కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఈ రోజు సాయంత్రం భేటీ అయ్యారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన మధ్య కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం, అధికారంలో భాగస్వామ్యమవడానికీ తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం, కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీతో పవార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఇరు పార్టీలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతో ఈ సమావేశంపై బీజేపీ నాయకులు దృష్టి సారించారు.
మరో వైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు మధ్యాహ్నం శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమితో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనా అనే విలేకరి ప్రశ్నకు స్పందిస్తూ, ‘ఎన్నికల సమయంలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీచేశాయి. అలాగే మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి పోటీశాయి. ఎవరు ఎటు వెళ్తారో వారే నిర్ణయించుకోవాలి. వారి రాజకీయాలు వారు చేస్తారు మా రాజకీయాలు మేము చేసుకుంటాం’ అని బదులిచ్చారు. ఈ కూటమి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సోనియా గాంధీతో పవార్ భేటీ ముగిసిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
[subscribe]



