జేఎన్‌యూలో ఉద్రిక్తత, విద్యార్థులపై దుండగుల దాడి

Akhil Bharatiya Vidyarthi Parishad, Attacks On JNU Students, Jawaharlal Nehru University, Jawaharlal Nehru University Protest, JNU Attack Latest News, latest political breaking news, Mango News Telugu, Masked Mob Entered In JNU Campus, national news headlines today, national news updates 2020, national political news 2020

ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో జనవరి 5, ఆదివారం రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యూనివర్సిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 25మందికిపైగా విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తుంది. యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు గాయపడిన విద్యార్థులందరిని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ముసుగులు ధరించిన వ్యక్తులు తనను తీవ్రంగా గాయపరిచారని ఘోష్‌ తెలిపారు. విద్యార్థులపై దాడులను అడ్డుకునే దశలో ప్రొఫెసర్లపైనా దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. దాదాపు రెండు గంటల పాటు కర్రలు, ఇనుప రాడ్లతో ముసుగులు వేసుకువచ్చిన వ్యక్తులు యూనివర్సిటీలో భయానక వాతావరణం సృష్టించినట్టుగా విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనపై జేఎన్‌యూఎస్‌యూ, ఏబీవీపీ  పరస్పరంగా విమర్శలు చేసుకుంటున్నారు.

జేఎన్‌యూలో జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందించారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకుని, నివేదిక అందజేయాలని ఆదేశించారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను కోరారు. యూనివర్సిటీ క్యాంపస్‌ల్లోనే మన విద్యార్థులకు రక్షణ లేకపోతే, దేశం ఏవిధంగా ముందుకు వెళ్తుందంటూ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక సంఘటనను పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖ వ్యక్తులు ఖండించారు. అలాగే ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eight =