరున్న కుటుంబ నేపథ్యం, రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రైవేట్‌ జీవితం గడుపుతున్నాను. గత కొన్ని రోజులుగా వర్రా రవీంద్రరెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నుంచి నాపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడే ధోరణిలో నాతో పాటు సోదరి వైఎస్‌ షర్మిల, చిన్నమ్మ వైఎస్‌ విజయమ్మపై అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడు. గత నెల 29న ఇడుపులపాయలో షర్మిలను కలిశాను. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో నా సన్నిహితులు పోస్ట్‌ చేయగా విస్తృత ప్రచారం జరిగింది. ఆ పోస్టును తెరిచి చూడగా… వర్రా రవీంద్రరెడ్డి ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి వీడియోను పోస్ట్‌ చేశాడు. శత్రుశేషం ఉండకూడదని పెద్దలు చెప్పినట్లు అందులో పేర్కొన్నాడు. వాళ్లను కూడా చంపేస్తే ఎన్నికల్లో పనికొస్తుందని పోస్టులో ఉంది. వీడియో చూడగా.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నేను, షర్మిల వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించిన దృశ్యాలున్నాయి. ఆ వ్యక్తి ఫేస్‌బుక్‌ పేజీని చూడగా అందులో వైఎస్‌ విజయమ్మ, షర్మిలకు సంబంధించి బెదిరింపు పోస్టులున్నాయి. నన్ను, షర్మిలను కించపరుస్తూ, వైఎస్‌ విజయమ్మ గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులున్నాయి’ అని సునీతారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా.. సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఏపీసీసీ  అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డిపై వైసీపీ నేత‌లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని కాంగ్రెస్   నాయ‌కులు ఆరోపిస్తున్నారు. వైసీపీ మంత్రులు, నాయకులు చేస్తున్న అసత్యప్రచారం, సామాజిక మాధ్యమాల్లో ఆమెపై పలువురు చేస్తున్న ఆరోపణలు, దూషణలు సిగ్గుచేటని అంటున్నారు. ఇదే విష‌య‌మై వైఎస్సార్టీపీ మాజీ నాయకులు పిట్ట రాంరెడ్డి, ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్‌ జి.కవిత, డి.నాగమణి, కె.ఎస్‌ శిల్పాచారి, బానోతు సుజాత మంగీలాల్‌, నీలం రమేష్‌ తదితరులు మీడియాతో  మాట్లాడారు. ఏపీలో జగన్‌ పాలనలో వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారని,  అందుకే కొంతమంది విలువలు లేని నాయకులు ఆమె వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమెపై వివిధ సందర్భాల్లో దాడులు జరిగినప్పుడు,  విజయమ్మపై కూడా దాడి జరిగిన సందర్భాల్లో ఏపీ మంత్రులు, అధికార పార్టీ నాయకులు, సీఎం ఎందుకు స్పందించలేదన్నారు.  షర్మిలను తిడుతున్నారంటే జగన్మోహన్‌ రెడ్డిని తిట్టినట్టేనన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + one =